ఒక్కడు.. గ్రామాన్ని మార్చాడు! 

24 Nov, 2020 09:03 IST|Sakshi
కంచన లోకేష్, నీటి కుంట

కంచన లోకేష్‌ చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళెం మండలం చింతకుంట గ్రామవాసి. 2013లో పండుగకు తన గ్రామానికి వచ్చారు. గ్రామంలో ఎప్పటిలాగే స్నేహితులు కన్పించలేదు. కరువు కారణంగా గ్రామంలోని రైతులకు పండుగ పట్ల అనాసక్తి పేరుకుపోయింది. ఎక్కువ మంది జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. వలస జీవుల కుటుంబాలను పలకరించారు. అంతదూరం వెళ్లి మనవాళ్లు ఎంత సంపాదిస్తున్నారని వాకబు చేశారు, అరకొర ఆదాయమే పొందుతున్న పరిస్థితిని గ్రహించారు. ఆ మాత్రం ఆదాయం స్వగ్రామంలోనే ఉంటూ పొందవచ్చు అని గ్రామస్తులతో చర్చ పెట్టారు. లోకేష్‌ మాటలు వారిని ఆలోచింపజేశాయి. ఒకరు ఇద్దరై, ఇద్దరు నలుగురై గ్రామస్తులంతా చైతన్య వంతులై ఆయనతో కలసి వెలుగు వైపు నడిచారు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, ఆదాయ వనరులుగా మలిచేందుకు లోకేష్‌ అడుగులు వేశారు. గ్రామీణులకు అవగాహన కల్పించారు. చేతికి పని, పనికి తగ్గట్లు కూలీ, ఆ పనులు ద్వారా సత్ఫలితాలు చేకూరే ఆలోచనలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి ఉద్యోగం మానేశారు లోకేష్‌. గ్రామస్తులతో కలసి పొలం బాట పట్టారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునే విధానాన్ని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిపొందే పనులను గుర్తించారు. ఒక్కొక్కటిగా క్రమం తప్పకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్లారు. రైతుల పంట పొలాల్లోనే 150 నీటి కుంటలు తవ్వించగలిగారు. పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా 22 రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. బీడు భూముల్లో 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు ఉపాధి పథకం అనుసంధానం ప్రక్రియ ద్వారా అవకాశం కల్పించారు. 

ఎస్సీ, ఎస్టీలకు పాడి ఆవులు లభించేలా చర్యలు చేపట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు ఉపాధి హామీ పథకం ద్వారానే వేయించారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా చేస్తుండడంతో గ్రామస్థుల కొనుగోలు శక్తి పెరిగింది. బీడు భూములు జలసిరులతో తులతూగుతూ పంటలతో కళకళలాడుతూ ఉండటంతో వలస నివారణకు మార్గమేర్పడింది. గతంలో 300 మందికి పైగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. విదేశాల నుంచి తిరిగి స్వగ్రామం చేరిన వారు మరోమారు గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. వనరులు పెరగడంలో ఉపాధి ఇక్కడే ఉందని భావిస్తూ, ఎవరికి వారు ఆదాయ వనరులపై దృష్టి సారించారు.

గ్రామాభివృద్ధికి పాటు పడుతున్న లోకేష్‌కు గ్రామస్తులు సైతం అండగా నిలిచారు. ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తూ ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడిన లోకేష్‌ను సర్పంచ్‌గా ఎన్నుకుంటే మరింత ప్రయోజనం లభిస్తుందని భావించారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌ అయ్యింది మొదలు గ్రామంలో లోకేష్‌ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  రైతులు తమ పొలాల్లో బోర్లు వేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున 40 మందికి మంజూరు చేయించారు. గ్రామంలోని చెరువులకు అనుసంధానంగా ఉన్న సప్లయి ఛానల్‌ పునరుద్ధరణ పనులు ఉపాధి పథకంలో మంజూరు చేయించి, కూలీలకు పనులు కల్పించి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా ఆ చెరువులు నిండాయి. 

నేడు ఆయకట్టుదారుల పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. వ్యవసాయంపై ఆధారపడిన వారితో పాటు, కూలీలకు కూడా చేతి నిండా పని దక్కుతోంది. గ్రామస్థులు కలిసికట్టుగా వ్యవహరించడంతో 2,400 మంది జనాభా ఉన్న  చింతకుంట పంచాయితీకి ఉత్తమ పంచాయితీగా రెండుసార్లు అవార్డు దక్కింది. 
– మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి

మరిన్ని వార్తలు