నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం!

17 Aug, 2022 09:56 IST|Sakshi

‘ఏముందీ... అంతా బూడిద’ అంటుంటారు. చక్కని ఆలోచనలు సొంతం కావాలేగానీ బూడిదలో నుంచి కూడా బంగారంలాంటి అవకాశాలు జనిస్తుంటాయి. కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా! అయితే మీరు నసీరా అఖ్తర్‌ గురించి తెలుసుకోవాల్సిందే...

కశ్మీర్‌లోని కుల్గామ్‌ ప్రాంతానికి చెందిన నసీరా అఖ్తర్‌ ‘మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి మనతో మౌనంగా సంభాషిస్తాయి’ అనే పెద్దల మాటను విన్నదో లేదోగానీ మొక్కలతో గడపడం ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టమే తనకు పర్యావరణంపై ఆసక్తిని పెంచింది.

హైస్కూల్‌ రోజులలో క్లాస్‌రూమ్‌లో తన ప్రశ్నలు లేని రోజు అంటూ ఉండేది కాదు. ఏదో అడగాలి కాబట్టి అడగాలి అనే కోవకు చెందిన ప్రశ్నలు కావు అవి. తనలోని విజ్ఞానదాహానికి ప్రతీకలుగా నిలిచే ప్రశ్నలు. అయితే నసీరా ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. చాలా ఓపికగా సమాధానాలు చెప్పేవారు. ‘నీలో సైంటిస్ట్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి’ అని అంతా చమత్కారంగా అనేవాళ్లు.

కట్‌ చేస్తే...
నసీరాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అంతమాత్రాన ఇల్లే లోకం అనుకోలేదు. ఇంటి పనే సర్వస్వం అనుకోలేదు. దినపత్రికలు, మ్యాగజైన్‌లలో తనకు ఆసక్తి కలిగించే శాస్త్రీయ విషయాలకు సంబంధించిన వ్యాసాలను కత్తిరించి దాచుకునేది. ఊళ్లో మిగిలిన మహిళలకు భిన్నంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనిపించే నసీరాను ఎవరో ఒకరు వెక్కిరిస్తూనే ఉండేవారు.

అయితే..
తన ప్రపంచంలో తాను ఉండే నసీరాకు వాటి గాలి సోకేది కాదు. చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర ఒక కల కన్నది. మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థాన్ని తయారుచేయాలి... అనేది ఆ కలల సారాంశం.

సంవత్సరం గడిచింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది. రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రయోగాలు ఆపలేదు. ఆ సమయంలోనే మనసులో ఏదో ఒక మూల చిన్న నిరాశ తొంగిచూసింది. అయితే అంతలోనే తాత చెప్పిన మంచిమాట గుర్తుకు వచ్చి తనను ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లేది.

‘ఒక కాలం నీ కోసం ఎదురుచూస్తుంటుంది. అది దగ్గరికి వచ్చిన తరువాత ఎగుడు దిగుళ్లను సరిచేసి నీ ముందు రాచబాటను ఏర్పాటు చేస్తుంది’... తాత తనకు చెప్పిన కశ్మీరి జానపద కథల్లోని ఒక మాట ఇది. ఆ కథలేవీ గుర్తులేవు. కాని ఈ మాట మాత్రం తనకు చాలా గట్టిగా గుర్తుండిపోయింది.

సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత...
ఎనిమిది సంవత్సరాల తరువాత... తన ప్రయోగం ఫలించింది. పర్యావరణానికి హాని కలిగించకుండా స్థానికంగా పెరిగే మొక్కలను ఉపయోగించి పాలిథిన్‌ను బూడిదగా మార్చే బయోడిగ్రేడబుల్‌ హెర్బల్‌ ఫార్ములాను తయారుచేసి తొలి విజయకేతనం ఎగరేసింది. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది నసీరా. 48 సంవత్సరాల నసీరా అఖ్తర్‌కు మరెన్నో కలలు ఉన్నాయి. ఇప్పుడు వాటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది.

చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు
  

మరిన్ని వార్తలు