Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో..

8 Feb, 2023 10:21 IST|Sakshi

న్యూస్‌ మేకర్‌

Khelo India Gamesచెప్పుల్లేకుండా రోజూ 7 కిలోమీటర్లు ఆకలి కడుపుతో స్కూల్‌కు పరిగెత్తిన అమ్మాయి గత వారం రోజుల్లో రెండు బంగారు పతకాలు సాధించింది. నిన్న మొన్నటి దాకా ఆమె ఇంటికి కరెంట్‌ లేదు. తల్లికి వచ్చే వెయ్యి రూపాయల వితంతు పెన్షన్‌ బతకడానికి ఆధారం. అయినా సరే ఆటల్లో నిలిచి గెలిచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ కోసం ఆశలు పెట్టుకోదగ్గ అమ్మాయిగా నిలిచింది.

16 ఏళ్ల నిరుపేద బాలిక ఆశా కిరణ్‌ బార్లా స్ఫూర్తి గాథ ఇది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భోపాల్‌లో జరుగుతున్న జాతీయ ఖేలో ఇండియా పోటీల్లో న్యూస్‌ మేకర్‌ ఆశా కిరణ్‌ బార్లా.

వారికి పేదరికం శాపం. కాని వారి పోరాటానికి అడ్డు లేదు.
వారికి పోషకాహారలోపం. కాని వారి బలానికి తిరుగులేదు.
దేశంలో ఎందరో పేద క్రీడాకారులు. కాని వారి సంకల్పానికి ఓటమి లేదు.

17 ఏళ్ల లోపు ఉండే దేశగ్రామీణ క్రీడాకారులను ఉత్సాహపరచడానికి 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్న ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌’లో భాగంగా జనవరి 30 మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 వరకూ జరుగుతున్న ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2022’ పోటీల్లో ఎందరో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు. ఎందరినో ఆశ్చర్యపరుస్తున్న కొత్త ముఖాలు.

ఆశా కిరణ్‌ బార్లా కూడా అలాంటి మాణిక్యమే. ఎవరీ బార్లా అని అందరూ ఆమె పట్ల ఆరా తీస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఆశా సాధించిన విజయాలతో ఎంతో ప్రచారం పొందాల్సింది. కాని జార్ఖండ్‌కు చెందిన ఈ నిరుపేద ఆదివాసీ క్రీడాకారిణిని ఎవరు పట్టించుకుంటారు?

పరుగుల రాణి
‘పీటీ ఉష నాకు ఆదర్శం’ అని చెప్పే 16 ఏళ్ల బార్ల చిరుతతో సమానంగా పరిగెత్త గలదు. 2022లో కువైట్‌లో జరిగిన ఆసియా యూత్‌ ఫెస్టివల్‌లో 800 మీటర్ల పరుగుల పోటీలో మన దేశం నుంచి రికార్డు నమోదు చేసింది. ఇంతకు ముందు ఉన్న రికార్డును చెరిపేసింది. ఈ ఘనవిజయానికి ఆమెకు రావలసినంత పేరు భారతీయ మీడియాలో రాలేదు.

విషాదం ఏమంటే కువైట్‌లో సాధించిన ఈ ఘనతను వారి ఇంట్లో రెండు రోజుల తర్వాత తెలుసుకున్నారు. ఎందుకంటే వారి ఇంటికి కరెంట్‌ లేదు. ఇంట్లో టీవీ లేదు. వారికి ఫోన్‌ కూడా లేదు. ఆశా కిరణ్‌ బార్లా ఈ ఘనత సాధించాక అధికారులు వచ్చి హడావిడిగా కరెంట్‌ ఇచ్చారు. జిల్లా స్పోర్ట్స్‌ యంత్రాంగం ఒక టీవీ కొని ఇచ్చింది. ‘కాని మాకు తిండి ఎట్లా?’ అంటుంది బార్లా.

ఆకలితో పరిగెత్తి
ఆశా కిరణ్‌ బార్లాది జార్ఖండ్‌లో రాంచీకి 100 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొండల మధ్య ఉన్న అతి చిన్న గిరిజన తండా. 22 ఇళ్లు ఉంటాయి. చుట్టుపక్కల నక్సల్స్‌ బెడద ఉండటంతో కరెంటు, ఫోన్‌ సిగ్నల్స్‌ దాదాపుగా ఆ తండాకి లేవు. అలాంటి ఊర్లో పని చేసిన ఏకైక టీచర్‌ విలియమ్స్‌ కుమార్తె ఆశా కిరణ్‌. కాని 9 ఏళ్ల క్రితం ఆ విలియమ్స్‌ మరణించడంతో ఆ కుటుంబం దిక్కు లేనిదైంది.

