పెయిన్.. కిల్లింగ్! నెల రోజుల్లోనే 20 మంది, ఆర్‌ఎంపీల వైద్యమే కారణమా..

30 May, 2023 09:09 IST|Sakshi

‘మా మండలంలోని మామిడిగూడ, ముత్నూర్, హర్కాపూర్‌ గ్రామాల్లో గత నెల రోజుల వ్యవధిలోనే 20 మంది కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఆర్‌ఎంపీల వైద్యంతోనే అమాయక ఆదివాసీలు కిడ్నీలు చెడిపోయి మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలి.’ ఈ నెల 24న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత చేసిన వ్యాఖ్యలివి. 

బేల మండలంలో బెంగాల్‌ డాక్టర్ల వైద్యం అమయాక ప్రజల ప్రాణలమీదకు తెస్తుంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో స్థానికంగా ఉన్న బెంగాల్‌ వైద్యుల వద్దకు వెళ్లగా మోకాళ్లలో హైడోస్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇవి తీసుకున్న వారి కిడ్నీలు నెల వ్యవధిలోనే చెడిపోయి డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.’ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 27న కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఇది.

ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది ఆర్‌ఎంపీల అచ్చీరాని వైద్యం అమయాక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పల్లెవాసులు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా వీరినే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో వారు మోతాదుకు మించి ఇస్తున్న హైడోస్‌ ఇంజక్షన్లు బాధితుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెల గడువక ముందే బాధితులు డయాలసిస్‌కు వెళ్లాల్సి వస్తుండడం గమనార్హం. ఆర్‌ఎంపీల వైద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఫిర్యాదులు అందుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. 

ఆర్‌ఎంపీల వైద్యమే కారణమా..
జిల్లాలో ఆయా గూడాలు, తండాల్లో ఉండే ఆదివాసీలు, గిరిజనులు అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కువగా ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తుంటారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థికస్థోమత లేకపోవడం, ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉన్న వీరే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది అచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణల మీదకు తెస్తున్నారు. రోగుల జబ్బులు త్వరితగతిన నయం కావాలని హైడోస్‌ ఇంజక్షన్లు వేస్తున్నారు. మోతాదుకు మించి మాత్రలు ఇస్తున్నారు. వాటిని ఉపయోగించిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నప్పటికీ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్‌ఎంపీల వద్ద ఇంజిక్షన్లు తీసుకున్న రోగులు నెల గడవక ముందే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. 

పెరుగుతున్న బాధితులు 
జిల్లాలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు బెంగాళి వైద్యుల వైద్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీరితో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేని ఆర్‌ఎంపీలు సైతం పల్లెల్లో తిరుగుతూ రోగులకు అనధికారికంగా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆసుపత్రి తరహాలో పడకలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని బేల, ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ తదితర మండలాల్లో ఇలాంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వీరు మోతాదుకు మించి ఇస్తున్న మాత్రలు, ఇంజక్షన్లతో రోగుల కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్‌ఎంపీలను ఆశ్రయించిన మరుసటి నెలకు రిమ్స్‌కు వెళ్లితే అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్‌ చేయాలని చెబుతుండటం కలవరానికి గురి చేస్తోంది. 

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ 
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. 

ఫిర్యాదు చేస్తే     చట్టపరంగా చర్యలు
వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేకుండా ఆర్‌ఎంపీలు ప్రాక్టీస్‌ చేయడం చట్టరీత్యానేరం. అలాగే పడకలతో కూడిన వైద్యమందించడం కూడా నిబంధనలకు విరుద్దం. ఇలాంటి వారు ఎక్కడైనా వైద్యం చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంద్రవెల్లి మండలంలో  20 మంది ఒక నెలలో మరణించారనడం పూర్తిగా అవాస్తవం. గతంలో ధనోరాలో ఇలాంటి పరిస్థితే ఉందని మా దృష్టికి రావడంతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశాం.
– రాథోడ్‌ నరేందర్,  డీఎంహెచ్‌వో 

పరిమితికి మించితే ప్రమాదం
ఆర్‌ఎంపీలు యాంటిబయటిక్స్, పెయిన్‌ కిల్లర్స్, స్టిరాయిడ్స్‌ ఇవ్వడానికి వీలు లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే వీరి వద్దకు వచ్చే బాధితులకు పరిమితికి మించి పెయిన్‌కిల్లర్స్, యాంటిబెటిక్స్‌ ఇస్తుంటారు. నెలల తరబడి వీటిని వాడడంతో బీపీ, షుగర్‌తో పాటు ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ప్రజలు వారికి వచ్చిన జబ్బును నిపుణులైన వైద్యులతో నిర్ధారించుకొని చికిత్స చేయించుకోవాలి. ఆర్‌ఎంపీలపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
– డాక్టర్‌ సుమలత, ఎండీ ఫిజీషియన్‌ 

మరిన్ని వార్తలు