Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో

13 Nov, 2021 01:02 IST|Sakshi

వ్యాక్సిన్‌ ఆర్జే

Kerala Vaccine RJ Aswathy Murali: కరోనాకు వ్యాక్సిన్‌ రాకముందు..వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మాస్కులు పెట్టుకోవాలి? బయటకెళ్లాలంటేనే భయమేస్తుంది..అంటూ వ్యాక్సిన్‌ కోసం ఒకటే ఎదురు చూపులు చూసిన వారు కూడా తీరా వ్యాక్సిన్‌ వచ్చాక.. కరోనా కంటే వ్యాక్సిన్‌ వేసుకుంటే ఎక్కువ ప్రమాదమన్న అపోహతో వ్యాక్సిన్‌ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు.

అస్వతి బామ్మ కూడా ‘‘ఇప్పటిదాకా నిక్షేపంగా ఉన్నాను నేను... వ్యాక్సిన్‌ వేసుకుంటే నా ఆరోగ్యం పాడవుతుంది.. వ్యాక్సిన్‌ వేసుకోను’’ అని మొండికేసింది. వ్యాక్సిన్‌ గురించి తెలిసిన అస్వతి.. ‘‘బామ్మా ..వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏం కాదు, కరోనా వచ్చినా ప్రమాదం ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పడంతో వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇవే మాటలు తన కమ్యూనిటీలో ఎంతోమందికి చెప్పి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించింది అస్వతి. దీంతో గ్రామంలో ఉన్న వారంతా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  

అస్వతి ద్వారక నుంచి ప్రసారమయ్యే ‘మట్టోలి(90.4 ఎఫ్‌ఎమ్‌)’ కమ్యూనిటీ రేడియో సర్వీస్‌లో రేడీయో జాకీగా పనిచేస్తుంది. వైనాడ్‌లో ‘పనియార్‌’ జాతికి చెందిన గిరిజనుల జనాభా 18 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ‘పనియా’ భాషనే మాట్లాడుతారు. మట్టోలి మారుమూల గ్రామం, పనియా భాష ఒక్కటే తెలుసు. వీరికి వ్యాక్సిన్‌ గురించి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు.

వీరిలాగే అస్వతి బామ్మ ముందు మొరాయించినప్పటికీ తరువాత వ్యాక్సిన్‌ వేసుకున్నారు. బామ్మను ప్రేరణగా తీసుకున్న అస్వతి, తను కూడా పనియార్‌ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కావడంతో  గ్రామస్థులందరికి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలనుకుంది. దీనికోసం ఒకపక్క ఆర్జేగా పనిచేస్తూనే తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా  డాక్టర్ల టాక్‌షోలు శ్రద్దగా వినేది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించేది.

కోవిడ్‌ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్‌ ప్రాముఖ్యత గురించి పనియా భాషలో రేడియోలో వివరించేది. ఈ కమ్యూనిటీకి సమాచారం అందించే ఒకే మాధ్యమం రేడియో కావడంతో..కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రేడియో ద్వారా అందించేది. అంతేగాక రేడియోకు కాల్‌ చేసి ఎవరైనా సందేహాలు అడిగినా వాటిని నివృత్తి చేసి, వ్యాక్సిన్‌ గురించి అవగాహన కల్పించింది. దీంతో గ్రామస్థులంతా వ్యాక్సిన్‌ వేసుకున్నారు.   
 
టీవీ కంటే రేడియో ద్వారా..
‘‘మా కమ్యూనిటీలో ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్‌ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. వీరిని విపత్కర పరిస్థితుల్లో నుంచి బయట పడేయడానికి.. నావంతు సాయం కమ్యునిటీకి చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి టీవీలో కంటే రేడియో ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునేదాన్ని. కోవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా రేడియోలో ప్రసారమయ్యే డాక్టర్‌ కార్యక్రమాలు ఇంగ్లిష్‌లో వచ్చేవి. అవి మా కమ్యూనిటీ వాళ్లకు అర్థం కావు.

అందువల్ల అవన్నీ వింటూ రాసుకుని తరువాత మా పనియా భాషలో వివరించేదాన్ని. గ్రామస్థులకు ఉన్న సందేహాలను తెలుసుకుని వాటికి సమాధానాలు చెప్పేదాన్ని. ఈ ప్రశ్నలనే రేడియోలో కూడా ప్రస్తావిస్తూ ఎక్కువమందికి చేరేలా చెప్పాను. నేను కూడా పనియార్‌ కమ్యూనిటీకి చెందినదాన్ని కావడంతో అంతా నా మాటలపై నమ్మకంతో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దీంతో మట్టోలి గ్రామం పూర్తి వ్యాక్సినేషన్‌ అయిన గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని అస్వతి చెప్పింది.

చదవండి: సోషల్‌ స్టార్‌.. ఇక్కడ కాకపోతే ఇంకోచోట!

మరిన్ని వార్తలు