నలుగురు పిల్లల్ని వితంతు పెన్షన్‌తోటి తల్లి రోసానియా సాకాల్సి వచ్చింది. ఆశా కిరణ్‌ అక్క ఫ్లోరెన్స్‌ బాగా పరిగెత్తుతుంది. అది చూసి ఆశా కూడా పరిగెత్తడం నేర్చింది. చిన్నప్పటి నుంచి కొండలు గుట్టలు ఎక్కిన కాళ్లు కనుక వారి కాళ్లల్లో విపరీతమైన వేగం. కాని తండ్రి మరణం తర్వాత జరుగుబాటు కోసం ఐదో తరగతి పూర్తి చేసిన ఆశాను వాళ్లమ్మ రాంచిలో ఏదో ఇంటిలో పనికి పెట్టింది. ఒక సంవత్సరం ఇంట్లో పనిమనిషిగా, వెట్టి కార్మికురాలిగా పని చేసింది ఆశా.

టీచర్‌ తెచ్చిన మార్పు
ఆశా అక్క ఫ్లోరెన్స్‌ వాళ్ల తండాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహుగావ్‌కు వెళ్లి చదువుకునేది. ఫ్లోరెన్స్‌ పరుగు చూసి వాళ్ల స్కూల్‌ టీచర్‌ సిస్టర్‌ దివ్య ‘నువ్వు బాగా పరిగెత్తుతున్నావ్‌’ అనంటే ‘మా చెల్లెలు ఇంకా బాగా పరిగెత్తుతుంది’ అని ఫ్లోరెన్స్‌ చెప్పింది. దాంతో ఆ టీచర్‌ రాంచీలో పనిమనిషిగా ఉన్న ఆశా కిరణ్‌ను తెచ్చి తన స్కూల్లో చేర్చింది.

అక్కచెల్లెళ్లు ఇద్దరూ టిఫిన్‌ చేయకుండా స్కూల్‌కి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. స్కూల్‌ అయ్యాక ఆకలికి తాళలేక మళ్లీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లేవారు. టీచర్‌ ఇది గమనించి తానే స్వయంగా వారికి రేషన్‌ ఇచ్చి చదువులో క్రీడల్లో ప్రోత్సహించడమే కాదు ఇలాంటి గిరిజన బాలికలను సొంత ఖర్చులతో ట్రయిన్‌ చేసే కోచ్‌ ఆశు భాటియా దృష్టికి తీసుకెళ్లింది. బొకారో థర్మల్‌ టౌన్‌లో ఉన్న తన అథ్లెట్స్‌ అకాడెమీలో ఆశా కిరణ్‌ను చేర్చుకున్న ఆశు భాటియా తగిన శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె పతకాల పంట పండిస్తోంది.

రెండు స్వర్ణాలు
ఇప్పటికి 11 నేషనల్, 2 ఇంటర్నేషనల్‌ పతకాలు సాధించిన ఆశా తాజాగా భోపాల్‌లో జరుగుతున్న ఖేల్‌ రత్న యూత్‌ గేమ్స్‌లో 800 మీటర్ల పరుగులో, 1500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించింది. దాంతో పరిశీలకులు 2024లో పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆశాను ఒక ప్రాపబుల్‌గా ఎంపిక చేశారు.

‘కాని ఏం లాభం? ఆమెను ఒలింపిక్స్‌ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి నా దగ్గర వనరులు లేవు’ అని దిగులు పడుతున్నాడు కోచ్‌ ఆశు భాటియా. ‘మా జీవితాలు మెరుగు పరిస్తే మా అమ్మాయి ఇంకా రాణిస్తుంది’ అంటుంది తల్లి.
ఈ ప్రతికూలతలు ఎలా ఉన్నా గెలిచి తీరాలనే సంకల్పం ఆశాలో.
ఇలాంటి క్రీడాకారిణుల గురించి ఎంత ప్రచారం చేస్తే అంత సాయం దక్కుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు అందరూ చేయవలసిన పని అదే.

చదవండి: Sneh Rana: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌
WPL 2023: డబ్ల్యూపీఎల్‌ వేలం.. బరిలో 409 మంది
  

మరిన్ని వార్తలు