ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..

20 Jan, 2023 05:57 IST|Sakshi
నాగ చంద్రికాదేవి; వృద్ధుల సేవలో...

కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె.

‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్‌ బ్రేకర్‌లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె.  
 
నైరాశ్యం– నేను– నా బిడ్డ
‘‘మా నాన్న మెడికల్‌ ఆఫీసర్‌. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్‌ టీచర్‌లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్‌ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్‌ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది.
 
ఒకరికి ఒకరు తోడు
మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్‌ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్‌ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్‌ ఇచ్చి గవర్నమెంట్‌ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్‌ పేరెంట్‌ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు.  
 
సామాజిక చైతన్యం
మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్‌ కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్‌ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్‌ సేవలే ప్రధానంగా ఉంటాయి. 

హోమ్‌ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ  హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్‌ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్‌ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్‌ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్‌ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్‌ నిర్మాణం పూర్తయితే మా హోమ్‌ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి.

సేవలోనే సాంత్వన
నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్‌ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్‌ అవార్డు, నేషనల్‌ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్‌ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్‌ వచ్చింది. నేను హైదరాబాద్‌ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాను.  
– నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్‌

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు