Organic Urban Farming: గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం.. పెరట్లో కూరగాయల సాగు, కోళ్లు, కుందేళ్ల పెంపకం! ఇంకా

18 Nov, 2022 14:49 IST|Sakshi

ఇంటి పంటలతోనే సేఫ్‌ ఫుడ్‌! 

ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ అర్బన్‌ ప్రజలు సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. దేశ జాతీయోత్పత్తిలో 30% వ్యవసాయం నుంచి పొందుతున్న కెన్యాలో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత వరకు ఇంటి దగ్గరే ఏదో విధంగా తిప్పలుపడి సేంద్రియంగా పండించుకుంటున్నారు.

కోవిడ్‌ కాలంలో ఆహార కొరత, ధరల పెరుగుదలతో కొంతమంది కెన్యన్లు అర్బన్‌ ప్రాంతాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆహారం చౌకగా ఉండటంతో పాటు సొంతంగా కూరగాయలు పండించుకోవడానికి పెరటి స్థలాలు చాలా గ్రామీణ కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. అయితే, కోవిడ్‌ మహమ్మారి అర్బన్‌ అగ్రికల్చర్‌ విస్తరణకూ ఊపునిచ్చింది.

ఆహార సరఫరా తగ్గిపోవటంతో ఆరోగ్యదాయకమైన ఆహార భద్రత కోసం అర్బన్‌ ప్రాంతాల్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వ్యాపకం ఇటీవల ఊపందుకుంది. ఇంటి స్థాయిలో ఆహార భద్రతను కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ‘మిలియన్‌ కిచెన్‌ గార్డెన్స్‌ ప్రాజెక్ట్‌’లో భాగంగా రెండేళ్ల క్రితం కూరగాయల విత్తనాలు, వ్యవసాయ కిట్లను పంపిణీ చేసింది.  

అర్బన్‌ గార్డెనింగ్‌ చానల్‌
నగరంలో ఉంటున్నా ఇంటి దగ్గరే సొంత ఆహారాన్ని పెంచుకోగలుగుతున్న అదృష్టవంతుల్లో న్యాంబురా సిమియు ఒకరు. 35 ఏళ్ల శాస్త్రవేత్త అయిన ఆమె తన కుటుంబంతో పాటు కెన్యా రాజధాని నగరం నైరోబీ శివార్లలోని గేటెడ్‌ కమ్యూనిటీలో నివసిస్తున్నారు.

తన ఇంటి వెనుక పెరట్లో తన నలుగురు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాదు, 200 వరకు కోళ్లు, కుందేళ్లను సైతం పెరట్లో పెంచుతున్నారు. ఏడాది పొడవునా కూరగాయలు, గుడ్లు, మాంసాలతో కూడిన సేఫ్‌ ఫుడ్‌ను కుటుంబానికి సమకూర్చుతున్నారు.

అర్బన్‌ రైతులకు శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం తన పేరుతోనే యూట్యూబ్‌లో అర్బన్‌ గార్డెనింగ్‌ చానల్‌ను నిర్వహిస్తున్నారు. పురుగుమందులకు బదులు కుందేలు మూత్రం వాడుతున్నారు. తెగుళ్ళను అరికట్టడానికి ‘కంపానియన్‌ ప్లాంటింగ్‌’ వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 

ఉపాధి మార్గంగానూ.. 
యువ అర్బన్‌ ఫార్మింగ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌లో నైరోబీ వాసి ఎల్జీ చెబెట్‌ ఒకరు. సృజనాత్మకంగా కిచెన్‌ గార్డెనింగ్‌ నమూనాలను నిర్మించటంలో ఆమె దిట్ట.  కుటుంబం కోసం కూరగాయలు, ఆకుకూరలు పండించటం మాత్రమే కాదు, దాన్నే ఉపాధి మార్గంగానూ ఎంచుకున్నారామె.

కెన్యా ఆర్గానిక్‌ కిచెన్‌ గార్డెన్స్‌ సంస్థను నెలకొల్పారు. పెరట్లో, మేడ మీద, గచ్చు మీద ఏ కొంచెం స్థలం వున్నా సరే గృహస్థుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా ఎడిబుల్‌ లాండ్‌స్కేప్‌ గార్డెన్స్‌ను అందంగా డిజైన్‌ చేస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆహార సరఫరాకు అంతరాయం కలిగిన తర్వాత పరిమిత స్థలంలోనే  కొంతమంది నగరవాసులు తమ వంట గదుల్లో, బాల్కనీల్లో కూరగాయలను పెంచడం ప్రారంభించారని ఎల్జీ చెబెట్‌ చెప్పారు. 

రెండు చదరపు మీటర్లు చాలు..
‘ఆహారోత్పత్తి అనేది ప్రభుత్వ విధాన స్థాయిలో, ఇంటి స్థాయిలోనూ ఒక ముఖ్యమైన పని’ అని ప్రజలు గ్రహించారని రూట్‌–టు–ఫుడ్‌ ఇనీషియేటివ్‌ సంస్థను నిర్వహిస్తున్న ఇమాన్యుయేల్‌ అటాంబా అన్నారు. ప్రజలు, వారు తినే ఆహారం, దాన్ని ఎలా పండిస్తారు అనే విషయాలపై అవగాహన లోపించింది అన్నారాయన. ‘నగరంలో కూరగాయలు పెంచడం మంచిది కాదని భావించే వ్యక్తులు ఉన్నారు.

ఇది మురికి పని లేదా చేయవలసిన పని కాదని అనుకుంటున్న మహానుభావులు కూడా వున్నార’ని న్యాంబురా సిమియు చెప్పారు. ఒక వ్యక్తికి సరిపడా కూరగాయలు పెంచుకునే కిచెన్‌ గార్డెన్‌కు కేవలం రెండు చదరపు మీటర్ల భూమి చాలు. పట్టణ వ్యవసాయానికి నీరు, స్థలం అవసరం. వీటిని నగరంలో ఏర్పాటు చేసుకోవటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.

కెన్యా నగరాలూ, పట్టణాల్లో వుండే చాలా మందికి ఈ వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా నగర జనాభాలో ఎక్కువ మంది నివసించే మురికివాడల్లో మరీ కొరతగా వుంది అంటున్నారు ఆటంబ. సంప్రదాయ వ్యవసాయానికి అవసరమైన నీరు, స్థలంలో నాలుగింట ఒకవంతు కంటే తక్కువ ఉపయోగించి ఆహారాన్ని పండించే హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
 - పంతంగి రాంబాబు
చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే

మరిన్ని వార్తలు