పేదరికపు కాటు: ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు

8 Oct, 2020 08:41 IST|Sakshi

తిరువంతపురం: ఆదిత్య పదేళ్ల పాపాయి. అమ్మానాన్న, తను మాత్రమే ఉన్నామనుకుంది. తమతోపాటు మరో ప్రాణి కూడా తమ ఇంటికి వస్తూ పోతూ ఉందని ఆ పాపాయికి తెలియదు. ఆ ప్రాణి ఓ రోజు నాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న ఆదిత్య హోమ్‌వర్క్‌ చేసుకుని, అమ్మ పెట్టిన అన్నం తిని నేల మీద పరుపు పరుచుకుని నిద్రపోయింది. ఆమె పడుకున్న తర్వాత ఆ ప్రాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చి పాపాయిని కాటేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఆదిత్య పడుకున్న పరుపు కిందకు దూరింది. తెల్లవారింది. ఆదిత్య ఎప్పటిలాగ నిద్రలేవలేదు. తల్లి సింధు ఆమెను నిద్రలేపుతుంటే బలవంతంగా కళ్లు తెరుస్తోంది, అంతలోనే కళ్లు మూతలు పడుతున్నాయి. ముఖం ఉబ్బి ఉంది. ఆదిత్య తల్లికి ఏదో అనుమానం వచ్చింది.

రాత్రి ఏదో కుట్టినట్లు అనిపించిన మాట నిజమేనని, చీమ కాబోలని చెప్పింది ఆదిత్య. నిజానికి అది చీమ కాదు. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు చలిచీమల చేత చిక్కి నిస్సహాయంగా ప్రాణాలు వదిలే విషసర్పం. ఆదమరిచి నిద్రపోతున్న ఆదిత్య దగ్గర తన ప్రతాపం చూపించిందా సర్పం. పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్‌ కాలనీలో జరిగింది.

ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు
ఆదిత్య తండ్రి రాజీవ్‌ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి. అతడి ఆవేదనలో అర్థం ఉంది. ఆ కుటుంబం నివసిస్తున్న ఇల్లు అత్యంత దయనీయంగా ఉంది. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన నీలం రంగు పాలిథిన్‌ పట్ట పరుచుకున్నాడు. గోడలకు ఉన్న రంధ్రాల నుంచి తేళ్లు, జెర్రుల వంటివి ఇంట్లోకి ప్రవేశించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏకంగా పామే వచ్చింది. పేదరికానికి పేగుబంధాన్ని బలి చేసింది. పైకి పాము కాటుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పేదరికపు కాటు. పేదరికం మీద ప్రభుత్వ వేసిన నిర్లక్ష్యపు వేటు.

>
మరిన్ని వార్తలు