కడలిమీద కోన్‌–టికి

14 Sep, 2020 00:21 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

బాహ్య ప్రపంచానికి ఎంత మాత్రమూ సంబంధం లేకుండా ఉన్న స్థలాలను కూడా నివాసం కోసం మనిషి వెతుక్కుంటూ వెళ్లాడు. అట్లాంటి ఒక దుర్గమ స్థలం, దక్షిణ అమెరికా సముద్ర తీరానికి దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరాన ఉన్న పాలినేషియన్‌ ద్వీపాలు. అట్లా అక్కడికి చేరుకున్న ఇంకాన్‌ జాతి వారు సముద్రమట్టానికి సుమారు పద్నాలుగు వేల అడుగుల ఎత్తుండే అండీస్‌ పర్వతపు లోయలలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేసి అద్భుతమైన నాగరికత సృష్టించారు. రాళ్లు తొలిచి మనుషుల విగ్రహాలు చెక్కారు. పిరమిడ్లు నిర్మించారు. క్రీ.శ. 500–1100 వరకూ ఇక్కడికి వలసలు కొనసాగాయి. అయితే, ఆధునిక శాస్త్రజ్ఞులకు అర్థంకాని ప్రశ్నేమిటంటే, వీళ్లందరూ ఆ కాలంలోనే పసిఫిక్‌ మహాసముద్రం మీద ఎలా ప్రయాణించగలిగారు? సముద్ర ప్రవాహ తోడ్పాటునే నమ్ముకుని వాళ్లు ప్రయాణించివుంటారా? ఆ ప్రాచీనుల సాహసాన్ని నిరూపించడానికి నార్వేకు చెందిన ఎత్నోగ్రాఫర్‌ (మానవజాతి శాస్త్రవేత్త) థార్‌ హెయెర్డ్‌హాల్‌ (1914–2002) ఒక ప్రయోగం చేశాడు. 1947 లో ఒక తెప్ప మీద ఐదుగురు స్నేహితులతో కలిసి 101 రోజులు ప్రయాణించి ఏడు వేల కిలోమీటర్ల దూరంలోని పాలినేషియన్‌ దీవులకు చేరుకున్నాడు. ఆ అనుభవాలను అనంతరం పుస్తకంగా తెచ్చాడు. అదే ‘కడలి మీద కోన్‌–టికి’. దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో ప్రేమ్‌చంద్‌ పబ్లికేషన్స్‌ 1957లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని విద్వాన్‌ దేవరకొండ చిన్ని కృష్ణశర్మ తెలుగులోకి అనువదించారు. దానికి ముందుమాట రాసిన ఎ.ఆర్‌.ఐరావతి ఇలా అంటారు:

1950వ సంవత్సరం నాటి కోన్‌–టికి సముద్రయాన కథలో పూర్వకాలం నాటి పాలినేషియన్‌ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మతః నార్వే దేశానికి చెందిన థార్‌ హెయెర్డ్‌హాల్‌ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతను పాలినేషియన్ల వలస విధానాన్ని మన దృష్టిపథానికి తెచ్చి అది ఒక సజీవసత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత తాను చెప్పదలచుకొన్న దానిని విశదంగా తెలియబరిచాడు. తన సిద్ధాంతాన్ని రుజువు పరచటం కోసం, సహచరులైదుగురినీ ప్రోత్సహించి యాత్ర సాగించాడు. ఈ మహాకార్యం అతన్ని చిరస్మరణీయుడుగా చేస్తున్నది. ఈ యువకుల సాహసం వల్ల చారిత్రకులకూ, భూగర్భ శాస్త్రజ్ఞులకూ అయోమయంగా కనబడుతున్న ఒక అద్భుత సమస్య సుపరిష్కృతమైంది. థార్‌ హెయెర్డ్‌హాల్‌ మేకులు ఉపయోగించకుండా ఇంకాన్‌ జాతివారి ప్రాచీన పద్ధతిని తొమ్మిది బాల్సా దుంగల తెప్పను నిర్మించి, దానినే సముద్రతరణ సాధనంగా చేసి, దానికి ఇంకాన్‌ జాతిలో ప్రాచీనుడైన కోన్‌–టికి పేరు పెట్టాడు.

ఈ యువకుల ఉత్సాహశక్తికి అడుగడుగునా పరీక్షలు జరిగాయి. మనుషులను తినటానికి అలవాటుపడ్డ సొరచేపలతో కలసిమెలసి ఉండవలసిన పరిస్థితులున్నూ కలిగాయి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఈ మిత్రమండలి స్థైర్యం చెక్కు చెదరకపోవటం, ఎంత విపత్తునైనా వినోదప్రాయంగా చూడటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే పరమసత్యాలు. వీటివల్ల ఈ కోన్‌–టికీ యాత్ర ఒక అద్భుత గాథ అయింది.

ఈ సాహసయాత్రకు తగ్గ ప్రోత్సాహమూ, సహాయ సంపత్తీ, శ్రేయోభిలాషులూ కొరత పడలేదు. ఏదిఏమైనా దక్షిణ అమెరికా తీరం నుంచి సుదూరభూములకు కోన్‌–టికి బయలుదేరుతున్నప్పుడు అది ఒక అవివేకపు కుతూహలంగానే పరిగణితమైంది. అయితే నూట ఒకటవ రోజున ఆ పడవ నూతన భూమి చేరుకోగానే ఆ యత్నమంతా ఒక మహాకార్యంగా భావించగల విచిత్ర వాతావరణం కలిగింది.

ఇంతకూ కోన్‌–టికి యాత్ర వల్ల ప్రాచీన ప్రజలు మహా సాహసికులనీ, ఈ యిరవయ్యో శతాబ్దంలోని మనకు అసాధ్యమనిపించే విధంగా తెప్పవంటి పడవ మీదనే పెద్దపెద్ద సముద్ర ప్రయాణాలు వారు చేశారనీ రుజువవుతున్నది. 

మరిన్ని వార్తలు