ఓవైపు ఎల్‌ఎల్‌బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్‌!!

29 Oct, 2021 10:24 IST|Sakshi

మగవాళ్లు ఎంతో సులభంగా చేసే పరాటాను డిగ్రీ చదువుతోన్న 23 ఏళ్ల  అమ్మాయి అలవోకగా చేసేస్తోంది. హోటల్‌ నడుపుతోన్న కుటుంబానికి  సాయం చేసేందుకు కేరళకు చెందిన అనశ్వర పదేళ్ల వయసు నుంచే పరాటాలు తయారు చేస్తూ, మరోపక్క కాలేజికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది. 

కేరళలోని ఎరుమెలి గ్రామానికి చెందిన అనశ్వర, ఆల్‌ అజర్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్‌ చదువుతోంది. తన రోజు వారి సమయంలో సగభాగాన్ని చదువుకు, మరికొంత భాగాన్ని తన కుటుంబం నడుపుతున్న ‘హోటల్‌ ఆర్యా’’లో పనిచేయడానికి కేటాయిస్తోంది. శబరిమల వెళ్లేదారిలో కురువమూజి జంక్షన్‌లో ఉన్న ఈ హోటల్‌ను యాభై ఏళ్ల క్రితం అనశ్వర అమ్మమ్మ, తాతయ్యలు నారాయణి కుట్టప్పన్‌లు ప్రారంభించారు. వాళ్ల తరువాత గత ముప్ఫై ఏళ్లుగా అనశ్వర అమ్మ, పిన్ని సత్య కుట్టప్పన్‌లు హోటల్‌ను నిర్వహిస్తున్నారు. వీరికి హోటల్‌ పనుల్లో అనశ్వర చేదోడు వాదోడుగా ఉంటోంది.

చదవండి: నోరూరించే ఫిష్‌ కట్‌లెట్‌ విత్‌ రైస్‌, ఆనియన్‌ చికెన్‌ రింగ్స్‌ తయారీ..కొంచెం వెరైటీగా!

పదేళ్ల వయసులోనే అనశ్వర... అమ్మ పరాటాలు ఎలా చేస్తుందో ఆసక్తిగా గమనించేది. పిండిని గుండ్రంగా ఉండలు చేసే టెక్నిక్‌ను తన కజిన్‌ నుంచి నేర్చుకుని పరాటాలు ఫర్‌ఫెక్ట్‌గా చేయడం మొదలు పెట్టింది. అప్పటినుంచి దాదాపు 13 ఏళ్లుగా రోజుకు దాదాపు రెండు వందల  పరాటాలు చేస్తోంది. వేగంగా చక్కగా పరాటాలు చేయడంతో అనశ్వరని అందరూ ముద్దుగా ‘పరాటా’ అని పిలుస్తున్నారు. ఉదయం ఏడున్నర నుంచి అమ్మకు పరాటాలు చేయడంలో సాయంచేసి, తరువాత కాలేజికి  వెళ్తుంది. 

కాలేజి నుంచి వచ్చాక మళ్లీ అమ్మకు భోజనం తయారీలో సాయం చేస్తుంది. హోటల్లో పనిచేయడానికి పనివాళ్లు ఎవరూ లేకుండా కుటుంబ సభ్యులే చూసుకోవడం విశేషం. అనశ్వర పరాటాల గురించి తెలిసిన స్నేహితులు కూడా వాటిని రుచిచూసేందుకు హోటల్‌కు వస్తుంటారు. పరాటాలు రుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబకి  ఆర్డర్లు చేయడం, కస్టమర్ల కోరిక మేరకు డోర్‌ డెలివరి కూడా చేయడం విశేషం.     

‘‘పరాటాలు చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ పని చేయడానికి సిగ్గుపడను. భవిష్యత్‌లో చెఫ్‌ అయ్యే ఆలోచనలు ప్రస్తుతానికి ఏమిలేవు. తాతయ్యల కాలం నాటి హోటల్‌ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్‌లో ఎల్‌ఎల్‌ఎమ్‌ తర్వాత, పీహెచ్‌డీ చేస్తాను’’ అని అనశ్వర చెప్పింది. 

చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

మరిన్ని వార్తలు