Kalyani: ఒక్క 20 నిమిషాలు అమ్మతో మాట్లాడి ఉంటే ఆమె బతికి ఉండేది! నేను కూడా..

26 May, 2022 14:56 IST|Sakshi

మానసిక బలానికి ఆశా కిరణ్‌

ఒక్క ఇరవై నిమిషాలు అమ్మతో ఉండి ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేది కాదు. అమ్మలా చాలామంది మానసిక ఆందోళనతో నూరేళ్ల జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలుకుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారిలో యువత ఎక్కువగా ఉంటుంది. వీరిని మానసికంగా దృఢపరిచేందుకు ‘మానసిక హెల్త్‌ హెల్ప్‌లైన్‌’ చాలా అవసరం.

హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ... అవగాహన, ప్రచారం లేక చాలామంది చనిపోతున్నారు. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్న నేటి యువతరానికి దీనిమీద అవగాహన కల్పించాలని పోరాడుతోంది నటి కల్యాణి. ఒకప్పుడు తను కూడా ఇలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యాననీ, తనలా మరెవరూ కాకూడదన్న ఉద్దేశ్యంతో హెల్ప్‌లైన్‌పై అవగాన కల్పిస్తోన్న 31 ఏళ్ల కల్యాణి గురించి ఆమె మాటల్లోనే...

మాది చెన్నై. అమ్మే నా ప్రపంచం. ఆమె శాస్త్రీయ నృత్యకారిణి కావడం వల్ల డ్యాన్స్‌తో పాటు, సంగీతం, నటనను బాగా ఇష్టపడేది. అమ్మానాన్నల బంధం బలహీనంగా ఉండేది. ఇంట్లో ఎప్పుడూ ఇద్దరిమధ్య వాగ్వాదాలు, అరుపులతో చీటికిమాటికి గొడవపడుతుండేవారు. దీంతో అమ్మ మానసికంగా, శారీరకంగా కృంగిపోయేది. అమ్మంటే ఎంతో ఇష్టమున్న నేను ఇవన్నీ చూసి చూసి ఎలాగైనా అమ్మను సంతోషంగా ఉంచాలనుకునేదాన్ని. 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. 
అమ్మకు సాయపడేందుకు ఏడేళ్ల వయసులో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క దాదాపు మూడువందలకు పైగా యాడ్స్‌లో నటించాను. ఎంత బిజీగా ఉన్నా అమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. 22 ఏళ్లకు అమ్మ నాకు పెళ్లి చేసింది. అప్పుడు అమ్మను విడిచి ఉండలేక, నా భర్తతో మాట్లాడి బెంగళూరు వెళ్లకుండా చెన్నైలోని అమ్మ ఇంటికి దగ్గర్లో ఇల్లు తీసుకుని ఉన్నాను. 

సవ్యంగా సాగుతోన్న జీవితంలో... 
అమ్మకు దగ్గరగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అంతా మారిపోయింది. అది 2014 డిసెంబర్‌ 23.. ఎంత కొట్టినా అమ్మ తలుపు తీయడం లేదని నా భర్తకు  చెప్పడంతో ఆయన వచ్చి తలుపులు పగులకొట్టి లోపలికెళ్లి చూస్తే అమ్మ ఉరివేసుకుని కనిపించారు. ఆ తర్వాత ఆమె డైరీ చదివాను. అందులో ఆమె అనుభవిస్తోన్న ఆవేదన కనిపించింది. ఆమె బాధ ఎవరికైనా చెప్పుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనిపించింది.  

నేను కూడా చనిపోవాలని.. 
అమ్మేలోకంగా బతికిన నాకు ఆమె లోటు నన్ను అగాథంలోకి నెట్టేసింది. రోజూ చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఒంటరిగా ఉండిపోయి నిరాశలో కూరుకుపోయాను. రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఒకసారి మానసిక ఆరోగ్యం హెల్ప్‌లైన్‌కు కూడా ఫోన్‌ చేశాను. ఎవరూ ఫోన్‌ తీయలేదు. మరోసారి చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు నా భర్త కాపాడారు.

అప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మ ఆత్మహత్య, నా ఆత్మహత్య ప్రయత్నాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాను. నా పోస్టు చూసిన చాలామంది తమ జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేశామని చెప్పారు. అలాంటి వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకున్నాను. నాలుగేళ్ల కూతురికి తల్లిగా, మరెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదన్న ఉద్దేశ్యంతో మానసికంగా బలహీనంగా ఉన్నవారికి దానినుంచి బయటపడేందుకు అవగాహన కల్పిస్తూ మోటివేట్‌ చేస్తూ నాకు చేతనైన రీతిలో సాయపడుతున్నాను.

ఓటీటీతో కోట్లమందికి అవగాహన 
ఇప్పుడంతా ఓటీటీ చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమేజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది వీక్షకులు ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం 2023 నాటికి ఇండియాలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య యాభైకోట్లకు చేరుతుంది. ఇలాంటి ప్లాట్‌ఫాంలలో జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌ ‘కిరణ్‌ (1800–599– 0019) ’ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి.

24 గంటలు అందుబాటులో ఉండి, మానసిక ఆరోగ్యంపై ఉచితం గా కౌన్సెలింగ్‌ ఇచ్చే హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఎప్పుడూ డిస్‌ప్లే అవ్వాలి. ఈ నంబర్‌కు కాల్‌ చేయడం వల్ల మానసిక నిపుణులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆత్మహత్య ఆలోచనలనుంచి బయట పడేస్తారన్నది నా ఆలోచన.      – కల్యాణి 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు