శీఘ్రమేవ పెళ్లి డ్రస్సు ప్రాప్తిరస్తు

5 Oct, 2020 08:32 IST|Sakshi

ఏదో ఒకటి కట్టుకుని ఎలాగోలా పెళ్లి చేసుకునే నిరుపేద వధూవరులు ఈ దేశంలో కొల్లలు. అబ్బాయిలు సరే. అమ్మాయిలకు ఎన్ని కలలని. కనీసం పెళ్లినాడు మంచి పెళ్లికూతురి డ్రస్సు వేసుకోవాలని ఉండదా? దానికి కూడా వీలు లేకపోతే ఎంత బాధ? కేరళకు చెందిన సబిత ఈ బాధ గ్రహించింది. దేశంలోని దాతల నుంచి వారు ఉపయోగించిన పెళ్లి డ్రస్సులు సేకరించి కాబోయే పెళ్లికూతుళ్లకు ఉచితంగా ఇస్తోంది. అవి కట్టుకున్న ఆడపిల్లలు ఆనందబాష్పాలు రాలుస్తుంటే సబిత అదే పెద్ద ఆశీస్సుగా భావిస్తోంది. 

కేరళ కోస్తా టౌన్‌ అయిన కన్నూర్‌లో సముద్రపు అలలు ఎన్ని ఉంటాయో పేద ఆడపిల్లల కష్టాలూ అన్నే ఉంటాయి. వరుడు దొరకడం, ఆ వరుడికి చేయాల్సిన మర్యాదలకు డబ్బు దొరకడం, పెళ్లి ఖర్చు దొరకడం, అన్నింటికి మించి కనీసం మంచి పెళ్లి డ్రస్సు ఏర్పాటు చేసుకోవడం... నిరుపేద ఆడపిల్లలు నోరు తెరిచి ఏమీ అడగలేరు. మనసులో ఉంటుంది అంతే. ఆ మనసును గ్రహించింది సబిత. ప్రార్థిస్తున్న ద్రౌపదికి వస్త్రాలు బహూకరించాడు కృష్ణుడు. పెళ్లిబట్టలకు కూడా వీలు లేక మనసులోనే బాధపడుతున్న పెళ్లికూతుళ్లకు కొత్త బట్టలు ఇస్తోంది సబిత.

అమ్మాయి మనసు
కన్నూరులో ‘రెయిన్‌ బో’ పేరుతో ఒక బొటిక్‌ నడుపుతోంది సబిత తొమ్మిదేళ్లుగా. కొనుక్కోగలిగిన ఆడపిల్లలు ఆమె దగ్గరకు వచ్చి డిజైనర్‌ దుస్తులు, డిజైనర్‌ పెళ్లిబట్టలు కొనుక్కుని వెళ్లేవాళ్లు. కాని కొందరు ఆడపిల్లలు కేవలం చూడ్డానికి వచ్చేవారు. ఈ చూడ్డానికి వచ్చే ఆడపిల్లలు పెళ్లి పెట్టుకొని అలాంటి డ్రస్సులు కొనలేక కనీసం చూసన్నా పోదామని వచ్చేవారు. వారిని గమనించి తనకు వీలున్నప్పుడు కొన్ని డ్రస్సులు తయారు చేయించి సబిత ఇచ్చేది. కాని వారికి అంతగా సంతృప్తి కనిపించేది కాదు. ఎందుకంటే ఉచితంగా వస్తోంది కనుక ఇచ్చింది తీసుకోవాల్సి వచ్చేది. ఛాయిస్‌ ఉండేది కాదు. ‘నచ్చింది తీసుకున్నామన్న’ తృప్తి వారికి కావాల్సి వచ్చేది. కాని అందుకు బదులుగా ఏం చేయాలో సబితకు అర్థమయ్యేది కాదు. రెండు నెలల క్రితం ఒక అమ్మాయి మాత్రం తనకు పెళ్లి కుదిరిందని, పెళ్లి డ్రస్సు కోసం తండ్రి వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు సబితకు వచ్చింది ‘ఉపయోగించిన పెళ్లిబట్టలను సేకరించాలనే’ ఆలోచన.

