ప్రాణం రీఫిల్లింగ్‌

11 Sep, 2020 08:28 IST|Sakshi

మంచిదనీ, చెడ్డదనీ ఫిక్స్‌ అయిపోడానికి లేకుండా మంచి చెడులు మిక్స్‌ అయిపోయి ఉంటుంది లోకం. రెంటినీ వేరు చేస్తూ కూర్చుంటే జీవితం ముగిసిపోతుంది. బాధ కలిగిన చోట బాధపడి, మంచి కనిపించిన చోట సంతోషపడి జన్మను గడిపేయాలని, చేతనైతే నిస్వార్ధాన్ని గడించి వారస మానవులకు వీలునామా రాసిపోవాలనీ జీవిత అంతరార్థమేమో! ఈ కరోనా కాలంలో స్వార్థం బుసలు కొట్టే చోట కొడుతుంటే, నిస్వార్ధం ప్రాణవాయువై కొన్నిచోట్ల ఊపిర్లు ఊదుతోంది. కర్ణాటకలోని బెల్గాంలో వెంకటేష్‌ పాటిల్‌ అనే ఆయనకు ఆక్సిజన్‌ సిలిండర్ల రీ ఫిల్లింగ్‌ కంపెనీ ఉంది. కంపెనీతో పాటు మంచి మనసు కూడా. బెల్గాం కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఎవరైనా ఆక్సిజన్‌ అవసరమై, కొనే స్థోమత లేక చావు బతుకుల్లో ఉన్నారని తెలియగానే వెంకటేష్‌ పాటిల్‌ హుటాహుటిన అక్కడికి సిలిండర్‌లు పంపిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆయన 1882 సిలిండర్‌లను ఉచితంగా రీఫిల్‌ చేసి పంపించారు. ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఒక్క రీఫిల్‌కి 260 రూపాయలు అవుతుంది. అదే ఒకసిలిండర్‌కి కార్పొరేట్‌ ఆసుపత్రులలో పది వేలు బిల్‌ అవుతుంది! వాళ్లు చేస్తున్న దాని గురించి పాటిల్‌ తనేమీ మాట్లాడ్డం లేదు.

తను చేయగలిగిన దాని పైనే ధ్యాస పెట్టారు. ఆక్సిజెన్‌ కంపెనీ ఉన్నవాళ్లు ఉచితంగా సిలిండర్‌ రీఫిల్‌ చేసి ఇవ్వడం పెద్ద విషయం కాదనిపించవచ్చు. పెద్దపెద్ద కంపెనీలనే తలదన్నేలా ఉండే కార్పొరేట్‌ ఆసుపత్రుల యజమానులు ఒక్క టెస్ట్‌ అయినా పేదవాళ్లకు ఉచితంగా చేసినట్లు విన్నామా?! కొండంత స్వార్థాన్ని కొలవలేం. నిస్వార్ధాన్ని మాత్రం వెంకటేష్‌ పాటిల్‌ వంటి వాళ్లను కూర్చోబెట్టి తూచవచ్చు. కానీ ఆయన కూర్చోడానికి ఒప్పుకోరే! ‘పాపం ఎవరికో ఆక్సిజెన్‌ కావాలట’ అని పరుగెత్తి వెళతారు. కనుక నిస్వార్థాన్నీ కొలవలేం. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో మంచీ చెడ్డా కలిసిపోయి! మంచికి దండం. చెడుకు దూరం. ఇదే మనశ్శాంతికి దివ్యౌషధం.

మరిన్ని వార్తలు