విజయ కీర్తి

9 Apr, 2022 00:15 IST|Sakshi
కూరగాయలు తరుగుతున్న మహిళలు; కీర్తి ప్రియ,విజయలక్ష్మి

విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్‌ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది.

తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే..  

 ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్‌ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది.  

వృథాను అరికట్టవచ్చు
సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్‌నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ కాన్సెప్ట్‌ సిద్ధమైపోయింది.  

కుటుంబ మద్దతు
మా నాన్న పోలీస్‌ విభాగంలో వర్క్‌ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్‌ వర్క్‌ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు.  

వృద్ధిలోకి తీసుకు వస్తూ..  
సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్‌ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్‌ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్‌ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం.

మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్‌ ప్లానింగ్‌ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్‌ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్‌ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్‌ మిక్స్‌లు, జ్యూస్‌ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి.  

    ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్‌ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ.  

– నిర్మలారెడ్డి 

మరిన్ని వార్తలు