కమల నవ్వు

29 Oct, 2020 08:28 IST|Sakshi

ఆడవాళ్లతో మాటల్లో గానీ, పోటీల్లో గానీ గెలవలేక పోతున్న క్షీణదశలో మగాళ్ల దగ్గర ఉండే ఆఖరి అస్త్రాన్నే ట్రంప్‌ తన అమ్ముల పొది నుంచి తీశారు. కమలా హ్యారిస్‌ పై సంధించారు. ‘‘ఏమిటంత పగలబడి నవ్వుతుంది ఆమె! నిన్న టీవీలో చూశాను. మనిషిలో ఏదో తేడా ఉంది. ఇంటర్వూ్యలో సీరియస్‌ క్వశ్చన్స్‌ కి కూడా పెద్దగా నవ్వుతోంది!’’ అని పెన్సిల్వేనియా ర్యాలీలో కమలను విమర్శించారు ట్రంప్‌. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కమల అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా గెలిచే అవకాశాలు మెరుగవుతున్నాయి. అంటే.. ట్రంప్‌ విజయావకాశాలు సన్నగిల్లడం. అమెరికా అధ్యక్ష పదవి కోసం ట్రంప్‌పై పోటీ పడుతున్న జో బైడెన్‌ రన్నింగ్‌ మేట్‌ (ఉపాధ్యక్ష అభ్యర్థి) కమలా హ్యారిస్‌. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు కమల. అక్కడ గెలిచి తీరితేనే ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. గత ఎన్నికల్లో (2016) కూడా పెన్సిల్వేనియాలో ట్రంప్‌ కనాకష్టంగా కన్ను లొట్టతో గట్టెక్కారు.

ఇప్పుడు కమల అడ్డుపడుతున్నారు. ‘‘ఎవరైనా ఆ 60 నిముషాల షో చూశారా?! ఆమె నవ్వు చూశారా హా హా. దటీజ్‌ సో ఫన్నీ. హా హా హా. నవ్వుతూనే ఉంది. నవ్వుతూనే ఉంది. వెర్రి నవ్వు. సంథింగ్‌ రాంగ్‌ విత్‌ హర్‌‘ అని కమల నవ్వును ఎన్నికల ప్రచారంలో అనుకరించారు ట్రంప్‌. ఇంటర్వూ్యలో జర్నలిస్ట్‌ నోరా వొడానెల్‌ కమలా హ్యారిస్‌ను సీరియస్‌ ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే కానీ, సీరియస్‌గా ఏమీ అడగలేదు. పైగా ఆమె మహిళ. ఈమె మహిళ. ఆమె ప్రశ్నలకు కమల పెద్దగా నవ్వడం ఎందుకంటే.. ‘ఐ నో. బట్‌ యు టెల్‌ మీ’ అన్నట్లు అడిగిన విధానానికి. ట్రంప్‌కి అది అర్థం కాకుండా ఏమీ ఉండదు. పై చేయిగా ఉన్న మహిళను కించపరచడానికి ఆమె క్యారెక్టర్‌ మీద దెబ్బకొట్టడం, ఆమె మేనరిజమ్స్‌ని అనుకరించడం పురుషుడి స్వభావంలో ఉన్నదే. ట్రంప్‌ లో కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నట్లుంది. 


 

మరిన్ని వార్తలు