చిన్న వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్‌..!

24 Aug, 2021 23:38 IST|Sakshi

కషిష్‌ లక్రాకు 18 ఏళ్లు. తన కాళ్ల మీద తాను నిలబడలేదు. కాని రెండు చేతుల్లో బలంగా దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని పట్టుదలగా ఉంది. మంగళవారం నుంచి మొదలైన టోక్యో పారా ఒలింపిక్స్‌లో దేశం నుంచి హాజరవుతున్న అతి చిన్న వయసు అధ్లెట్‌ లక్రా 14 ఏళ్ల వయసులో డాక్టర్లు  ఇక నువ్వు జీవితాంతం బెడ్‌ మీద ఉండాలి అని చెప్తే విధిని సవాలు చేసి నేడు దేశానికి ప్రతినిధిగా ఎదిగింది. చిన్న చిన్న సమస్యలకు  కుంగిపోయే వారికి అతి పెద్ద స్ఫూర్తి లక్రా.

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ (దివ్యాంగుల ఒలింపిక్స్‌)లో భారత్‌ నుంచి 54 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. ఇది గతంతో పోలిస్తే పెద్ద సంఖ్య. ఈ మొత్తం 54 మందిలో అందరి కంటే చిన్నది కషిష్‌ లక్రా. 18 ఏళ్ల వయసులో పారా ఒలింపిక్స్‌కు హాజరైన మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు స్థాపించినట్టే. క్లబ్‌త్రోలో ఆమె పాల్గొననుంది. క్లబ్‌ అంటే 40 సెం.మీల కొయ్యగూటం. దానిని విసరాలి. ఎఫ్‌ 51 విభాగం (చేతికి ఉండే లోపం స్థాయిని బట్టి చేసే విభాగం) లో ఆమె పాల్గొననుంది. ‘నేను కచ్చితంగా నా దేశానికి పతకం తెస్తాను’ అని కషిష్‌ అంది.


ఢిల్లీ అమ్మాయి
ఢిల్లీలో అందరిలాంటి అమ్మాయే కషిష్‌. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. మూడో క్లాసులోనే స్కేటింగ్‌ మొదలెట్టింది. ఆ తర్వాత బాడ్మింటన్‌ ఆడాలని అనుకుంది. కాని దాని కోచింగ్‌ కోసం డబ్బు ఖర్చు అవుతుందని ఆ స్తోమత లేక రెజ్లర్‌గా మారింది. ఏడో క్లాసులో జూనియర్‌ రెజ్లర్‌గా ఢిల్లీలో శిక్షణ మొదలెట్టింది. చిన్నప్పటి నుంచి బలశాలి అయినందువల్ల రెజ్లర్‌గా రాణించి  ‘ఖేలో ఇండియా’ యూత్‌ గేమ్స్‌కు ఎంపికైంది. 2018 జనవరిలో ఆ గేమ్స్‌ జరగనున్నాయి. వాటి కోసం 2017 నవంబర్‌లో నజఫ్‌గడ్‌లోని గవర్నమెంట్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న 14 ఏళ్ల కషిష్‌ పట్టు జారి పడిపోయింది. వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయింది. కొన్నాళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన కషిష్‌కు తన మెడకూ మిగిలిన శరీరానికి ఏ సంబంధమూ లేదని అర్థమైంది. మెడ దిగువ భాగమంతా చలనం కోల్పోయింది. ఎంతో భవిష్యత్తును కలగన్న ఆ టీనేజ్‌ బాలిక బెంబేలెత్తి పోయింది. తన బతుక్కు ఇక ఏ అర్థమూ లేదని అనుకుంది. దానికి తోడు డాక్టర్లు ఆమె తల్లిదండ్రులతో ‘చనిపోయే అవకాశమే ఎక్కువ’ అన్నారు. అంతే కాదు ఒకవేళ బతికినా జీవితాంతం మంచం మీదే ఉండాలన్నారు. కాని కషిష్, ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మమ్మ, తాతయ్య ఈ సవాలును దాటాలని గట్టిగా అనుకున్నాను. దాటారు కూడా. 

ఫిజియోథెరపీ
మూడు–నాలుగు నెలలు కషిష్‌ ఫిజియోథెరపీ కోసం అంతులేని సంకల్పబలంతో సహకారం అందించింది. ఫిజియోథెరపిస్ట్‌ ఆమెలో ఆత్మవిశ్వాసం నింపాడు. మంచానికే పరిమితం అని చెప్పిన డాక్టర్ల అంచనాలకు విరుద్ధంగా ఆమె లేచి కూచోగల్గింది. వీల్‌చైర్‌లో కదిలే శక్తి పొందింది. ఒక్కసారి వీల్‌చైర్‌లో కూచున్నాక ‘నేను చదువుకుంటా’ అని కషిష్‌ అంది. ఏ స్కూల్లో అయితే అంతవరకూ చదువుతూ ఉందో ఆ స్కూల్‌ వాళ్లు ‘మేము చేర్చుకోము’ అన్నారు. అది పెద్ద దెబ్బ. ఆ తర్వాత షాలీమార్‌ బాగ్‌లోని మోడరన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఆమెకు అడ్మిషన్‌ ఇవ్వడమే కాదు ఆమె క్రీడాసక్తిని కూడా ప్రోత్సహించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత  సత్యపాల్‌ సింగ్‌ ఆమెకు కోచ్‌గా ఉండటానికి ముందుకు వచ్చాడు. క్లబ్‌ త్రోలో శిక్షణ ఇచ్చాడు. వ్యాయామం పట్ల ఆసక్తి ఉన్న కషిష్‌ తన సోదరుడితో కలిసి వ్యాయామం చేస్తూ దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాదు, శక్తి కొద్దీ క్లబ్‌ను విసరడానికి శిక్షణ తీసుకుంది.


జైత్రయాత్ర
ఆ తర్వాత కషిష్‌ ఆగలేదు. స్టేట్‌ లెవల్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. నేషనల్‌ లెవల్‌లో గోల్డ్, సిల్వర్‌ పతకాలు సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ గెలిచింది. 2019లో దుబయ్‌లో జరిగిన సీనియర్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం క్లబ్‌ త్రోలో ప్రపంచ ర్యాంకులో 8వ స్థానంలో ఉంది కషిష్‌. అందుకే భారత ప్రభుత్వం ఆమెను టోక్యోకు ఎంపిక చేసింది. ‘ఒకప్పుడు కదల్లేను అనుకున్నాను. ఇవాళ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. నా స్వప్నం సత్యమైంది’ అంది కషిష్‌.

‘మా అమ్మ నా వెంట నీడలా ఉండి ఈ విజయాలు సాధించేలా చేసింది. నా కోచ్‌లు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. వారు లేకుంటే నేను లేను’ అంటుంది కషిష్‌.
బహుశా రెండు మూడు రోజుల్లో మనం కషిష్‌ గురించి మంచి వార్త వింటామనే ఆశిద్దాం. ఆల్‌ ద బెస్ట్‌ కషిష్‌.
  

మరిన్ని వార్తలు