Mitra Satheesh: తల్లీకొడుకుల యాత్ర.. నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!

25 Nov, 2021 09:44 IST|Sakshi

Kerala Mithra Satheesh And Son On Epic Road Trip To Kashmir Interesting Facts: తెలుగువాళ్ల పూతరేకులు నచ్చాయి... జమ్ము – సోనామార్గ్‌లు కనువిందు చేశాయి. అస్సాం ఆదివాసీలు మనసు దోచుకున్నారు. నాగాలాండ్‌ గ్రీన్‌ విలేజ్‌ స్వాగతం పలికింది. ఇదీ... ఈ తల్లీకొడుకుల పర్యటన స్వరూపం.

డాక్టర్‌ మిత్రా సతీశ్‌ వయసు నలభై. ఆమె కేరళ రాష్ట్రం, కొచ్చిలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్‌. ఆమె కొడుకు నారాయణ్‌కి పదేళ్లు. ఇద్దరూ కారు ట్యాంకు నింపుకుని కొచ్చిలో బయలుదేరారు. ఏకంగా 17 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తమ భారతదేశ పర్యటనలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్‌ చేశారు. ఇంతకీ ఈ సుదీర్ఘ ప్రయాణం ఎందుకు? ఈ ప్రయాణంలో వాళ్లు తెలుసుకున్న కొత్త సంగతులేంటి? తెలుసుకుందాం.

నీలగిరి ‘తోడా’లు
డాక్టర్‌ మిత్ర గ్రామీణ భారతాన్ని స్వయంగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి వెళ్లారు. తోడా గిరిజనులను దగ్గరగా చూడడానికి, వారి జీవనశైలిని అధ్యయనం చేయడానికి కొచ్చి నుంచి నేరుగా నీలగిరికి ప్రయాణమయ్యారామె. అలా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించాలనుకున్నారు. అందుకే రాష్ట్రంలో కనీసం ఒక్క గ్రామాన్నయినా చూసేటట్లు టూర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. ఆ ఒక్క గ్రామం కూడా ఆ ప్రదేశానికి చెందిన లలిత కళలు, హస్తకళల ప్రాముఖ్యత ఉన్న గ్రామాలనే ఎంపిక చేసుకున్నారు డాక్టర్‌ మిత్ర. ఆ జాబితాలో ఇప్పటికే బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎక్కువగా ఉన్నాయి. 

పాండిచ్చేరి చాపనేత
ఈ తల్లీకొడుకులు తమ పర్యటనలో పాండిచ్చేరిలోని ఒక ముస్లిమ్‌ కుటుంబం నుంచి చాపనేత కళ నేర్చుకున్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వారసత్వంగా వస్తున్న కళ ఈ చాపనేత. స్థానికంగా దొరికే గడ్డిని మగ్గం మీద చాపలాగ నేస్తారన్నమాట. అలాగే వెళ్లిన ప్రతిచోటా స్థానిక రుచులను ఆస్వాదించారు. భౌగోళిక, చారిత్రక నేపథ్యాల్లో రూపుదిద్దుకున్న ప్రత్యేకమైన జీవనశైలిని చూసి ఆనందించారు. అలా జమ్ము, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ టూర్‌ లో మిస్‌ అయిన కర్నాటక కోసం దీనికి అనుబంధంగా ఓ చిన్న టూర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారామె. అందులో కూర్గ్, బేలూర్, బేలావాడి, మెల్కొటేలుంటాయన్నారు. 

అచ్చమైన మనిషి
సోనామార్గ్, అస్సాం, చత్తీస్‌గఢ్‌ వాళ్లు ఆత్మీయతంగా, స్వార్థరహితంగా కనిపించారు. వాళ్లను చూసినప్పుడు అచ్చంగా మనిషిని చూసిన సంతోషం కలిగిందన్నారామె. ‘‘జంతువులను వేటాడమే వృత్తిగా కలిగిన బోడో గిరిజనులు ఇప్పుడు మానాస్‌ నేషనల్‌ పార్క్‌లో జంతువులను సంరక్షిస్తున్నారు. ఇండియాలో తొలి గ్రీన్‌ విలేజ్‌ ఖోనామాను నాగాలాండ్‌లో చూశాను.

ఆదివాసీలందరూ పర్యావరణహితమైన వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. వాళ్లు వేటను పూర్తిగా త్యజించారు. ఒక మహిళ ఇలా దేశ పర్యటనకు వచ్చిందని తెలిసి అబ్బురపడుతూ నాకు జాగ్రత్తలు చెప్పారు. ఈ టూర్‌లో మేము చూసిన ఎత్తైన ప్రదేశం లధాక్‌లోని జోజి లా. మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రదేశం జమ్ము, కశ్మీర్‌లోని సోనామార్గ్‌ హిల్‌స్టేషన్‌. ఆంధ్రప్రదేశ్‌ వాళ్ల పూతరేకుల రుచిని మర్చిపోలేం.

హోమ్లీ స్టే
ఇక ఈ టూర్‌ కోసం నేను పాటించిన జాగ్రత్తలేమిటంటే... సూర్యోదయం స్టీరింగ్‌ పట్టుకుంటే సూర్యాస్తమయం సమయానికి ఆ రోజు ప్రయాణాన్ని ఆపేసేదాన్ని. బస కోసం హోమ్‌స్టేలకే ప్రాధాన్యం ఇచ్చాను. హోటళ్లతో పోలిస్తే ఖర్చు తగ్గడం మాత్రమే కాదు, స్థానికుల ఆత్మీయతను ఆస్వాదించవచ్చు. సొంతవాళ్లతో ఉన్నట్లే అనిపిస్తుంది.  వారి సంప్రదాయాలను, జీవనశైలిని కూడా తెలుసుకోవచ్చు. నమ్ముతారో లేదో కానీ ఈ టూర్‌కి అయిన ఖర్చు ఒకటిన్నర లక్ష మాత్రమే. నాకు ఈ టూర్‌కి వెళ్లకముందు కారు నడపడం మాత్రమే తెలుసు.

టూర్‌ కోసం కారుకి వచ్చే చిన్న చిన్న రిపేర్‌లు, టైరులో గాలి చెక్‌ చేసుకోవడం, టైరు మార్చడం వంటివి కూడా నేర్చుకున్నాను. మగవాళ్లు లేకుండా ఆడవాళ్లు మాత్రమే సోలో టూర్‌ చేసేటప్పుడు పిల్లలను తీసుకువెళ్లడానికి భయపడతారు. కానీ పదేళ్లు నిండిన పిల్లలైతే ఏమీ భయపడాల్సిన పని లేదు. కొత్త ప్రదేశాల నుంచి పెద్దవాళ్ల కంటే పిల్లలే ఎక్కువ తెలుసుకుంటారు. అలాగే ప్రదేశాలకు తగినట్లు, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలను తీసుకుని వెళ్లడమే సరైన నిర్ణయం’’ అంటారు డాక్టర్‌ మిత్ర.

చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు...
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఈ స్వరం... మైమరపిస్తుంది.. పనిచేయిస్తుంది!
  

మరిన్ని వార్తలు