ఈ ముందు చూపు బాగుంది

30 Jul, 2020 12:51 IST|Sakshi
కనకపుర ఫ్లాట్స్‌ వారు అద్దెకు తీసుకున్న అంబులెన్స్‌

కోవిడ్‌ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. సాయం చేసే చేతులను తగ్గించిఅర్థించే చేతులను పెంచుతోంది. వేలాదిగా పెరుగుతున్న కేసుల్లో తక్షణ వైద్యసహాయం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. బెంగళూరులో ఈ కుటుంబీకులు చేసిన పని బాగుందే అనిపిస్తోంది.

నెల రోజుల క్రితం ఆ రోడ్‌లో నివసించేవారిని ఒక వార్త ఆందోళనలో ముంచెత్తింది. బెంగళూరు కనకపుర రోడ్‌లో ఒక వ్యక్తికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. కుటుంబీకులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. కాని రాలేదు. వచ్చింది చాలా ఆలస్యంగా వచ్చింది. ఈ లోపు ఆ వ్యక్తి మరణించాడు. ఇదయ్యాక అదే రోడ్‌లో నివసించే మరో వ్యక్తికి శ్వాస ఇబ్బందులు వచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే కోవిడ్‌ భయంతో రాలేదు. కుటుంబీకులు ఎలానో తంటాలు పడి అతణ్ణి హాస్పిటల్‌కు చేర్చారు.(అంబులెన్స్‌ .. మృతదేహమైతే లక్ష డిమాండ్‌)

‘ఈ పరిస్థితి పునరావృతం కాకూడదని నిశ్చయించుకున్నాం’ అన్నాడు అబ్దుల్‌ అనే కనకపుర రోడ్‌ వాసి. బెంగళూర్‌లోని కనకపుర రోడ్‌లో ‘సరాకి సిగ్నల్‌’ నుంచి ‘ఎన్‌ఐసిఇ సిగ్నల్‌’ వరకు వందలాది అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. వీటిని 3,700 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ అపార్ట్‌మెంట్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్స్‌ అన్నీ ఒక సమాఖ్యగా మారాయి. ఈ కోవిడ్‌ కాలాన్ని ఎదిరించాలంటే మనకో అంబులెన్స్‌ సిద్ధంగా ఉండాలని తీర్మానించాయి. అంతే. ఆరు నెలల కోసం వారికి ఒక అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా వీరి కోసంగానే పని చేసేలా ఈ సమాఖ్య అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుంది. దీనికి ఇద్దరు డ్రైవర్లను పెట్టింది. ముగ్గురు హోల్‌టైమ్‌ నర్సులను నియమించింది. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సపోర్ట్, వెంటిలేటర్‌ ఏర్పాటు చేసింది. ముగ్గురు నర్సులు షిఫ్ట్‌ల పద్ధతిలో పని చేసి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

‘ఇప్పుడు మా భయం పోయింది. మాకంటూ ఒక అంబులెన్స్‌ ఉంది’ అన్నాడు అబ్దుల్‌.బెంగళూరులో కార్పొరేషన్‌ అంబులెన్సులు సమయానికి బాధితుల ఇళ్లకు చేరడం లేదు. ఇటీవల ఒక వ్యక్తి తన ఇంటికి అంబులెన్స్‌ రాలేదని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటి ముందు ధర్నాకు దిగాడు. మరోవైపు ప్రయివేటు అంబులెన్సులు వంకలు చెబుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. వీటన్నింటి దరిమిలా కనకపుర రోడ్‌ ఫ్లాట్స్‌ అసోసియేషన్ల సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని ఆలోచింప చేస్తోంది. ఈ ముందుజాగ్రత్త బాగుందే అనిపించేలా చేస్తోంది. కోవిడ్‌ కాలంలో ప్రతి జాగ్రత్తా ప్రాణాన్ని కాపాడేదే కదా.

మరిన్ని వార్తలు