రంగులు మార్చే సూర్యుడు

22 Feb, 2021 19:17 IST|Sakshi

కబిని నది కేరళలో పుట్టి కర్నాటకలో ప్రవహిస్తూ కావేరి నదిలో సంగమిస్తుంది. నాగర్‌హోల్‌ నేషనల్‌పార్క్, బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌లకు మధ్యగా సాగుతుంది ఈ నది ప్రయాణం. పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ. ఏనుగులు గుంపులు గుంపులుగా పోతుంటాయి. మైసూర్‌ను పాలించిన వడయార్‌ల వేట వినోదానికి వేదిక నాగర్‌హోల్, ఇది బ్రిటిష్‌ పాలకుల వేసవి విహారకేంద్రం కూడ. ప్రకృతిమాత... కబిని తీరాన్ని సమతులంగా డిజైన్‌ చేస్తే, కర్నాటక టూరిజం పర్యాటకులకు సౌకర్యాలతో ముంచెత్తుతోంది. నది తీరాన వందలాది ఎకరాల్లో విస్తరించిన ఇసుల తిన్నెలు... నీటికి– నేలకు మధ్య అత్యాధునికమైన రిసార్టులతో పరస్పర వైవిధ్యభరితమైన కబిని తీరం మైసూర్‌ నగరానికి 80 కి.మీల దూరాన ఉంది.

లాంతరు వెలుగులో గూడు పడవ విహారం
జానపద సినిమాల్లో ఉన్నట్లు గూడు పడవలు, వెలుతురు కోసం గాజు చిమ్నీ బుడ్డిదీపాలు. కేన్‌ కుర్చీలు, అరోమాటిక్‌ క్యాండిల్‌ వెదజల్లే మంద్రమైన కాంతితోపాటు సువాసనలు. పురాతన నేపథ్యంలో అధునాతనమైన క్యాండిల్‌లైట్‌ డిన్నర్‌ చేస్తూ గూడు పడవలో విహారం... దీనికి దీటుగా స్వచ్ఛమైన నీటితో స్విమ్మింగ్‌పూల్, కనుచూపు మేరలో ఉన్నదంతా స్విమ్మింగ్‌ పూలేనేమో అని భ్రమకు లోను చేసే ఫ్లోర్‌... చూపు తిప్పుకోనివ్వవు. కబిని తీరంలో పర్యాటకుల కోసం ఏర్పాటైన రిసార్టులు రెల్లు గడ్డి, ఎర్ర పెంకు పై కప్పుతో పొదరింటిని పోలి ఉంటాయి. బయటకు గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఈ రిసార్టులు లోపల అటాచ్‌డ్‌ బాత్‌రూములతో విశాలమైన ఏసీ గదులు, రూమ్‌ హీటర్‌లు, ఫ్రెంచ్‌ కాఫీ మేకర్‌లతో అత్యంత ఆధునికంగా ఉంటాయి. 

రంగులు మార్చే సూర్యుడు
ఉదయాన్నే నిద్రలేచి ఒళ్లు విరుచుకుంటూ కాఫీ మగ్గు చేత్తో పట్టుకుని కాటేజ్‌ బయట అడుగుపెడితే మరో ప్రపంచంలోకి ఊడిపడినట్లు ఉంటుంది. ఉదయాన్నే ఏనుగు నోటికి ఒక చెరకు గడ అందించి, పక్షుల కిలకిలరవాల ప్రతిధ్వనుల కోసం చెవి ఒగ్గి నేషనల్‌ పార్కులో ఎడ్ల బండిలో సవారీ చేయడం ఆధునిక జీవితానికి దొరికే అరుదైన సంతోషం. సూర్యుడు అస్తమించే క్షణాలు ఇక్కడ అత్యంత అపురూపం. క్షణక్షణానికీ రంగులు మారే సూర్యుడిని ఓపిగ్గా ప్రతిబింబిస్తుంది నది. ఆ విచిత్రాన్ని చూస్తున్న పిల్లలు ఆ రంగుల్లో షేడ్‌లకు పేర్లు పెడుతుంటే సూర్యుడు చెప్పా పెట్టకుండా నిశ్శబ్దంగా అస్తమిస్తాడు.

నది మాత్రం అన్ని రంగులనూ తనలో శోషించుకుని ఇక ఏ రంగూ లేని తిమిరాన్ని ఆశ్రయిస్తుంది. ప్రకృతి సౌందర్యారాధనలో సాచురేషన్‌కెళ్లిన తర్వాత ట్రైబల్‌ డ్యాన్సులు ఆహ్వానిస్తాయి. వీటితోపాటు వైల్డ్‌లైఫ్‌  అంటే ఇదీ అని చూపించే డాక్యుమెంటరీ చిత్రం. పిల్లలతో వెళ్తే మాత్రం కబిని తీరాన ఏనుగు సవారీ చేయడం మర్చిపోకూడదు. నదిలో కోరాకిల్‌ రైడ్‌(వలయాకారమైన పుట్టి లాంటి పడవ) అన్ని వయసుల వారినీ అలరిస్తుంది. ఎక్కువ సమయం కేటాయించగలిగితే నేచర్‌ వాక్‌ను మిస్‌ కాకూడదు.  
                                               
కావేరమ్మ ఒడి చేరే కబిని
కబిని నది కేరళ రాష్ట్రం, వయనాడు జిల్లాలోని పక్రమ్‌ తాలమ్‌ కొండల్లో పుట్టింది. కరోమి, వాలాడ్‌లలో మక్కియాద్, పెరియ నదులు కబినిలో కలుస్తాయి. తర్వాత పెయ్యంపల్లి దగ్గర పనమారమ్‌ నది కలుస్తుంది. వీటి సంయుక్త ప్రవాహం కొంతదూరం సాగాక కబిని నది పాయగా చీలుతుంది. ఈ పాయల మధ్య ఎత్తుగా ఉన్న నేల కురువ దీవి. వందల రకాల పక్షులకు, పూలకు నిలయం ఈ దీవి. ఇంతలో తిరెనెల్లి దగ్గర కబినిలో బ్రహ్మగిరి కొండల్లో పుట్టిన కాళింది నది కలుస్తుంది. వీటితోపాటుగా పాపనాశిని, తారక, నాగు వంటి చిన్న చిన్న నదులు కలుస్తాయి. ఈ ప్రవాహం మొత్తం కావేరి నదిలో కలుస్తుంది.             

చదవండి:
దుబాయ్‌ టూర్‌: అది అరబిక్‌ కడలందం..

వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌; హుమయూన్‌ సమాధి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు