Karishma Mehta: 50 ఏళ్లు.. విడాకులు తీసుకున్న మహిళ.. తన కథే మొదటిది!

9 Dec, 2021 01:59 IST|Sakshi

Karishma Mehta The Woman Who Started Humans Of Bombay Her Story: 8 ఏళ్ల క్రితం 21 ఏళ్ల వయసులో ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ ఫేస్‌బుక్‌ పేజీని తెరిచింది కరిష్మా మెహతా. ప్రతి మనిషికో కథ ఉంది. ప్రతి గుండెకో స్పందనుంది అని ఆమె అందరి కథలకూ వేదిక కల్పిస్తూ ఈ పేజీని తెరిచింది. సాధారణంగా పత్రికలలో విజేతల కథలే వస్తాయి. కాని సామాన్యులు చేసిన అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి. ఎందరో తెలియని మహానుభావులు అందరికీ వందనాలు అనిపించేలా చేసిందా పేజీ.కరిష్మా మెహతా పరిచయం.

చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలు వినేవాళ్లం. ఆమె కథలకు అంతూ పొంతూ ఉండదు. ఆ కథల పట్ల ఉండే ఆసక్తి కూడా. ప్రతి మనిషి దగ్గరా ఒక కథ ఉంటుంది. లేదా ప్రతి ఎదుటి మనిషి దగ్గరా ఒక కథ ఉంటుంది. ఆ కథను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే కథ ఇంకా బతికే ఉంది. మామూలు మనుషుల కథలు జనానికి చెబుదాం అని కరిష్మా మెహతాకు అనిపించింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు తానే ఒక పేదరాశి పెద్దమ్మ కాబోతోందని. గతంలో పత్రికలు మొదలెట్టి న్యూస్‌ప్రింట్‌ కొని ప్రింటర్‌ ద్వారా కథలను అచ్చు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి అరచేతిలో ఒక పత్రిక ఉన్నట్టే. దాని పేరు ఫోన్‌. అందులో ఒక పేజీ ఉన్నట్టే. దాని పేరు ఫేస్‌బుక్‌. 

కరిష్మా మెహతా ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక పేజీ తెరిచింది. ఇప్పుడు దానికి పది లక్షల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మంది. ఆ పేజీలో ఇప్పటికి 6000 కథనాలు వెలువడ్డాయి. దాదాపు 15 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి ఈ కథనాలలో ఉన్న వ్యక్తులకు సహాయం చేశారు. ఇదంతా ఒక్క ఐడియా వల్ల. కరిష్మా మెహతా చేసిన ఆలోచన వల్ల.

21 ఏళ్ల వయసులో
కరిష్మా మెహతాకు చిన్నప్పటి నుంచి తానొక వ్యాపారవేత్త కావాలని కోరిక. ‘14 ఏళ్ల వయసులో నేను ఒక బిజినెస్‌ మేగజీన్‌లో ఎవరిదో ఇంటర్వ్యూ చూస్తూ ఇలా నా గురించి కూడా ఇంటర్వ్యూ రావాలి అనుకున్నాను. ఆ సంకల్పం గొప్ప శక్తిని ఇచ్చింది. నేను ఆ నిర్ణయాన్ని వదలదల్చుకోలేదు. 21వ ఏట హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేతో డిజిటల్‌ మీడియాలో ఒక అంట్రప్రెన్యూర్‌గా జీవితాన్ని మొదలెట్టాను. ఏ పత్రికలో అయితే చిన్నప్పుడు నా ఇంటర్వ్యూ రావాలని అనుకున్నానో అదే పత్రికలో నా ఇంటర్వ్యూ వచ్చాక.. అవును.. ఇప్పుడు నా కల నెరవేరింది అనుకున్నాను’ అంటుంది కరిష్మా.

ముంబైకి చెందిన కరిష్మా ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ ఫేస్‌బుక్‌ పేజీ కోసం అపరిచితుల జీవన కథనాలను చెప్పాలనుకుంది. వారి కష్టాలు, బాధలు, సాహసాలు, త్యాగాలు, అవసరాలు... ఇవన్నీ తెలుసుకుని చెప్పాలనిపించింది. దాని వల్ల ఏమవుతుంది? మనుషులంతా ఒక్కటే అని తెలుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో పోరాడుతూ ముందుకు వెళుతున్నాడని తెలుస్తుంది. అంతే కాదు మానవత్వం అంటే సాటి మనిషి గురించి తెలుసుకుని చేయదగ్గ సహాయం చేయడమే అని కూడా అర్థమవుతుంది. ఆ ఆలోచనతోనే కరిష్మా హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీను మొదలెట్టింది.

మొదటి ఇంటర్వ్యూ తనే
8 ఏళ్ల క్రితం మొదటి ఇంటర్వ్యూ కోసం ఒక సాయంత్రం కరిష్మా మెరేన్‌ డ్రైవ్‌కు వెళ్లింది. అక్కడ కనిపిస్తున్న పాదచారులతో మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని ఎవరూ సహకరించలేదు. ‘కాని ఒకామె మాత్రం ఒప్పుకుంది. ఆమెకు 50 ఏళ్లు ఉంటాయి. అప్పుడే విడాకులు తీసుకుంది. ఆమె తన మనసులో బాధంతా చెప్పుకుంది. అంతా అయ్యాక నా గుండె మీద బరువు దిగినట్టుగా ఉంది అని వెళ్లిపోయింది’ అంటుంది కరిష్మా. పేరు ఎవరిదో చెప్పకుండా వారు ఒప్పుకుంటే వారి ఫొటో వేసి వారి కథనాలు రాయడం హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీ ఆనవాయితీ. అంతే ఆ వ్యక్తి వివరాలు పేజీ నిర్వాహకులకే తెలుస్తాయి. వారికి ఏదైనా సహాయం కావాల్సి వస్తే పేజీ నిర్వాహకుల నుంచే వెళతాయి. 

6000 కథనాలు
‘మేము ఇప్పటికి ఆరువేల మంది అపరిచితులతో మాట్లాడి వారి జీవన కథనాలు రాశాం. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే. ఇప్పుడు 20 మంది టీమ్‌ పని చేస్తోంది. ఒకసారికి ఒక కథ... నియమం పెట్టుకుని మా కథనాలు ప్రచురిస్తాం. ఇన్నేళ్ల అనుభవంలో ఇంతమందిని కలుస్తూ వెళ్లాక నాకు ఐదారు ఎం.బి.ఏ డిగ్రీలు చేసినంత అనుభవం, జ్ఞానం వచ్చింది. ఎందరికో సాయం చేశాం. చదువుకు, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాధులకు ధన సాయం చేశాం. ఆ తృప్తి తీరనిది’ అంటుంది కరిష్మా మెహతా. ఈ పేజీ పెట్టి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఆమె తన ప్రయాణాన్ని చెబితే నెటిజన్లు విశేషంగా స్పందించారు. ‘మీ పోస్ట్‌లన్నీ చదువుతాను. ఇవి మానవత్వాన్ని సజీవంగా ఉంచుతాయి’ అని ఒకరంటే ‘జీవితంలో పోరాడటాన్ని నేర్పుతాయి’ అని ఒకరన్నారు.

టీ అమ్ముతూ కుటుంబాన్ని సాకుతున్న ఒక చిన్నపిల్లవాడు, ఒళ్లో కూతుర్ని కూచోబెట్టుకుని కన్యాదానం చేసిన తల్లి, సొంత వడపావ్‌లు అమ్మడానికి నానాబాధలు పడి చివరికి బ్రాండ్‌ సృష్టించి మరీ సక్సెస్‌ అయిన వడపావ్‌ అమ్మకందారుడు... ఇలా ఎన్నో కథలు హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే వల్ల వెలుగుచూశాయి.పేదరాశి పెద్దమ్మలు గతించిపోయారని అనుకుంటాం. కాని కథలు వెతికి చెప్పగలిగితే డబ్బు సంపాదించగలిగే పెద్దమ్మలు మనమూ కావచ్చు.

చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే

మరిన్ని వార్తలు