-

Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట

27 Nov, 2023 10:46 IST|Sakshi

కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు.

తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి.

శ్రీ కేదారేశ్వర వ్రత కథ
శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు.

శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు.

సాక్షాత్‌ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్‌ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది.

అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు.

వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు.

వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది.

అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు.

ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు.

-డి. వీ. ఆర్. భాస్కర్

మరిన్ని వార్తలు