Kanika Tekriwal Story: ఆకాశమంత, రూ. 5600 పెట్టుబడితో.. 500 మిలియన్ల టర్నోవర్‌ స్థాయికి..

15 Mar, 2022 00:15 IST|Sakshi
కనికా టేక్రీవాల్‌

మనదేశంలోని విమానయాన సంస్థల్లో అత్యంత పెద్దదైన సంస్థ జెట్‌సెట్‌గో. దీనిని స్థాపించింది ఓ మహిళ. పేరు కనికా టేక్రీవాల్‌. పదేళ్ల కిందట స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఐదు వందల మిలియన్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఐదేళ్ల కిందట ఫోర్బ్స్‌ అండర్‌ థర్టీ విభాగంలో ఆసియాలో ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌ కనికా టేక్రీవాల్‌.

కనికా టేక్రీవాల్‌ది భోపాల్‌కు చెందిన మార్వారీ వ్యాపార కుటుంబం. ఈ కుటుంబానికి దేశవ్యాప్తంగా మారుతీ డీలర్‌షిప్‌ ఉంది. కనిక తండ్రి అనిల్‌ టేక్రీవాల్‌ ఉమ్మడి కుటుంబం భాగాలు పంచుకున్న తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. తల్లి సునీత గృహిణి. కనిక ఆమె తమ్ముడు కనిష్క్‌... ఇదీ వాళ్ల చిన్న కుటుంబం.

మంచి చదువు కోసం అనే కారణం గా సొంతూరికి 17 వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఊటీకి వచ్చి పడిందామె బాల్యం. పదవ తరగతి తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లి పన్నెండు వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ముంబయిలోని బీడీ సోమాని ఇన్‌స్టిట్యూట్‌లో విజువల్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ‘ముంబయి తనకు జీవించడం నేర్పించింది’ అంటోంది కనిక కాలేజ్‌ రోజులను తలుచుకుంటూ.

కారు నుంచి బస్సుకు
‘‘గ్రాడ్యుయేషన్‌కి ముంబయిలో హాస్టల్‌లో ఉన్నప్పుడు మా నాన్న నాకు పాకెట్‌ మనీ చాలా తక్కువగా కచ్చితంగా లెక్కపెట్టినట్లు ఇచ్చేవారు. చేతిలో డబ్బు ఎక్కువ ఉంటే వ్యసనాలకు అలవాటు పడతానని నాన్న భయం. ఈ నేపథ్యంలో ముంబయి నగరం నాకు జీవించడం నేర్పించింది. అప్పటివరకు నేను చూసిన జీవితంలో నేను బయటకు వెళ్లడానికి ఇంట్లో నుంచి కాలు బయటపెడితే ఏ కారు అడుగుతానోనని మా డ్రైవర్‌లు నా చుట్టూ మూగేవాళ్లు. హాస్టల్‌లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి సిటీబస్‌లో ప్రయాణించడం మొదలుపెట్టాను.

నాన్న నెలకు ఒక సినిమాకు డబ్బిస్తే మేము నాలుగు సినిమాలు చూడాలి కదా మరి. అందుకే ఆ పొదుపు. కొన్నాళ్లకు అది కూడా కాదని నెలకు మూడు వందల రూపాయలకు పార్ట్‌టైమ్‌ వర్క్‌ మొదలుపెట్టాను. జీవితంలో అత్యంత సంతోషం అప్పుడు కలిగింది. సొంత సంపాదన ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. ఆ డబ్బును ఖర్చు చేయబుద్ధి కాలేదు. అందుకే మా అమ్మకిచ్చాను. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌కి యూకేకి వెళ్లాను. ఎంబీఏ చేస్తూ ఏరోస్పేస్‌ రీసోర్సెస్‌లో ఉద్యోగం చేశాను.

క్యాన్సర్‌ పరీక్ష
పీజీతోపాటు చదువులో పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లు ఎందుకో తెలియదు కానీ అమ్మానాన్నల దగ్గర ఉందామనిపించింది. నా ఎదురుగా మరో పరీక్ష ఉందని ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటికే నన్ను క్యాన్సర్‌ పీడిస్తోంది. ట్రీట్‌మెంట్‌ సమయమంతా మోటివేషనల్‌ బుక్స్‌ చదవడానికే కేటాయించాను. లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. ఒక సైక్లిస్ట్‌ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ట్రాక్‌లో పోటీపడడం నాకు ధైర్యాన్నిచ్చింది.

నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పన్నెండు కీమో థెరపీలు, రేడియేషన్‌ల తర్వాత మామూలయ్యాను. అప్పటికి నా వయసు 23. ఆ తర్వాత ఏడాది అంటే 2012లో జెట్‌సెట్‌గో ప్రారంభించాను. ఆరోగ్యరీత్యా ఇంతపెద్ద వెంచర్‌ను తలకెత్తుకోవడానికి ఎవరూ ప్రోత్సహించలేదు. ‘ఏమీ చేయకుండా ఊరుకోవడం ఇష్టం లేకపోతే బేకరీ పెట్టి కప్‌కేక్స్‌ చేసుకోవచ్చు కదా’ అని నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనమేం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు.

సామాన్యులకూ సాధ్యమే!
జెట్‌సెట్‌గోలో నా తొలి పెట్టుబడి 5,600 మాత్రమే. ఆ డబ్బుతో యాప్‌ తయారు చేసుకున్నాను. చార్టెడ్‌ ఫ్లయిట్స్‌ను బుక్‌ చేసుకోగలిగిన యాప్‌ అది. రెండేళ్ల పాటు క్లయింట్‌ల నుంచి అడ్వాన్స్‌ పేమెంట్‌ తీసుకోవడంతోపాటు వెండర్స్‌ నుంచి హైర్‌ చేసి వ్యాపారం నిర్వహించాను. అద్దె హెలికాప్టర్‌లతో మొదలైన వ్యాపారం 2020కి ఎనిమిది సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 200 మంది ఉద్యోగులు, 15 కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. మా సర్వీస్‌ ద్వారా 2020–21 ఆరువేల ఫ్లైట్‌లతో లక్ష మంది ప్రయాణించారు.

మా క్లయింట్‌లలో సాధారణంగా కార్పొరేట్‌లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులే ఉంటారు. ఢిల్లీ – ముంబయి, ముంబయి – బెంగళూరు, హైదరాబాద్‌ – ఢిల్లీలకు ప్రయాణించేవాళ్లు ఎక్కువ. మా క్లయింట్‌ అవసరాన్ని బట్టి ఆరు సీట్ల చార్టర్‌ ఫ్లైట్‌ నుంచి 18 సీట్ల ఫ్లయిట్‌ వరకు అందించగలుగుతాం. మెడికల్‌ ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి. మనదేశంలో ఉన్న ప్రైవేట్‌ చార్టర్‌ కంపెనీలలో మాది బెస్ట్‌ ప్రైవేట్‌ చార్టర్‌. ఈ స్థాయికి చేరిన తర్వాత ముంబయిలో ఓ ప్రయోగం చేశాం. హెలికాప్టర్‌లో ప్రయాణించాలనే సరదా చాలామందిలో ఉంటుంది.

కానీ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికి అంత ఖర్చు చేసి చార్టర్‌ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హెలికాప్టర్‌లో విహరించాలనే సరదా బలంగా ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ షటిల్‌ సర్వీస్‌ ప్రయోగం. నగరంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లి రావచ్చన్నమాట. అది కూడా ఊబెర్‌ సర్వీస్‌లో ముంబయిలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లి వచ్చిన ఖర్చులోనే. దూరాన్ని బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేల రూపాయలుగా నిర్ణయించాం. మాది ఎయిర్‌ ట్యాక్సీ సర్వీస్‌ అన్నమాట. భవిష్యత్తులో ఇది బాగా పాపులర్‌ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటోంది కనిక.
 
ఆ హక్కు నాకు లేదు
ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం ఏమిటంటే... కోవిడ్‌ సమయంలో ఉద్యోగులను తగ్గించడం కానీ, జీతాల్లో కోత విధించడం కానీ చేయలేదు. నేను మా ఉద్యోగుల కు సంస్థ లాభాల్లో భాగస్వామ్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కాబట్టి మా నష్టాలను వాళ్లను కొంత పంచుకోమని అడగడం అనైతికం. యజమానిగా నేను నష్టంలో ఉన్న కారణంగా ఉద్యోగుల జీతంలో కోత విధించే హక్కు నాకు ఉండదు.
– కనికా టేక్రీవాల్, జెట్‌సెట్‌గో ఫౌండర్‌

మరిన్ని వార్తలు