అమ్మకు వందనం.. పాతికేళ్లుగా గో సేవ.. ఏటా ఎండు గడ్డి కోసం 3.50 లక్షల ఖర్చు!

5 Nov, 2022 10:15 IST|Sakshi
కోడలుతో కలిసి ఆవులకు బెల్లం తినిపిస్తున్న బదాంబాయి

ఆవులపై అమ్మ ప్రేమ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ల బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతుంటుంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు. 

మదన్‌లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్లు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారంలో రాణించాడు మదన్‌లాల్‌. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు.

1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్‌ పాల్‌ జీవ్‌ దయా ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు బదాంబాయి దంపతులు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు.

బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్‌బాక్స్‌ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్‌లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు.

పాతికేళ్ల అనుబంధం...
ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే చాలు వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. అలాగే దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించి ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు.

ఇప్పుడు గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158కి చేరింది. ప్రతి రోజూ ఉదయమే బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్‌ లు ఆవులకు దాణా, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వేస్తారు.

ఆదివారం, సెలవు రోజుల్లో కొడుకులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా గోశాలకు వచ్చి పనులు చేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అమ్మ వచ్చిందంటే చాలు ఆవులన్నీ ఆమెకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి.

ఆమె వయసు పైబడటం, ఆరోగ్య దృష్ట్యా అమ్మకు ఇబ్బంది కలగగూడదన్న ఉద్దేశ్యంతో ఇటీవల అడ్డుగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. జాలీల నుంచి వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తుంటుంది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని వివరిస్తుంది బదాంబాయి. 

అన్నీ తానై..
2008లో బదాంబాయి భర్త మరణించాడు. అయినా, ఆమె గో సంరక్షణ మానుకోలేదు. 21 ఆవులతో మొదలైన వాటి సంఖ్య వందల్లోకి చేరింది. గడ్డివేయడం, గోశాల శుభ్రం చేయడం, బెల్లం, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆవులతో ఆమె అనుబంధం పెంచుకుంటూనే ఉంది. ప్రతి గోవు బాగోగులు దగ్గర ఉండి చూసుకోవడంలోనే ఆమె రోజు మొత్తం గడుపుతుంటుంది. 

పాలు పితకరు, అమ్మరు
ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది.

చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు.

కాగా ఆవు పేడను ఒక చోట జమ చేసి ఏడాదికోసారి అమ్ముతారు. పేడ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను గోసేవా ట్రస్టుకే జమ చేస్తారు. ఆవులను మేపడం, గడ్డి కోసి వేయడం వంటి పనుల కోసం ఇప్పుడు నలుగురు పనివాళ్లను నియమించారు. వారికి వేతనాలతో పాటు దాణా కొనుగోలు కోసం నెలకు దాదాపు రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు బదాంబాయి కొడుకులు.

నాలుగెకరాల్లో గడ్డి పెంపకం....
ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు.

ఈ జాగ్రత్తతో పాటు ఎండుగడ్డినీ కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. దాతలు కొందరు గడ్డిని అందిస్తారు. ఏటా ఎండు గడ్డి కోసం రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేస్తామని బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్‌లు తెలిపారు.  – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

చదవండి: Venkampalli: వెల్‌కమ్‌ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ
Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా

మరిన్ని వార్తలు