క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది

20 May, 2021 01:31 IST|Sakshi
స్పేస్‌ సూట్‌లో కేలా బ్యారన్‌

స్పేస్‌ ఎక్స్‌ ‘క్రూ–3’ మిషన్‌కు నాసా మహిళా వ్యోమగామి కేలా బ్యారన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి దశ నిర్మాణంలో ఉన్న ‘డ్రాగన్‌’ అనే వ్యోమనౌకలో కేలా, మరో ముగ్గురు పురుష వ్యోమగాములు వచ్చే అక్టోబర్‌ 23 న అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయల్దేరి వెళ్తారు. అక్కడ కనీసం ఆరు నెలల పాటు పరిశోధనలు జరిపి భూమిని చేరుకుంటారు. ‘క్రూ–3’ కి కేలా బ్యారన్‌.. మిషన్‌ స్పెషలిస్ట్‌. నిన్న గాక మొన్న నాసాలోకి వచ్చిన కేలా తన ప్రతిభతో స్పేస్‌లోకి స్పేస్‌ సంపాదించారు!

‘నాసా’ ప్రభుత్వానిదైతే, ‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రైవేటు సంస్థ. నాసా వాషింగ్టన్‌లో ఉంటే, స్పేస్‌ ఎక్స్‌ కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండిటి పనీ అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష ప్రయాణాలు. స్పేస్‌ ఎక్స్‌కి ఇప్పటివరకైతే సొంత వ్యోమగాములు లేరు. నాసా నుంచి, లేదంటే మరో దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుశిక్షితులైన వ్యోమగాములను తీసుకుంటుంది. ఎలాన్‌ మస్క్‌ అనే బిలియనీర్‌ స్థాపించిన సంస్థ స్పేస్‌ ఎక్స్‌. మార్స్‌లోకి మనిషిని పంపేందుకు ప్రయోగాత్మకంగా స్పేస్‌ ఎక్స్‌ వేస్తున్న మెట్లే ఈ స్పేస్‌ షటిల్స్‌. ఆ మెట్లలోని మూడో మెట్టే ‘క్రూ–3’. ఇందులో నాసా నుంచి కేలా, రాజాచారి (మిషన్‌ కమాండర్‌), టామ్‌ మార్ష్‌బర్న్‌ (మిషన్‌ పైలట్‌), యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి మథియాస్‌ మారర్‌ (మిషన్‌ స్పెషలిస్ట్‌ 1) ఉంటారు. కేలా బ్యారన్‌.. మిషన్‌ స్పెషలిస్ట్‌ 2.

స్పేస్‌ ఎక్స్‌ ఇలా మార్స్‌కి ఎన్ని మెట్లు కట్టుకుంటూ వెళుతుంది? తెలియదు! మార్స్‌లోకి మనిషిని పంపి, మెల్లిగా మార్స్‌లో మానవ కాలనీలను నిర్మించే ధ్యేయంతోనే ఎలాన్‌ మస్క్‌ 2002 లో ఈ సంస్థను నెలకొల్పారు. వ్యోమగాములతో అతడు వేయించే ప్రతి అడుగు, గమ్యమూ చివరికి అంగారక గ్రహమే. వాస్తవానికి స్పేస్‌ ఎక్స్‌ వల్ల నాసాకు ఖర్చు, భారం తగ్గాయి. పరిశోధనలకు సమయమూ కలిసివస్తోంది. అందుకే స్పేస్‌ ఎక్స్‌కి సహాయపడుతోంది. అంతే తప్ప తనకు పోటీ అనుకోవడం లేదు.
∙∙
ఇప్పటికి స్పేస్‌ ఎక్స్‌ పంపిన రెండు ‘క్రూ’ మిషన్‌లలోనూ ఒక్కో మహిళా వ్యోమగామి ఉన్నారు. వారిద్దరి కన్నా వయసులో చిన్న.. ఇప్పుడు ‘క్రూ–3’లో సభ్యురాలిగా ఉన్న కేలా బ్యారన్‌. ‘క్రూ–1’లో అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగామి షానన్‌ వాకర్‌ వయసు 55. ‘క్రూ–2’లో వెళ్లిన మహిళ మెగాన్‌ మెకార్తర్‌ వయసు 49 ఏళ్లు. కేలా బ్యారెన్‌ వయసు 33 ఏళ్లు. షానన్‌ వాకర్‌ భూమి మీదకు తిరిగి వచ్చేశారు.  మెగాన్‌ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు.

ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతున్న కేలా బ్యారన్‌ వాషింగ్టన్‌లో పుట్టారు. యు.ఎస్‌. నేవల్‌ అకాడమీలో సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్‌ వెళ్లి కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అనంతరం యుద్ధ నౌకల్ని కమాండ్‌ చేసే సబ్‌మెరైన్‌ ఆఫీసర్‌గా శిక్షణ తీసుకున్నారు. యు.ఎస్‌.ఎస్‌. మెనీలో డివిజన్‌ ఆఫీసర్‌గా, నేవల్‌ అకాడమీలో సూపరింటెండెంట్‌గా పని చేశారు. 2017లో నాసాకు ఎంపిక అయ్యారు. వ్యోమగామి గా రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడీ స్పేస్‌ ఎక్స్‌ ప్రయాణానికి అవకాశం పొందారు. మిషన్‌ ఆఫీసర్‌గా ఆమె అంతరిక్షంలో ఉన్నంత కాలం కమాండర్, పైలట్, మరొక మిషన్‌ స్పెషలిస్టుతో అనుసంధానం అయి ఉండాలి. క్రూ యాక్టివిటీ ప్లానింగ్, పర్యవేక్షణ ఆమె విధులే. ఇక ప్రయోగాలు ఎలాగూ ఉంటాయి.

 వ్యోమగామిగా నాసా శిక్షణలో ఉన్నప్పుడు కేలా బ్యారన్‌

మరిన్ని వార్తలు