అలసిన భర్త

29 Oct, 2020 08:21 IST|Sakshi

జీవితంలో చాలా వాటికి అలసిపోతూ ఉంటాం. ప్రయాణంలో అలసట సహజమే. జీవితమంటేనే ప్రయాణం కదా. ఎక్కడైనా కొంచెంసేపు ఆగితే అలసట తీరుతుందని అనుకుంటాం. తీరదు! ఆ ఆగడం మరింత అలసటగా అనిపిస్తుంది. అదే జీవితంలోని విశేషం. అలసట తెలియకూడదంటే జర్నీ సాగుతూనే ఉండాలి. ఎక్కడో ఒక పువ్వు విచ్చుకుని ఊగుతూ చటుక్కున మన అలసటను తెంపుకుని వెళుతుంది. ఇష్టమైన ఒక మనిషి ముఖం మన అలసటను పంచుకుని ముంగురులను సవరించి ఇక పొమ్మంటుంది. ఆ మనిషికీ తన ప్రయాణం ఒకటి ఉంటుంది మరి. అందుకే పొమ్మనడం. ఏమిటిది?! సీరియస్‌గా ఎటో వెళ్లి పోతున్నాం!! అసలైతే ఖోష్లేంద్ర చెందివున్న అలసట గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవలసింది. కె.బి.సి 12 కంటెస్టెంట్‌ అతడు. హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ అతడిని అడిగారు.. ‘‘ఖోష్లేంద్ర జీ, గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు?!’’ అని.

సాధారణంగా కె.బి.సి. విజేతలకు చిన్న చిన్నవే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి. స్కూల్‌ కట్టిస్తాను అంటారు.  మా ఊరికి చెరువు తవ్విస్తాను అంటారు. పొలం కొని సేద్యం చేస్తాను అంటారు. ఖోష్లేంద్ర ఇలాంటివేమీ చెప్పలేదు. అయినా ఇలాంటివే చెప్పాలని ఏముంది? ఆయన అవసరాలు ఏవో ఉండొచ్చు. ‘‘ఊ.. బోలియే ఖోష్లేంద్ర జీ మీరైతే ఏం చేస్తారు?’ అని తనదైన గంభీర స్వరంతో మళ్లీ అడిగారు అమితాబ్‌. ‘‘జీ.. నాకు వచ్చిన డబ్బుతో నేను నా భార్య ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తాను’’ అన్నారు ఖోష్లేంద్ర జీ. ‘‘ఎందుకంటే పదిహేనేళ్లుగా నేను నా భార్య ముఖం చూసీ చూసీ అలసిపోయాను’’ అని కూడా అన్నారు. అమితాబ్‌ కి నిజంగా కోపం వచ్చింది. ఆయన రియాక్షన్‌ చూసి, ‘‘ఊరికే జోక్‌ చేస్తున్నాను అమితాబ్‌ జీ’’ అన్నారు ఖోష్లేంద్ర. 

‘‘ఖోష్లేంద్ర జీ.. జోక్‌ గా కూడా అలాంటి మాటలు అనకండి’’ అన్నారు అమితాబ్‌. ఖోష్లేంద్రకు కూడా పాఠశాలలు కట్టించాలని, చెరువులు  తవ్వించాలని, రోడ్ల పక్కన అశోకుడిలా చెట్ల మొక్కలు నాటించాలనీ, వీటన్నింటికంటే ముందు.. భార్యను జోయ్‌ అలుక్కాస్‌కో, త్రిభువన్‌ దాస్‌ భీమ్‌జీ జవేరీ జ్యుయలరీస్‌కో తీసుకెళ్లాలని వుండొచ్చు. అయితే అమితాబ్‌ని నవ్వించాలని అనుకుని తన భార్యపై జోక్‌ వేసినట్లున్నారు. ఆయనకు మాత్రం తెలియకుండా ఉంటుందా.. పదిహేనేళ్లుగా భార్యా తన ముఖం చూస్తూనే ఉందని!

మరిన్ని వార్తలు