Panchakshari Nagini: టాలెంట్‌కు మూ'ల'కం

9 Aug, 2022 00:12 IST|Sakshi
పంచాక్షరి నాగిని

కోవిడ్‌ పుణ్యమాని ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్‌ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్‌పాస్‌గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు.
స్మార్ట్‌ ఆలోచనతో ఆన్‌లైన్‌లో రికార్డ్‌ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్‌ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మోటివేటర్‌గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్‌ రైటింగ్‌.. అన్నింటా తానే ఫస్ట్‌ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్‌ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్‌ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది.

హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్‌.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్‌ చదివి ఆపై సివిల్స్‌లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్‌ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్‌గా క్లాసులు చెబుతుంటుంది.

స్కూల్‌ నుంచి ఇస్రోకు
మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్‌ టాలెంట్‌ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్‌ లెవల్‌ సైన్స్‌ ఫేయిర్‌లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్‌ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్‌ కాంపిటీషన్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్‌ రైటింగ్‌లోనూ గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది.

టాలెంట్‌ టెస్ట్‌
కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్‌ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే  22 సెకన్లలో 118 మూలకాల పేర్లు  చదివి కలాం వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్‌లైన్‌లో జరిగిన నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ‘లర్న్‌ సంథింగ్‌ విత్‌ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్‌లో చానల్‌ నిర్వహిస్తోంది. మోటివేటర్‌గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది.

ఆన్‌లైన్‌ రికార్డులు
నా లక్ష్యం సివిల్స్‌ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్‌పాయింట్‌లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది.  
– పంచాక్షరి నాగిని

– ఎస్‌.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి

మరిన్ని వార్తలు