ప్రేమకు ఫార్ములా లేదు!

22 Mar, 2021 07:52 IST|Sakshi

ఏదో సినిమాలో ప్రేమ ఎందుకు విఫలమైందంటే వంద కారణాలు చెప్పవచ్చు, కానీ ఎందుకు పుట్టిందంటే కారణం చెప్పలేము. నిజమే.. జీవుల్లో సుదీర్ఘకాల ప్రేమ ఫలానా కారణం వల్ల పుడుతుందని చెప్పలేం. అసలింతకీ ప్రేమంటే? డిక్షనరీ చూస్తే ‘‘లోతైన ఆప్యాయత యొక్క తీవ్రమైన భావన’’అని ఉంటుంది. ప్రేమికులేమో ఒకరికోసం ఒకరు అనే ఫీలింగే ప్రేమంటారు. పెద్దవాళ్లేమో జీవితాంతం కలిసుండాలని భావించే ఇద్దరి మధ్య ఏర్పడే బంధం అంటారు. ఆక్సిటోసిన్‌ సహా పలు హార్మోన్ల విడుదలతో పాటు మెదడులో పలు రసాయన చర్యల ఫలితమే ప్రేమని సైన్సు చెబుతోంది.

భగ్న ప్రేమికులేమో అంతా ట్రాష్‌ అంటారు. ఇందులో ఏది నిజమంటే అన్నీ నిజమనే అనుకోవచ్చు. ప్రేమ ఒక సార్వజనీన భావన. కేవలం మనుషుల్లో మాత్రమే లాంగ్‌టర్మ్‌ రిలేషన్‌కు కారణమయ్యే ప్రేమ ఉంటుందనుకుంటే పొరపాటే! పలు ఇతర క్షీరదాల్లో, ఉదాహరణకు గబ్బిలాలు, తొడేళ్లు, బీవర్లు, నక్కలు, ముంగీసలు, లెమూర్లలాంటివాటిల్లో సైతం ఈ దీర్ఘకాలిక కలిసుండే ప్రేమ భావన కనిపిస్తుంది. మరి అన్ని ప్రేమలూ ఒకటేనా అంటే సైన్సు కాదంటుంది. జంతువును బట్టి మెదడులో ప్రేమ కారక బ్రెయిన్‌ సర్క్యూట్లు మారతాయని శాస్త్ర విజ్ఞానం తేల్చిచెబుతోంది. ముంగీసల్లో జీవితంలో మూడింట ఒక భాగం ఏక భాగస్వామితో కలిసి జీవించడం కనిపిస్తే, లెమూర్లలాంటి వాటిలో దీర్ఘకాలిక ప్రేమ కాస్త స్వల్పకాలికంగా మారుతుంటుంది.

ఎలుకలు చెప్పాయి
క్షీరదాల్లోని 6500 జాతుల్లో(స్పీసిస్‌) కేవలం 3–5 శాతం జాతుల్లోనే ఈ దీర్ఘకాలిక ప్రేమ భావన(మోనోగమస్‌) కనిపిస్తుంది. 90 శాతం పక్షుల్లో జీవిత భాగస్వామి పట్ల విశ్వాసం చూపడం కనిపిస్తుంది. ఎందుకు జీవుల్లో ఈ బేధం అన్న విషయమై డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. దాదాపు 30సంవత్సరాల పాటు ప్రేమ ఫార్ములా కనుక్కోవడంపై జరిపిన పరిశోధనల్లో రెండు హార్మోన్లు కీలకమని తేలింది. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్‌ అనే హార్మోన్లు ఎక్కువ చురుగ్గా ఉండే జీవుల్లో మోనోగమీ (దీర్ఘకాలిక ప్రేమ) నమోదయింది. దీంతో కేవలం హార్మోన్ల ప్రభావమే ప్రేమకు కారణమని సైంటిస్టులు తొందరపాటు నిర్ధారణకు వచ్చారు.

ఎలుకలపై జరిపిన పరిశోధనలను తిరిగి లెమూర్లపై జరిపితే ఈ హార్మోన్లు అన్ని రకాల లెమూర్లపై(మోనోగమీ, పాలీగమీ జరిపేవి) ఒకే ప్రభావం చూపుతున్నట్లు నమోదయింది. దీంతో తిరిగి ప్రేమ ఫార్ములా రూపొందించే పని మొదటికొచ్చింది. పైన చెప్పిన హార్మోన్లు మరో జీవిపై ఆకర్షణను పెంచే లవ్‌టానిక్‌లాగా పనిచేయవచ్చు కానీ, కేవలం వాటివల్లే ప్రేమ పుడుతుందనలేమంటూ విసిగిపోయిన సైంటిస్టులు ప్రస్తుతానికైతే ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేమని చేతులెత్తారు. కానీ ఎప్పటికైనా దీన్ని కనిపెట్టితీరతామంటున్నారు. సో.. ఇప్పటికైతే ప్రేమకు ఎలాంటి ఫార్ములా లేదనేదే ఖాయం.

మరిన్ని వార్తలు