Khyati Trehan: నేర్చుకుంటున్నాను.. వస్తుంది... అని మాత్రమే అనుకోవాలి! అప్పుడే

8 Apr, 2022 10:50 IST|Sakshi

3డి డిజిటల్‌ ఆర్ట్‌ అనేది యాంత్రిక పనికాదు. మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే మ్యాజిక్‌. ఆ మ్యాజిక్‌ మ్యూజిక్‌పై  పట్టు ఉన్న ఆర్టిస్ట్‌ ఖ్యాతి త్రెహాన్‌.  అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఆమె సృజనకు ఖ్యాతి వచ్చింది... త్రీడిలో అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించిన ఖ్యాతి...ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. దిల్లీకి చెందిన ఖ్యాతికి కథలు వింటున్నప్పుడో, సినిమాలు చూస్తున్నప్పుడో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం ఇష్టం. 

ఆ ప్రపంచంలో ఎన్నెన్నో అందమైన దృశ్యాలు ఉంటాయి. అయితే ఆ అలవాటు వృథా పోలేదు. తనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’లో చదువుకుంటున్న రోజుల్లో విజువల్‌ వరల్డ్‌కు ఉన్న పవర్‌ ఏమిటో తెలుసుకుంది. అందమైన, అద్భుతమైన, అనూహ్యమైన ఊహాప్రపంచం అయినప్పటికీ.. దానికి కావాల్సిన వనరు వాస్తవ జీవితంలో నుంచే వస్తుంది అని నమ్ముతుంది ఖ్యాతి.

‘ప్రతి పనిలో మనదైన క్రియేటివ్‌ సిగ్నేచర్, స్టైల్‌ ఉండాలి’ అంటున్న ఖ్యాతి ఒక ప్రాజెక్ట్‌ ముందుకు రాగానే పని ప్రారంభించడం అని కాకుండా రకరకాలుగా రిసెర్చ్‌ చేసి, ఆ సారాంశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని పనిలోకి దిగుతుంది.  ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశంగా భావించి కష్టపడుతుంది.
సృజన ఆవిష్కరణకు ఖ్యాతి ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్‌ అవుతుంది?

ఆమె మాటల్లోనే చెప్పాలంటే...
‘ఎవ్రీ థింగ్‌ అండ్‌ ఎవ్రీ వన్‌’ అలా శూన్యంలోకి చూస్తున్నప్పుడు ఆకాశంలో ఈదుతూ వెళ్లే పక్షి కావచ్చు. నుదుటిని సుతారంగా తాకే గాలిరాగం కావచ్చు... ఏదైనా సరే... ఎప్పుడైనా సరే. అందుకే ఖ్యాతి ఆర్ట్‌వర్క్‌లో మనుషులతో పాటు ప్రకృతి కనిపిస్తుంది.

‘నేర్చుకున్నాం. వచ్చేసింది... అనే భావన మంచిది కాదు. నేర్చుకుంటున్నాను. వస్తుంది...అని మాత్రమే అనుకోవాలి. మన మేథోమధనంలో నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు వస్తుంటాయి’ అని చెబుతున్న ఖ్యాతిలో ఒక ఆలోచన తళుక్కున మెరవగానే, ఆ ఐడియా ఫాబ్రిక్‌ బ్లూప్రింట్‌ టెక్చర్‌ లైబ్రరీ నుంచి ఇమేజ్‌గా మారవచ్చు. లేదా ఎడోబ్‌ సూట్, సినిమా 4డీ, ఫిగ్మాలలో అబ్బురపరిచే కళారూపం కావచ్చు.

ఖ్యాతికి ప్రపంచవ్యాప్తంగా బోలెడుమంది అభిమానులు ఉన్నారు. ఆమె క్లయింట్స్‌ జాబితాలో శాంసంగ్, యాపిల్, అడోబ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌... ఇలా బోలెడు పేరున్న కంపెనీలు ఉన్నాయి.

చెప్పుకోదగ్గ మరో ఘనత ఏమిటంటే...
94వ అకాడమీ (ఆస్కార్‌)అవార్డ్‌ల వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది ఆర్టిస్ట్‌లను ఆహ్వానించారు. అందులో ఖ్యాతి కూడా ఒకరు. ‘సినిమా మిమ్మల్ని ఎలా ఇన్‌స్పైర్‌ చేసింది?’ అనే ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని ఆస్కార్‌ స్టాచ్యూకు ప్రతీకాత్మకరూపాన్ని  సృష్టించాలి. ఖ్యాతి సృష్టించిన దానికి మంచి పేరు వచ్చింది.

కళాప్రపంచంలో ఒక మాట వినిపిస్తుంటుంది. ‘నేను ఆలోచించిందే చిత్రిస్తాను. చూసింది కాదు’ కానీ 29 సంవత్సరాల ఖ్యాతీ త్రీడి ఆర్ట్‌ చూస్తే...తాను చూసిన దృశ్యాలతో పాటు, ఆలోచనలూ కనిపిస్తాయి. 

చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?

మరిన్ని వార్తలు