ఒక ఎన్నికల ప్రేమకథ

9 Dec, 2020 05:44 IST|Sakshi

కేరళలో స్థానిక ఎన్నికల కథ ఎలా ఉన్నా అక్కడ పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల కథలు మాత్రం సినిమాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. పాలక్కాడ్‌లో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న జ్యోతి ఇప్పుడు న్యూస్‌మేకర్‌. చత్తిస్‌గడ్‌కు చెందిన ఈమె 2010లో బస్‌లో ప్రయాణిస్తూ అదే బస్‌లో ఉన్న కేరళకు చెందిన జవాన్‌ ను ప్రమాదం నుంచి రక్షించి తన చేతిని భుజం వరకూ కోల్పోయింది. అతడు ఆమెను హాస్పిటల్‌లో చేర్చాడు. పునఃజన్మ ఇచ్చినందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడామె కేరళ కోడలు. ఎన్నికలలో ఆమె గెలుపు కంటే ఈ ప్రేమ కథ అందరికీ ఇష్టంగా ఉంది.

సాహసాలు, త్యాగాలు చేసిన సామాన్యులు జనంలో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటారు. కాని పబ్లిక్‌లోకి వచ్చి నిలబడినప్పుడే వారి గాథలు లోకానికి తెలిసి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అసామాన్య స్త్రీల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కారణం ఇప్పుడు అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఆ పోటీల్లో భిన్నమైన నేపథ్యాలు ఉన్న మహిళలు పోటీకి నిలుస్తూ ఉండటమే. జ్యోతిది కూడా అలాంటి కథే.

దంతెవాడ అమ్మాయి
దంతెవాడకు చెందిన జ్యోతి 2010లో నర్సింగ్‌ చదువుతోంది. జనవరి 3న ఆమె తన హాస్టల్‌ నుంచి ఇంటికి వెళ్లడానికి బస్‌ ఎక్కింది. అదే బస్‌లో ఎవరో మిత్రుణ్ణి కలిసి క్యాంప్‌కు వెళుతున్న వికాస్‌ కూడా ఉన్నాడు. వికాస్‌ది కేరళలోని పాలక్కాడ. అతనక్కడ సిఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌)లో పని చేస్తున్నాడు. సాయంత్రం కావడంతో ప్రయాణికులు కునుకుపాట్లు పడుతున్నాడు. వికాస్‌ది విండో సీట్‌ కావడంతో విండో కడ్డీల మీద తల వాల్చి నిద్రపోతున్నాడు. జ్యోతి అతని వెనుక కూచుని ఉంది. ఇంతలో ఒక లారీ అదుపుతప్పి వేగంగా వస్తున్నట్టు జ్యోతి గ్రహించింది. అది విండోల మీదకి వస్తోంది. జ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వికాస్‌ను లాగేసింది. కాని అప్పటికే లారీ ఢీకొనడం, జ్యోతి కుడి చేయి నుజ్జు నుజ్జు కావడం జరిగిపోయాయి.

మొదలైన ప్రేమకథ
తేరుకున్న వికాస్‌ గాయపడిన జ్యోతిని తానే స్వయంగా దంతెవాడ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు ఇక్కడ వైద్యం కుదరదు... చేయి తీసేయాలి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లండి అని చెప్పారు. ‘ఆమె నీ ప్రాణం కాపాడ్డానికి ఈ ప్రమాదం తెచ్చుకుంది’ అని తోటి ప్రయాణికులు వికాస్‌కు చెప్పారు. వికాస్‌ ఆమెను రాయ్‌పూర్‌ తీసుకెళ్లాడు. వైద్యానికి అయిన ఖర్చంతా తనే భరించాడు. ‘తను నాకు పునర్జన్మను ఇచ్చింది. నేను ఆమెకు పునర్‌జీవితాన్ని ఇద్దామని నిశ్చయించుకున్నాను‘ అన్నాడు వికాస్‌. వారిద్దరూ క్రమంగా ప్రేమలో పడ్డారు.

ట్విస్ట్‌ వచ్చింది
అయితే ఈ ప్రేమ కథ సవ్యంగా సాగలేదు. జ్యోతి తండ్రి గోవింద్‌ కుండు ప్రభుత్వ ఉద్యోగి. తన కూతురికి యాక్సిడెంట్‌ అయ్యాక మొదట నర్సింగ్‌ చదువును మాన్పించాడు. చేయి పోవడానికి కారకుడైన వాడే ప్రేమ పేరుతో దగ్గరవుతున్నాడని తెలిసి ప్రేమకు అడ్డుగా నిలిచాడు. అయితే జ్యోతి వికాస్‌ను గట్టిగా ప్రేమించింది. ప్రేమే ముఖ్యం అనుకుంది. అంతే... ఇల్లు విడిచి అతనితో పాలక్కాడ్‌ వచ్చేసింది. 2011 ఏప్రిల్‌లో వారిద్దరికీ పెళ్లయ్యింది. వికాస్‌ ఉద్యోగరీత్యా దేశమంతా తిరుగుతూ ఉన్నా జ్యోతి పాలక్కాడ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి 8. చిన్నాడికి 4.

పంచాయతీ ఎన్నికలలో
ప్రస్తుతం కేరళలో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో సరైన మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్న పార్టీలు జ్యోతి కథ తెలిసి ఆమెను ఎన్నికలలో పోటీ చేయమని కోరాయి. జ్యోతి వెంటనే రంగంలో దిగింది. పాలక్కాడ్‌లో కొల్లన్‌గోడే బ్లాక్‌ నుంచి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తోంది. ‘నాకు ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కాని జనం మాత్రం నా ధైర్యానికి త్యాగానికి మెచ్చుకుంటున్నారు’ అని ఆమె చెప్పింది.
ఎన్నికల ప్రచారంలో జ్యోతి 

జ్యోతి ఎప్పుడూ ఒక శాలువను కుడి చేతి మీద వేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఆమె కుడిచేయి భుజం దిగువ వరకూ తీసివేయబడింది. ఆమె ఒక్క చేత్తోనే జీవితాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. గెలిస్తే పదవి బాధ్యతలను కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తుందనిపిస్తుంది. స్త్రీల సామర్థ్యాలకు అవకాశం దొరకాలే గాని నిరూపణ ఎంత సేపు.
– సాక్షి ఫ్యామిలీ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు