Sruthy Sithara: ఫస్ట్‌ ఇండియన్‌ మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివర్స్‌గా శ్రుతి సితార..

5 Dec, 2021 08:10 IST|Sakshi

ఫస్ట్‌ ఇండియన్‌ మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివర్స్‌ 2021 

Keralas Sruthy Sithara Crowned Miss Trans Global Universe 2021: సమాజం చూసే చిన్నచూపును అధిగమిస్తూ ఇప్పుడిప్పుడే అన్నింటా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు ట్రాన్స్‌జెండర్లు. ఇప్పుడు కేరళలో ఉంటున్న శ్రుతి సితార ఫస్ట్‌ ఇండియన్‌ మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివర్స్‌ 2021 టైటిల్‌ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ‘సమాజంలో ట్రాన్స్‌జెండర్స్‌ పట్ల ఉన్న సంకుచిత మనస్తత్వాలను మార్చేందుకు, ఏళ్లుగా చేసిన పోరాటం వల్ల ఈ కిరీటాన్ని దక్కించుకున్నాను’ అని ఆనందంగా చెబుతుంది శ్రుతి సితార.

ప్రపంచంలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని నింపడానికి లండన్‌ వేదికగా ప్రతి యేటా మిస్‌ ట్రాన్స్‌ గ్లోబల్‌ యూనివవర్స్‌ పోటీలు జరుపుతారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఆన్‌లైన్‌ వేదికగా ఈ నెల మొదట్లో పోటీలు జరిపారు. ప్రపంచం నలుమూలల నుండి పాల్గొన్న ట్రాన్స్‌ ఉమెన్‌లలో శ్రుతి సితార మొదటి ప్లేస్‌లో నిలిచి, కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి ఇద్దరు రన్నరప్‌లుగా నిలిచినవారిలో వరుసగా ఫిలిప్పీన్స్, కెనడాకు చెందివారున్నారు. 

సమాజంలో సమాన హక్కులు
‘ఈ రోజు నేను పుట్టి పెరిగిన మా ఊరు వైకోమ్‌ లో ఉన్నాను. మొదట్లో నన్ను వింతగా చూసిన నా చుట్టుపక్కల వాళ్లే ఇప్పుడు నా విజయానికి అభినందనలు తెలుపుతున్నారు’ అని తన విజయగాథను వివరించే సితార సామాజిక న్యాయ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ సెల్‌లో పని చేస్తున్నారు. మోడల్‌గానూ, ఆర్టిస్ట్‌గానూ ఉన్న శ్రుతి ఎల్జీబీటీ, క్వీర్‌ రైట్స్‌పై ప్రచారం చేయడానికి కృషి చేస్తోంది. సామాజిక న్యాయవిభాగం నుంచి రూపొందించినకార్యక్రమాలలో వివిధ పాఠశాలలు, కళాశాలలలో ప్రసంగించింది. కమ్యూనిటీ హక్కులను సాధించడానికి ప్రజల ఆమోదాన్ని పొందేందుకు ఈ ట్రాన్స్‌ మహిళ తన స్నేహితులతో కలిసి ‘ది కెలిడోస్కోప్‌’ అనే పేరుతో ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించింది.

సమాజంలో సమాన భాగాన్ని సాధించాలని కోరుకుంటున్నాం. బయటకు రావడానికి భయపడే చాలా మంది ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడిప్పుడే నన్ను సంప్రదిస్తున్నారు. వారి జీవితాల్లో ఆశ, ధైర్యాన్ని అందించడమే నా ముందున్న లక్ష్యం. నేను నడిచే దారిలో ఇప్పుడు ఈ కిరీటం నాకు ఎంతగానో సహాయపడుతుంది’ అని ఉద్వేగంగా చెబుతూనే తన ఆనందాన్ని వ్యక్తం చేసింది శ్రుతి. కిరీటాన్ని అందుకున్న శ్రుతి దానిని తన దివంగత తల్లితో పాటు తన స్నేహితురాలు, ఫస్ట్‌ ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకి అయిన అనన్యకుమారి అలెక్స్‌కు అంకితం చేసింది. అనన్య నాలుగునెలల క్రితం కొచ్చిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, శారీరక బాధకు లోనై ఆత్మహత్యకు పాల్పడింది.

చదవండి: Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా!
  

మరిన్ని వార్తలు