కనువిందు చేసే ట్రెక్కింగ్‌.. వణుకుపుట్టించే చరిత్ర

27 Mar, 2022 11:17 IST|Sakshi

కనువిందు చేసే ట్రెక్కింగ్‌తో పాటు వణుకుపుట్టించే చరిత్ర కూడా ఆ కోట సొంతం. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా గుర్తింపు తెచ్చుకున్న కళావంతిన్‌ దుర్గం గురించి మీరెప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర, ముంబై సమీపంలోని పశ్చిమ కనుమలలో, మాథేరాన్, పన్వేల్‌ మధ్య ఉన్న ఈ కోట.. సముద్ర మట్టానికి 701 మీటర్ల (2,300 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ కోటను కళావంతిన్‌ అనే రాణి గౌరవార్థం నిర్మించారనేది పురాణగాథ.

ఎటువంటి ఆధారం లేని ఇరుకైన రాతి మెట్లు, ఏటవాలు మార్గం.. వర్షంతో ఏర్పడిన నాచు, జారుడు స్వభావం గల రాళ్ళు.. ఇవన్నీ ఆ కోట పైకి ఎక్కేందుకున్న  అడ్డంకులు. అయితే అది ఎక్కిన తర్వాత తేలియాడే మేఘాల నడుమ.. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో తడిసి ముద్దవ్వాల్సిందే. కోట శిఖరాగ్రంలో చిరస్మరణీయమైన క్షణాలను మూటకట్టుకోవాల్సిందే. అందుకే ఈ కోటను climb to heaven ‘స్వర్గారోహణం’గా పిలుస్తారు.

స్థానికుల ప్రకారం ఈ కోట వెనుక భయానక కథలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనేది వారి వాదన. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. ‘ఆ కోట నుంచి అర్ధరాత్రి.. వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తాయి. అందుకే మేము ఆ కోటకు కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం’ అంటారు. ఏదేమైనా జీవితంలో ఒకసారైనా ఈ కోటను ఎక్కి తీరాల్సిందే అని చెప్తారు పర్వతారోహకులు.

మరిన్ని వార్తలు