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌
‘పెళ్లికోసం మీరు మంచి డ్రస్సులు కొనుక్కుంటారు. కాని అవి ప్రత్యేకమైనవి కాబట్టి ఒకటి రెండుసార్లు ఉపయోగించి దాచుకుని ఉంటారు. అవి వృధాగా పడి ఉంటాయి. అలాంటి బట్టలు పేద వధువులకు ఉపయోగపడతాయి. మంచి కండిషన్‌లో ఉండి, డ్రైక్లీనింగ్‌ చేయించి ఉన్న పెళ్లి బట్టలను మాకు పంపండి. పేద ఆడపిల్లలకు ఇస్తాం’ అని సబిత ఇన్‌స్టాగ్రామ్‌లో, తన వాట్సప్‌ గ్రూప్‌లో రెండు నెలల క్రితం వీడియో పెట్టింది. అంతే. ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. కన్నూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది స్త్రీలు సబితకు ఫోన్‌లు చేశారు. తమ పెళ్లిబట్టలు ఇస్తామని చెప్పారు. వెంటనే సబిత వాటిని కలెక్ట్‌ చేయడానికి ఒక మనిషిని అపాయింట్‌ చేసింది. కొన్ని బట్టలు కొరియర్‌లో వచ్చాయి. ఇప్పటి వరకూ ఆమె 300 జతల పెళ్లి బట్టలు రిసీవ్‌ చేసుకుంది. వాటిలో ఒక్కోటి లక్ష రూపాయల డ్రస్సు కూడా ఉన్నాయి. కొందరు చెప్పులు, ఇమిటేషన్‌ జువెలరీ కూడా పంపారు.

విడి షోరూమ్‌
సబిత తన షోరూమ్‌కు ఆనుకునే ఒక గదిని ఈ ఉచిత పెళ్లిడ్రస్సుల షోరూమ్‌గా మార్చింది. దీని గురించి తెలిసిన ఆడపిల్లలు వారు ఏ మతం వారైనా కాని వచ్చి ఉచితంగా తమకు నచ్చినది తీసుకుని వెళ్లవచ్చు. కాని వారికి త్వరలో పెళ్లి కాబోతున్నదని ఏదైనా ఆధారం (వెడ్డింగ్‌ కార్డ్, మత పెద్ద రాసిచ్చిన లేఖ) చూపించాలి. ఈ ఏర్పాటు గురించి కేరళ అంతా తెలిసి పోయింది. దూర ప్రాంతాల నుంచి డ్రస్సులు అడిగేవారు, డ్రస్సులు పంపుతామనే వారు పెరిగిపోయారు. దాంతో సబిత తన పరిచయస్తులు, బంధువుల ద్వారా ముఖ్యమైన టౌన్‌లలో వారి ఇళ్లలోనే ఒక గదిలో ఈ బట్టలను చేర్చే ఏర్పాటు చేసింది. ఫోన్‌ వస్తే దగ్గరి ఊర్లో ఉన్న ఉచిత బొటిక్‌కు రిఫర్‌ చేస్తుంది.

ఆనందబాష్పాలు
‘ఒక అమ్మాయి ఈ ఉచిత డ్రస్సు కోసం వచ్చింది. దానిని తీసుకున్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది. తర్వాత ఫోన్‌ చేసి చెప్పింది... నాకు ఏడుపు వచ్చేసింది.. అది కనపడకూడదని పరిగెత్తాను అని. మరొకమ్మాయి.. అక్కా... దేవుడు నా ప్రార్థనను నీ ద్వారా తీర్చాడు అని చెప్పింది. ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నేను ఇదంతా ప్రచారానికి చేయడం లేదు. నేను ఆ ఆడపిల్లల ఫొటోలు తీయడం కూడా చేయను. అందుకే వారు అసౌకర్యం లేకుండా నా దగ్గరికి వస్తున్నారు’ అంది సబిత. ఆమె భర్త షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఆమె చేస్తున్న పనికి ఫుల్‌ సపోర్ట్‌ అందిస్తున్నాడు.
మంచివాళ్లు ఉన్నారు లోకంలో.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు