యోగా మా అక్కను మనిషిని చేసింది...

25 Jun, 2021 00:13 IST|Sakshi
అక్క రంగోలితో కంగనా

మా అక్క 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యాసిడ్‌ అటాక్‌ జరిగింది. ఒక కన్ను, వక్షం, చెవి దగ్ధమయ్యాయి. ఆమె బండరాయిగా మారిపోయింది. ఆమెను మళ్లీ మనిషిని చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యోగా ఆమెను కాపాడింది. నేను రోజూ ఆమెను యోగాకు తీసుకెళ్లడంతో ఆమె తిరిగి పూర్తి మామూలు మనిషయ్యింది... అని కంగనా రనౌత్‌ తన కుటుంబం యోగా వల్ల ఎంత లబ్ధి పొందిందో చెప్పుకొచ్చింది.

‘‘2006లో మా అక్క రంగోలికి 21 ఏళ్లు. అవినాష్‌ శర్మ అనే అతను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. మా అక్క తిరస్కరించింది. ఒకరోజు అతను, మరో స్నేహితుడితో కలిసి మా అక్క మీద యాసిడ్‌ కుమ్మరించాడు. మా అక్క చెవి, చెంప, ఒక వక్షం పూర్తిగా దెబ్బ తిన్నాయి. కంటి చూపు పోయింది. ఆమెకు డాక్టర్లు 54 సార్లు కాస్మటిక్‌ సర్జరీ లు చేసి పూర్వపు ముఖం తేవడానికి ప్రయత్నించారు. ఆమెకు రెటినా రీప్లేస్‌మెంట్‌ అయ్యింది.

వక్షాన్ని పూర్వరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒక సంబంధం మాట్లాడితే వచ్చిన కుర్రాడు మా అక్క ముఖం చూసి మళ్లీ రాలేదు. ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు 18 ఏళ్లు. మా అక్క భౌతిక ఆరోగ్యం కంటే కూడా ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించే. ఆ ఆరోగ్యాన్ని ఆమె యోగా నుంచి పొందింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియచేసింది కంగనా రనౌత్‌.

‘మా అక్క ఆ సమయంలో ఒక బండరాయిలా మారిపోయింది. ఏం మాట్లాడినా ఊరికే అలా చూసేది తప్ప స్పందించేది కాదు. మా జోక్స్‌కు నవ్వేది కాదు. అసలు తన మీద తాను విశ్వాసం ఉంచుకుందా లేదా అర్థమయ్యేది కాదు. ఆమెను నేను కాపాడుకోవాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకువెళ్లేదాన్ని. అలాగే నా యోగా క్లాసులకు కూడా తీసుకెళ్లేదాన్ని. అక్కడకు వస్తూ ఉండటం వల్ల క్రమంగా ఆమెకు యోగా మీద ఆసక్తి ఏర్పడింది. ఆమె యోగా చేయసాగింది. ఆమెకు మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవం వచ్చింది. చూపు మెరుగు అయ్యింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడంలో యోగా అద్భుతంగా పని చేసింది’ అని రాసింది కంగనా.

‘మా అమ్మకు ఒక దశలో కొలెస్ట్రాల్‌ పెరిగిందని, డయాబెటిస్‌ ఉందని ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ వరకూ వెళ్లారు డాక్టర్లు. కాని నేను ఆమెను రెండు నెలలు ఆగు అని యోగాసనాలలోకి తెచ్చాను. ఆమె యోగా చేసింది. ఏ సర్జరీ అవసరం ఏర్పడలేదు. ఇవాళ మా ఇంట్లో అందరి కంటే ఆమే ఆరోగ్యంగా ఉంది’ అని రాసింది కంగనా. యోగా అంరత్గత శక్తులను వెలికి తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు యోగాను స్వీకరించాల్సిన, సాధన చేయాల్సిన ఉత్సాహం కలిగితే అది చాలు కదా.

మరిన్ని వార్తలు