కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు!

11 Oct, 2021 15:26 IST|Sakshi

అవకాశం ఉన్నప్పుడే కలలను నెరవేర్చుకోవాలి. లేదంటే అవి ఎప్పటికీ కల్లలాగే మిగిలిపోతాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే వయసు అడ్డంకి ఎప్పుడూ కాదని ఈ జంటను చూస్తే తెలుస్తుంది. 27 యేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని కలగన్నారు. అంతటితో ఊరుకోలేదు. కార్యచరణ కూడా రూపొందించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 25 దేశాలకు వెళ్లివచ్చారు కూడా. ఈ నెలలో 26వ ట్రిప్పుకు వెళ్తున్నారు. కేవలం టీ దుకాణం జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నా ఈ వృద్ధ దంపతులు చెప్పే విశేషాలేమిటే తెలుసుకుందాం...

కేరళలోని కొచ్చికి చెందిన ​కేఆర్‌ విజయన్‌ (71), అతని భార్య మోహన (69) ‘శ్రీబాలాజీ కాఫీ హౌస్‌’అనే కాఫీ షాప్‌ నడుపుతున్నారు. కాఫీ దుకాణం ద్వారా ఆర్జించిన సొమ్ము ద్వారా ప్రపంచదేశాలు తిరిగిరావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా వీరి ప్రయాణం రెండేళ్లు వాయిదా పడింది. మళ్లీ ఈ నెల21 న తమ ప్రయాణం తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రిప్‌లో రష్యాకెళ్లి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌ను కలవాలను కుంటున్నారట కూడా. 

2007లో ఇజ్రాయెల్‌ సందర్శనతో వీరి మొదటి విదేశీ యాత్ర ప్రారంభమైంది. వీరి చివరి యాత్ర 2009 నవంబర్‌ - డిసెంబర్‌లో సాగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలను సందర్శించారు. ఈ ట్రిప్‌కు మహీంద్ర గ్రూప్‌ చైర్మాన్‌ ఆనంద్‌ మహీంద్ర స్పాంసర్‌ చేశారు కూడా. ఇలా అమెరికా, బ్రెజిల్‌, జర్మనీ.. వంటి ఇతర దేశాలను చుట్టేశారు.

వీరు ట్రావెల్‌ ఏజెన్సీల సహాయంతో కేవలం బేసిక్‌ ఇంగ్లీష్‌తో విదేశీ యాత్రలు చేస్తున్నారు. ‘కోవిడ్‌ తర్వాత పర్యాటక ప్రదేశాలు తిరిగితెరిచినట్టు తెలిసింది. మా ట్రావెల్‌ ఏజెంట్‌ కూడా ఫోన్‌ చేసి, తర్వాత ట్రిప్‌ రష్యా అని చెప్పాడు. రష్యా టూర్‌లో మొదట మా ఇద్దరి పేర్లను తప్పక చేర్చమని చెప్పాను. ఈ ట్రిప్‌ అక్టోబర్‌ 21 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మా మనుమలు కూడా పాల్గొంటున్నారని’ కేఆర్‌ విజయన్‌ మీడియాకు తెలిపాడు.

 

"ఈ సారి రష్యా వెళ్లాలనుకుంటున్నాను. కోవిడ్‌ మహమ్మారి కారణంగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మళ్లీ ప్రయాణించే అవకాశం దక్కింది" అని మోహన అన్నారు. తీర్థయాత్రలకు వెళ్లే వయసులో ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని ఉవ్విళ్లూరుతున్న ఈ దంపతులు నేటి యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు కదా!

చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!

మరిన్ని వార్తలు