50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడ్‌.. ఎవరీ అంబికా క్రిష్టన్‌..?

30 Apr, 2022 16:23 IST|Sakshi

కోచి(కేరళ)కు చెందిన అంబికా క్రిష్టన్‌ భర్త శివరాజ్‌ చనిపోయాడు. అప్పుడు  ఆమె వయసు పందొమ్మిది సంవత్సరాలు. మూడు నెలల పసిపాప. ఒక్కసారిగా తనను చీకటి కమ్మేసినట్లుగా అనిపించింది. ఎంత మరిచిపోదామన్నా భర్త జ్ఞాపకాలు తనను విపరీతంగా బాధిస్తున్నాయి.

ఒకానొక దశలో అయితే...
‘అసలు నేను బతకడం అవసరమా?’ అనుకుంది.
 ఆ సమయంలో పాప తనవైపు చూస్తుంది. వెంటనే నిర్ణయాన్ని మార్చుకుంది... పాప కోసమైనా బతకాలని!
బికామ్‌ డిగ్రీ పూర్తిచేసింది. సాయంత్రాలు కంప్యూటర్‌క్లాస్‌లకు వెళ్లేది. తాను కాలేజికి వెళ్లే రోజుల్లో స్నేహితులు, ఇంటిపక్క వాళ్లు పాపను చూసుకునేవారు.
ఒక సంస్థలో తనకు ఎకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎంత ఆత్మవిశ్వాసం వచ్చిందో!

ఆ తరువాత ఆకాశవాణి రెయిన్‌బో 107.5లో  పార్ట్‌–టైమ్‌ జాబ్‌లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ తనలోని సృజనాత్మకతకు పనిచెప్పే అవకాశం లభించింది. ఎంతోమందిని ఇంటర్యూ్య చేసింది. అవి కాలక్షేపం ఇంటర్వ్యూలు కావు...పదిమందికి స్ఫూర్తి పంచే ఇంటర్య్వూలు.
ఈ ఉద్యోగం తనకు నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడే నైపుణ్యాన్ని ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక బాధ్యతను నేర్పింది. 

ఆకాశవాణి రెయిన్‌బోలో  ఉత్తమ ఆర్‌జేగా పేరు తెచ్చుకున్న అంబికా ఇప్పుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోలోగా ఆల్‌ ఇండియా బైక్‌ రైడ్‌ చేస్తుంది. 50 రోజుల పాటు సాగే ఈ రైడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న 25 రెయిన్‌బో స్టేషన్‌లను కనెక్ట్‌ చేస్తూ సాగుతుంది. ఈ బైక్‌ యాత్రలో భర్తను కోల్పోయిన సైనికుల భార్యలను కలుసుకుంటుంది.

వీరులకు నివాళి అర్పిస్తుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలతో మాట్లాడుతుంది. వారు మానసికంగా ఒంటరి ప్రపంచంలో ఉంటే...తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పి ధైర్యం చెబుతుంది. వారికి తన పరిధిలో చేతనైన సహాయం చేస్తుంది. ఒకప్పుడు ఏ పాప ముఖం చూసి అయితే తాను కచ్చితంగా బతకాలని నిర్ణయించుకుందో...ఆ పాప ఆర్యా ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది.
‘50 రోజుల పాటు ఒంటరిగా బైక్‌ రైడా! ఎందుకొచ్చిన రిస్క్‌’ అన్నారు కొద్దిమంది స్నేహితులు.
‘రిస్క్‌’ అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఆ ఆలోచనను బ్రేక్‌ చేస్తేనే ముందుకు వెళ్లగలమనే విషయం ఆమెకు తెలియందేమీ కాదు.

భర్త చనిపోయిన తరువాత...
‘నీ జీవితం రిస్క్‌లో పడింది. ఎలా నెట్టుకొస్తావో ఏమో’ అనేవారు కొందరు. నిజమే అనుకొని తాను ఆ నిరాశపూరిత భావన దగ్గరే నిస్సహాయకంగా ఉండి ఉంటే ఏమై ఉండేదోగానీ...ముందుకు కదిలింది. చిన్నా చితాక ఉద్యోగాలు చేసింది. సొంతకాళ్ల మీద నిలబడింది. బిడ్డను బాగా చదివించింది.
అంబికా యాత్ర వృథా పోదు. ప్రతి ఊరికి తమవైన స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. వాటిని సేకరిస్తూ, పంచుతూ వెళ్లడం ఎంత గొప్పపని!

మరిన్ని వార్తలు