Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా

20 Oct, 2022 09:54 IST|Sakshi
కాట్యాడ ప్రమీల, రమేశ్‌రావ్‌

ఇంకిపోని ఆలోచన

పన్నెండేళ్లుగా వర్షపు నీటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి వాసులైన ప్రమీల, రమేష్‌రావు దంపతులు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంటి ముందు పది వేల లీటర్ల సంపు కట్టారు ఇంటి అవసరాలకు ఈ నీటినే వాడుతుంటారు. పెద్దగా చదువుకోని వీరు వాటర్‌ హార్వెస్టింగ్‌ గురించి చేసిన ఆలోచన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది.  

వర్షపు నీళ్లు భూమిలో ఇంకితే భూగర్భజలం పెరుగుతుందని ఇతర రైతుల లాగే తానూ పొలం దగ్గర ఇంకుడు గుంత తవ్వుకున్నాడట రమేష్‌. ఊట బావితో ఎకరంన్నర భూమిలో పంటలు పండిస్తున్నాడు. అదే విధంగా ఇంటి దగ్గర వర్షపు నీరు వృథాపోకూడదని, ఇంటి అవసరాలకు వాడుకోవాలని ఆలోచన చేసి, ఆచరణలో పెట్టారు. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీళ్లు వృథాగా పోకుండా ఓ పైపు ద్వారా ఆ నీటిని కొన్నాళ్లు బిందెలు, బకెట్లలో పట్టేవారట.

ఆ తర్వాత సంపు ఏర్పాటు చేసి, ఆ నీటిని పైప్‌ ద్వారా మళ్లించాడు. ఆ నీరే ఇంటి అవసరాలు తీరుస్తోంది. తన ఇంటి పైకప్పు మీద ఓ పైపును అమర్చి అందులో ఓ డబ్బా పెట్టాడు. రాత్రి కురిసిన వర్షాన్ని తెల్లవారాక కొలత వేసి ఎన్ని మిల్లీమీటర్లు పడిందో చెప్పేస్తాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని వజ్జెపల్లి గ్రామానికి చెందిన రైతు కాట్యాడ రమేశ్‌రావ్‌. పంటలు సాగు చేయడంలో కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటాడు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుంటాడు.

నీటి కరువుకు చెక్‌
వజ్జెపల్లిలో పన్నెండేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాడు రమేశ్‌. అప్పుడు గ్రామంలో నీటికి తీవ్ర కరువు ఉండేది. రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములు కావడంతో అక్కడ భూగర్భజలాలు పెద్దగా లేవు. ఎంత వర్షం పడినా భూగర్భజలమట్టం కొద్దికాలమే ఉంటుంది. ఆ తరువాత కరువు కాలమే. అలాంటి పరిస్థితుల్లో వర్షం కురిసినన్ని రోజులు నీటిని నిల్వ చేసుకోవాలంటే.. పెద్ద సంపు ఏర్పాటు చేయాలనుకున్నాడు.

పది వేల లీటర్ల సామర్థ్యం గల సంపు నిర్మాణానికి రూ.30 వేల దాకా ఖర్చు చేశారు. వర్షపు నీరు పైపు ద్వారా సంపులోకి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. వర్షం కురిసినన్ని రోజులు ఆ నీరు అంతా సంపులోకి చేరుతుంది. సంపు నిండితే బయటకు వెళ్లేలా ఏర్పాట్లున్నాయి.

ప్రతీ రోజు బట్టలు ఉతకడం, స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సంపు నుంచి నీటిని తోడుకుని వాడుకుంటారు. ఐదారు నెలల పాటు ఈ వర్షపు నీరే వీరి ఇంటి అవసరాలు తీరుస్తోంది. ఈ నీటి ఆధారంగా ఇంటి ఆవరణలో సపోటా, జామ, మామిడి చెట్లు పెంచారు. కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు.  

ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్తు
‘వానాకాలంలో ఎంత వర్షం కురిసినా నీటికి ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొనేవాళ్లం. వాన నీటిని ఒడిసిపట్టుకోవడమే దీనికి పరిష్కారం అనుకున్నాం. ఇంటిపైన పడే ప్రతీ చినుకును పైపు ద్వారా సంపులోకి మళ్లించా. మధ్యలో నీరు ఫిల్టర్‌ అయ్యేలా ఇసుక వేశాం. ఈ విధానం వల్ల నీళ్లు ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటాయి. నీళ్లను ఇంత జాగ్రత్త చేస్తున్నాం కాబట్టి, వాడకంలోనూ పొదుపు పాటిస్తాం. ఆరునెలల పాటు ఈ నీళ్లనే వాడుకుంటాం’ 

ఎన్ని డబ్బులు వచ్చినా సరైన పొదుపు పద్ధతులు పాటించకపోతే ఎంత ఇబ్బంది పడతామో, నీటి విషయంలోనూ అంతే. ఎంత వర్షం కురిసినా నీటికి కష్టాలు ఎదుర్కొనేవాళ్లం. వృథాగా పోయే నీళ్లను జాగ్రత్త చేసుకోవాలనే ఆలోచనను అమలులో పెట్టాక సమస్యను అధిగమించాం. పొలం దగ్గర ఇంకుడు గుంత తవ్వుకోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగింది. మా సొంత ఆలోచనతోనే వర్షపు నీటిని కొలత వేస్తూ, దీని ఆధారంగా పంటలు సాగు చేయడం సులువవుతోంది. – కాట్యాడ ప్రమీల, రమేశ్‌రావ్, రైతు 
–  ఎస్‌.వేణుగోపాల్‌చారి, సాక్షి, కామారెడ్డి

చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా
Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..

మరిన్ని వార్తలు