మంచి కథ ఎట్లా ఉండాలె

5 Oct, 2020 00:42 IST|Sakshi

కనుపర్తి వరలక్ష్మమ్మ 125వ జయంతి ఉత్సవం ప్రారంభం

‘రాజేశ్వరీ! మీ కథలు యేమి బాగున్నాయండీ అని అంటూనే ఉన్నావు. వాటిమీద ప్రశంసాపూర్వక విమర్శలు పత్రికలో వెలువడుతూనే ఉన్నవి.’ అంటూ వచ్చాడు రాఘవరావు టౌనుహాలు నుండి వస్తూనే. రాజేశ్వరి నవ్వి వూరుకుంది.
‘మధుర భారతీ’ యిప్పుడే టౌనుహాల్లో చూచివచ్చాను. నా కథాసంపుటిపై యెటు వంటి వ్యాసం పడ్డదనుకున్నావు!’
‘ఆ విమర్శకుడెవరు? మీ స్నేహితుడేగాదూ?’ అన్నది రాజేశ్వరి పరిహాసంగా.
‘విమర్శకు మిత్రులే కావలెనా? వస్తువు నాణెమైందయితే యెవరైనా బాగున్నదంటారు.’

‘కానప్పుడు?’
‘మా స్నేహితుల్లో రంధ్రాన్వేషణ పండితులే యెక్కువ. బాగా లేనిదాన్ని బాగా ఉన్నదని వాళ్లు యెన్నటికీ అనరు.’
‘అది యితరుల నెఱసుల నెన్నడంలోనేమోగాని మీలో మీకు గాదు.’
‘అంటే–’
‘మీ మిత్ర మండలిలోనే ఒకరు గ్రంథం వ్రాయడం, యింకొకరు పీఠిక వ్రాయడం, మరొకరు దానిని పత్రికాముఖాన ప్రశంసించడం, దాని నెవరైనా కాదని పొరబాటుగా అంటే వేరొకరు వారిని గట్టిగా మందలించడం. మీ కలిసికట్టుతనానికి ముచ్చటవుతున్నది.’

‘మా రచనలు బాగా ఉండకపోయినా ప్రచారం వల్లనే వ్యాప్తికి తెస్తున్నామని నీ అభిప్రాయమా?’
‘మీకు బాగానే ఉంటవిలెండి. ఇవ్వాళ మీ మధుర కథాసంపుటిపై వారు ప్రశంసావాక్యాలు కురిపిస్తే రేపు వారి కన్నీటి కెరటాలపై మీరూ.’
‘మా నవీన రచయితలను నీవింత నవ్వుటాలు పట్టిస్తున్నావుగాని మేము కలం పట్టిన తర్వాతనే వ్యవహార భాషకూ భావగీతాలకూ, కథారచనకూ చక్కనిబాట యేర్పడ్డది. నేడు కథకూ, గీతానికీ, చోటివ్వని దినపత్రికగాని, వారపత్రికగాని ఒక్కటైనా ఉన్నదేమో చూపగలవా?’

‘కథావాఙ్మయంగాని, గేయవాఙ్మయంగాని ఆంధ్రభాషావధూటికి సరిక్రొత్త సొమ్ములుగావు. భట్టివిక్రమార్కుడి కథలు, కాశీమజిలీ కథలు, పంచతంత్రం కథలు, పన్నిద్దరురాజుల కథలు, అంటూ యెన్నెన్నో కథలు అనాదినుంచీ మనదేశంలో వాడుకలో వున్నవి. ఇక మా జోలపాటలు, దంపుళ్ల పాటల్లో ఉన్న మాధుర్యం ఏ భావకవితకూ తీసిపోదుగదా. మానవులకు కథాప్రియత్వం సహజసిద్ధం. మన చిన్నవాడు చూడండి కథంటే యెంత చెవి కోసుకుంటాడో. కనుక తెలుగువారికి ప్రీతి మేము కలుగచేశామని మీరు జబ్బ చరుచుకుంటే మేము ఒప్పుకోము. అసలు బిడ్డలకు వలెనే కథలకు కూడా మాతృత్వం మాది,’ అన్నది రాజేశ్వరి సగర్వంగా.

‘ఎన్ని మెలికలు త్రిప్పైనా యేయొక్క గౌరవమూ మీ సంఘానికి చెందించాలని చూస్తావు. నీ జాత్యభిమానం అసమానం’ అన్నాడు.
‘మీ శైశవంలో మీకు కథా ప్రీతి కల్గించినది మీ తల్లిగాదు. ప్రతితల్లీ ప్రతిబిడ్డకూ కథాబోధ వల్లనే ప్రపంచజ్ఞానం కలుగజేస్తున్నది.’
‘సరేసరే కానీ’
‘సత్యమైనా అంగీకరించకుండా మనుష్యులను డీలా చేయడంలో మీకున్నంత నేర్పు యెవ్వరికీ లేదు.’
‘నా కథలు బాగున్నవని లోకమంతా పొగుడుతూవుంటే నీవు బాగున్నాయని ఒప్పుకుంటున్నావా?’
‘అందుకు బదులా యిది? మీరు యేదో చాకచక్యంగానే వ్రాస్తారు. కాని ఉత్తమ శ్రేణికి చెందించడానికి తగిన లక్షణాలు మీ కథలకింకా తక్కువే అని నా అభిప్రాయం’.
యింతలో వంటమనిషి సుబ్బమ్మ వచ్చి ‘అమ్మగారూ!’ అన్నది. ‘అవునండోయి, మనం త్వరగా భోజనాలు కానివ్వాలె. సుబ్బమ్మ కనకతార చూడటానికి పోతానని పెందలాడేవచ్చి కనిపెట్టుకుని కూర్చున్నది.

‘అమ్మగారూ నేను వెళ్లుతున్నాను. పాలు వేడిగావుంటే నడవాలో పెట్టాను. కొంచెం తాళి తోడు వేసుకోండి’ అన్నది సుబ్బమ్మ. ‘సరే, వెళ్లు. ఇదిగో పావలా తీసుకుపోయి టిక్కట్టు కొనుక్కో’ అని రాజేశ్వరి పంపించింది.
‘యిందాక నా కథల్లో లోపాలేమిటో వెల్లడిస్తానంటివే’ అన్నాడు రాఘవరావు.
‘ఏదో తమాషాకంటే ఆమాటే పట్టుకున్నారేమిటి?’
‘విమర్శ ప్రయోజనమని నీవు చెప్పుతున్నప్పుడు ఆ ప్రయోజనం అర్ధాంగలక్ష్మివైన నీవే కలుగజేస్తానంటున్నప్పుడు ఆ అవకాశం నేనెందుకు పోగొట్టుకోవాలె?’
‘నేను మీ కథలమాటే చెప్పలేదు సుమండి. మొత్తం యిప్పటి కథలన్నాను.’

‘నా మీద ఆరోపణ లేకుండా వినడమంటే మరీ మంచిదేగా.’
‘ఏదైనా ఒక కథ వ్రాశామూ అంటే అది సర్వవిధ ఆకర్షణ కలదిగా ఉండాలె.’
‘అనగా’
‘అబ్బా! మనోహరమైన ఒక గులాబిపువ్వు యొక్క ఆకృతి, రంగు, మృదుత్వము, పరిమళము, మకరందము మనల నెట్లా ఆకర్షిస్తూ ఉంటాయో అల్లాగే కథాకుసుమం గూడా కల్పన అనే ఆకృతీ, వర్ణన అనే రంగూ, శైలి అనే మృదుత్వమూ, రసమనే పరిమళమూ, నీతి అనే మకరందమూ ఉండాలె. ఇప్పుడు వ్రాయబడే కథల్లో ఒకటుంటే ఒకటుండదు.’
‘నీవు పొరబడుతున్నావు. కల్పనలో మా నవీనులు అసదృశులు గదా.’

‘అసభ్య కల్పనలో ఫస్టు.’
‘ప్రకృతే మా విహార మందిరం గనుక సహజవర్ణనా వైదగ్ధ్యంలో మా కెవరూ సాటిరారు.’
‘వర్ణనా సహజమైన ఉచితాన్ని మీరగూడదు.’
‘మార్దవం మన తెలుగుభాషలోనే సహజంగా చెరుకుముక్కలో తీపిలాగా వున్నది గనుక దానికి ప్రత్యేకంగా ప్రాకులాడవలసిన పనేలేదు.’
‘ఉపయోగించేవారి నేర్పును బట్టే మృదువు మృదువుగా కనపడుతుంది. వసుచరిత్ర పాండిత్య విశేషం చేత గొప్ప గ్రంథమైనప్పటికీ మృదుత్వం లేకపోబట్టే గదా మనుచరిత్రంత లాలిత్యం గలది కాదనిపించుకొంటున్నది.’

‘రసమంటావా? ఇప్పటి కవులందరూ రసజగద్విహారులు.’
‘రసమెప్పుడూ పూవిలో తావివలె వాక్యంలో మిళితమైయుండాలె. కూరలో ఉప్పు వేయకపోవడం యెంత అరుచికరమో, అధికంగా వేయడమూ అంత అరుచికరమే. ఆమధ్య టౌనుహాల్లో యెవరో పండిత కవిగారు మాటమాటకు నవ్వించాడాయన. విన్నంతసేపు బాగానే వున్నది. తీరా యింటికి వచ్చేటప్పటికి యింత ఉపన్యాసంలోనూ నిలవజేసుకోడానికి యేమి కన్పడలేదేమా అని ప్రాణం ఉస్సూరుమనిపించింది’ అంటూ రాజేశ్వరి చివాలున లేచి లోపలికి వెళ్లింది.
రాఘవరావు తింటూ ఉండగా అయిపోయిన రుచిరపదార్థం కొరకు యెదురు చూస్తూవున్నవాడిలాగా రాజేశ్వరి రాకకెదురు చూస్తూవున్నాడు. రాజేశ్వరి పాలల్లో తోడువేసి ఉట్టిమీద పెట్టి మూతపెట్టి ‘మాట్లాడుతూ కూర్చుంటే పాలు చల్లారిపోయినాయి సుమా’ అంటూ సావిట్లోకి వచ్చింది.

