Khajjiar Hill Station: ఇండియాలోనూ మినీ స్విట్జర్లాండ్‌... ఎక్కడో తెలుసా!

17 Jul, 2021 08:43 IST|Sakshi

ఇంటి మీద కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా కట్టిన ఏటవాలు పై కప్పు నిర్మాణాలు... బరువైన ఉన్నితో దేహాన్ని భారంగా కదిలించే గొర్రెలు...   లేత ఆకుపచ్చని నేల...ముదురు ఆకుపచ్చని చెట్లు...  పారాషూట్‌లో నేలకు దిగే అమ్మాయిలు...  హార్స్‌ రైడింగ్‌కి సిద్ధమవుతున్న కుర్రాళ్లు... చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడిచే హనీమూన్‌ కపుల్‌. ఈ ప్రదేశం స్విట్జర్లాండేమో అనే భ్రమ కల్పిస్తోంది...   కానీ ఇది ఇండియానే... ఇండియాలో ఉన్న మినీ స్విట్జర్లాండ్‌.


ఖజ్జైర్‌ చిన్న హిల్‌ స్టేషన్‌. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. ఆరువేల ఐదు వందల అడుగుల ఎత్తులో విశాలమైన ప్రదేశంలో ఓ సరస్సు, ఆ సరస్సు మధ్యలో నీటి మీద తేలుతున్న ఓ దీవి. ఎగిరి దూకినా సరే... దెబ్బ తగలని మెత్తటి పచ్చిక బయళ్లు... పిల్లలు ముచ్చపడడానికి ఇంకేం కావాలి. ఆహ్లాదకరమైన వాతావరణం కావడంతో హనీమూన్‌ కపుల్‌ మనసులను దోచుకుంటోంది. పదాలు రాని వాళ్ల చేత కవిత్వం చెప్పించగలిగించే అందమైన ప్రదేశం ఖజై్జర్‌. ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశాన్ని చూస్తూ దివి నుంచి భువికి దిగి వచ్చిన స్వర్గం అంటారు. మంచులో తడిసిన చెట్లను చూస్తూ... మంచు తివాచీ పరుచుకున్న తెల్లటి నేల మీద నడవాలంటే శీతాకాలంలో వెళ్లాలి.


ఖజ్జైర్‌ సరస్సు నుంచి కొద్ది దూరం నడిస్తే బంగారు గోపురం ఉన్న పన్నెండవ శతాబ్దం నాటి ఆలయం కనిపిస్తుంది. చంబాను ఏలిన రాజు పృథ్వీసింగ్‌ కట్టించిన ఆలయం అది. ఖజై్జర్‌ నుంచి దైన్‌కుండ్‌ వరకు మూడున్నర కిలోమీటర్ల ట్రెకింగ్‌ పాథ్‌ ఉంది. ఇది దేహదారుఢ్యానికి పరీక్ష పెట్టే ట్రెకింగ్‌ కాదు. చాలా సునాయాసంగా పూర్తి చేయవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లిన వాళ్లు కూడా ప్రయత్నించవచ్చు.

 

మరిన్ని వార్తలు