రకరకాల పాకెట్‌ డ్రెస్సులు.. కొంచెం కొత్తగా..

26 Oct, 2021 11:00 IST|Sakshi

‘మీరు బయటకు వెళ్లే సమయం లో వెంట ఓ ఫోన్, కొంత డబ్బు, కార్డుల్లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. మీ డ్రెస్‌కి జేబులు ఉంటే చేతులను ఫ్రీగా వదిలేసి, సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంద’నే లక్ష్యంతో దుస్తులను రూపొందించి, దానినే వ్యాపారంగా మార్చుకుంది కేరళవాసి జయలక్ష్మి. 

‘మహిళల దుస్తులను నేటి కాలానికి తగిన విధంగా రూపొందించాలి. ఆమె ధరించే దుస్తులకు పాకెట్స్‌ ఉండటం వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి’ అంటారు త్రిసూరులో ఉంటున్న జయలక్ష్మీ రంజిత్‌. పాకెట్స్‌.13 పేరుతో ప్రస్తుత స్థితిని మార్చడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానంటోంది. 

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

లాక్‌డౌన్‌ టైమ్‌లో రూపకల్పన
పాకెట్స్‌ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినిదే అయినా 20 వ శతాబ్దం వరకు మహిళ లు ఉపయోగించే దుస్తులకు జేబులు ఉండటం అరుదైన విషయమే. ‘అవి కూడా చాలా సన్నగా ఉన్న మహిళలు ధరించే ప్యాంట్స్‌కు అంతే నాజూకుగా, శృంగారపు మూలాలకు సూచికగా ఉండేవి’ అంటారు జయలక్ష్మి. అగ్రికల్చర్‌ ఇంజినీర్, కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌ అయిన జయలక్ష్మి కరోనా సమయంలో పరిస్థితుల కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఖాళీగా ఉన్న ఆ సమయం తన ఆలోచన రూపుకట్టడానికి బాగా ఉపయోగపడిందనే జయలక్ష్మి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ పాకెట్‌ డ్రెస్‌ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 

చిన్నప్పుడే అనుకున్నాను
మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్‌లను జయలక్ష్మి తరచి తరచి చూస్తుంటుంది. ‘ఎందుకంటే, నేను పురుషులకు రూపొందించిన నా సైజు జీన్స్‌ కొన్నాను. వాటిని ధరించి, నా ఫోన్‌ వెనుక జేబులో ఉంచినప్పుడు, అది జారి కిందపడిపోయింది. పైగా నాకు అలా వెనుక వైపు పాకెట్‌ను ఉపయోగించే అలవాటు లేదు. చిన్న చిన్న పాకెట్స్‌ కేవలం కొన్ని నాణేలు ఉంచడానికి సరిపోతాయి. అందుకే, పురుషులందరికీ ఒకే విధంగా ఉండేలాంటి ఫంక్షనల్‌ పాకెట్స్‌ మహిళల దుస్తుల్లో ఉండకూడదనుకున్నాను’ అని తన పాకెట్‌ రూపకల్పన గురించి వివరిస్తుంది. ‘నాకు ఆరేడేళ్ల్ల వయసున్నప్పుడు డ్రెస్‌కు పాకెట్స్‌ పెట్టించమని మా అమ్మను అడిగేదాన్ని. దానికి మా అమ్మ పెద్ద శిక్షగా భావించేది. నేనే టైలర్‌ ఆంటీతో పరిచయం పెంచుకొని, నచ్చిన పాకెట్స్‌తో డ్రెస్‌ కుట్టించుకునేదాన్ని’ అని తన చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. 

జేబును బట్టి డ్రెస్‌
చదువు, ఉద్యోగం కోసం నగరానికి వెళ్లినప్పుడు కూడా ‘పాకెట్స్‌’అనే విషయం జయలక్ష్మి నుంచి దూరం కాలేదు. తన డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్‌ చేసుకునేది. స్నేహితులు, సహోద్యోగులు ఆమె పాకెట్‌ దుస్తులను చూసి, తమకు కూడా డిజైన్‌ చేసిమ్మని అడిగేవారు. ‘అప్పుడు సమయం కుదరలేదు. మహమ్మారి మొదట్లో తగినంత సమయం ఉండేది. దీంతో కొన్ని డిజైన్లు పాకెట్‌ ఆధారంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించాను. చిన్న, మధ్యస్థ, లార్జ్‌ డ్రెస్సుల్లోనూ వాటికి తగిన విధంగా పాకెట్స్‌ రూపొందించాను. 

కొన్ని డిజైన్లు అందంగా ఉన్నాయని, కొన్ని డిజైన్లు అంతగా నప్పలేదని నా స్నేహితులే చెప్పారు. చాలా బాధపడ్డాను కూడా. దీంతో కొంతమంది టైలర్లను కలిసి, వారితో నా డిజైన్ల గురించి  చర్చించాను. కొన్ని డిజైన్‌ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ఆర్డర్‌ చేసుకున్నవారు మీ శరీర కొలతలను పంపిస్తే, దానిని బట్టి రెండు వారాల్లో పాకెట్‌ డ్రెస్‌ డిజైన్‌ చేసి, పంపిస్తాను’ అని చెప్పాను. అలా ఒక రోజులో రూ.70 వేలు సంపాదించాను’ అంటారు జయలక్ష్మి. మార్కెట్‌లో పాకెట్‌ డ్రెస్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకెట్స్‌.13ను వివిధ వాణిజ్య బ్రాండ్‌లకు దీటుగా రంగంలోకి దింపుతోంది జయలక్ష్మి. 

చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో..

మరిన్ని వార్తలు