‘ఏ పనైనా పదునుమీద ఉండగానే చెయ్యాలె. నీ విమర్శక వాదం గూడా అంతే’ 
‘కథలలో ఉత్తమ మధ్యమాధమాలున్నాయి. శైలీ మాధుర్యమూ, వర్ణనా చాతుర్యము, కల్పనా సౌందర్యము, రసౌచిత్యము, నైతికాదర్శము గలవే ఉత్తమశ్రేణికి చెందిన కథలు. రవీంద్రుని కథలు యిటువంటి శ్రేణికి చెందినవే. అతడు యే నీతినీ, యే ధర్మాన్నీ వెల్లడిగా యేకరువు పెట్టడు. అయినా ప్రతికథా ఏదో ఒక ఉత్తమాదర్శాన్ని వ్యక్తీకరిస్తూనే ఉంటుంది. అన్ని గుణాలు గలిగి నైతికాదర్శం లుప్తమైనవే మధ్యమ తరగతి కథలు. ఇవి జవము జీవము గల భాషలోనే వ్రాయబడుతవి. కాని ప్రజా హృదయంలో స్థిరమైన ఉనికిని సంపాదించుకోలేవు. ఏ నేర్పూ లేక యేదో భావోద్రేకం వల్లనో వ్రాయబడేవి అధమ తరగతి కథలు. ఇప్పుడు పత్రికల్లో ప్రకటింపబడే కథలు చాలావరకు ఈ తరగతికి చెందినవిగానే ఉంటున్నాయి. 
‘కథారచన ఒక కళావిశేషం. దానిని నైతిక శిక్షణాది ప్రయోజనాలకు వినియోగించుకోవాలెనని యత్నించడం అరసికుల పని’ అన్నాడు రాఘవరావు.
‘కళంటే నాకూ యిష్టమే. వట్టి బంగారపు ముద్దకంటే ఆ బంగారంతో చేయబడిన ఆభరణం యెక్కువ అందమైనదిగా ఉంటుందని నాకు తెలియకపోలేదు. బంగారాన్ని యెంత నగిషీ వస్తువుగా నైనా

తయారుచేయవచ్చునుగాని అందులో రాగి గాని యిత్తడిగాని కలిపి దాని విశుద్ధత చెరపడం యుక్తం కాదుగదా’ అన్నది రాజేశ్వరి.
‘ఇంత నీతి మడిగట్టుకొని వ్రాస్తే వాటి అందం చెప్పనక్కర్లేదు.’
‘మరేమీ భయంలేదు. టాల్‌స్టాయి కథలు, ప్రేమచందు కథలు చూడండి. వానికా గౌరవం ఎందువల్ల వచ్చింది?’
ఇంతలో ఉయ్యాల త్రాళ్లు కదలడం మొదలుపెట్టినాయి. నూరుమాటలాడుతున్నా దాని యందు దృష్టి యేమరకుండావున్న రాజేశ్వరి ‘పిల్ల లేచినట్లుంది’ అని చివాలున లేచి పాలు పట్టేపనిలో నిమగ్నమైంది. రాఘవరావు వెన్ను విరుస్తూ లేచి వెళ్లి గదిలో మంచం మీద మేను వాల్చాడు.

కనుపర్తి వరలక్ష్మమ్మ రచన ‘కథ ఎట్లా ఉండాలె’కు సంక్షిప్త రూపం ఇది. ‘నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము బూనితిని’ అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మమ్మ (6 అక్టోబర్‌ 1896– 13 ఆగస్ట్‌ 1978). ఆమె తొలి రచన 1919లో అచ్చయింది. ఆరేళ్లపాటు లీలావతి కలంపేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ కాలమ్‌ రాశారు. ‘శారద లేఖలు’ 1929 నుండి 1934 వరకు రాశారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద రాసినట్టుగా ఉండే ఈ లేఖలు అనేక స్త్రీల సమస్యలను చర్చిస్తాయి. లేడీస్‌ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా నవోదయం, పునఃప్రతిష్ట వంటి నాటికలు; వసుమతి, విశ్వామిత్ర మహర్షి నవలలు; ద్రౌపది వస్త్ర సంరక్షణ, సత్యా ద్రౌపది సంవాదం వంటి పద్య రచనలు చేశారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆమె జన్మించిన బాపట్లలో స్త్రీహితైషిణి మండలిని స్థాపించారు.

మరిన్ని వార్తలు