Kochi: మొదట బుల్లెట్‌.. ఇప్పుడు బస్‌! స్టీరింగ్‌ ఏదైనా ‘లా’గించేస్తుంది!

28 Jul, 2022 09:53 IST|Sakshi

స్టీరింగ్‌ ఏదైనా లాగించేస్తుంది

ఇప్పటి తరం అంతా అపారమైన టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తుంటే.. యాన్‌ మేరి అన్సెలెన్‌ అనే యువ న్యాయ విద్యార్థి మాత్రం తనకు భారీ వాహనాలు నడపడం ఇష్టమని చెబుతూ ఏకంగా బస్సు స్టీరింగ్‌ను అవలీలగా తిప్పేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

కొచ్చిలోని పీజీ అన్సెలెన్, స్మితా జార్జ్‌ల ముద్దుల కూతురే 21 ఏళ్ల యాన్‌ మేరి అన్సెలెన్‌. తండ్రి కాంట్రాక్టర్‌గా, తల్లి పాలక్కడ్‌ జిల్లా అడిషనల్‌ జడ్జ్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే మేరీ టెంత్, ఇంటర్మీడియట్‌ మంచి మార్కులతో పాసైంది. ప్రస్తుతం ఎర్నాకులం లా కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. 

బుల్లెట్‌ నుంచి బస్‌ దాకా...
జడ్జ్‌ కావాలన్నదే మేరి జీవిత లక్ష్యం. కానీ పదిహేనేళ్ల వయసులో డ్రైవింగ్‌ నేర్చుకోవాలన్న ఆసక్తి కలగడంతో బైక్‌ నడపడం నేర్చుకుని పదోతరగతిలో ఉండగానే ఏకంగా తన తండ్రి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ని నడిపింది. పద్దెనిమిదేళ్లు నిండాక టూవీలర్, ఫోర్‌ వీలర్‌ లైసెన్స్‌ తీసుకుంది.

లైసెన్స్‌ రాగానే తనకంటూ సొంత క్లాసిక్‌ బుల్లెట్‌ బండిని కొనిపించుకుంది. అప్పటి నుంచి ఆ బండి మీద చెల్లిని ఎక్కించుకుని స్కూల్లో దింపి, తను కాలేజీకి వెళుతోంది. 21వ పుట్టినరోజున నాలుగు చక్రాల భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు ట్రైనింగ్‌లో చేరింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని గతేడాది ఫిబ్రవరిలో భారీవాహనాల లైసెన్స్‌ను కూడా తీసుకుంది. 

బస్‌ డ్రైవర్‌గా...
లైసెన్స్‌ రాగానే మేరి ఇంటిపక్కనే ఉండే ప్రైవేట్‌ బస్‌ యజమాని శరత్‌తో మాట్లాడి అతని బస్సుని నడిపేది. మేరీ ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డ శరత్‌ బస్సుని రోడ్డు మీద నడపడానికి మేరీకి అనుమతిచ్చాడు. మరికాస్త నమ్మకం ఏర్పడిన తరువాత ప్రయాణీకుల్ని ఎక్కించుకుని బస్సును నడిపేందుకు ప్రోత్సహించాడు.

దీంతో కక్కానాడ్‌–పెరుంబదాప్పు మార్గంలో ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే బస్‌డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఆదివారం వచ్చిందంటే మేరీ ఈ రూట్‌లో ఉచితంగా బస్సుని నడుపుతూ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటిదాకా లా విద్యార్థి, పవర్‌ లిఫ్టర్, కీబోర్డు ఆర్టిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకున్న మేరీ తాజాగా డ్రైవర్‌గా మన్నన లు పొందుతోంది. జేసీబీలు, పెద్దపెద్ద కంటైనర్‌లు నడపడం నేర్చుకోవాలని ప్రస్తుతం మేరీ శిక్షణ తీసుకుంటోంది. వారం మొత్తం లా చదువుకు సమయం కేటాయించి, ఆదివారం మాత్రమే ప్రైవేటు బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. 
 
భయపడినవారంతా ఫ్రెండ్స్‌ అయ్యారు!
‘‘తొలిసారి నేను బస్సు నడపడం చూసిన వారంతా ..‘‘ఈ అమ్మాయి కచ్చితంగా యాక్సిడెంట్‌ చేస్తుంది. ఈ బస్సు ఎక్కితే మనం అయిపోయినట్లే అనుకునేవారు’’. అయితే వారం వారం అదే రూట్లో నేను బస్సు జాగ్రత్తగా నపడడం చూసిన వారందరికి క్రమంగా నా మీద నమ్మకం ఏర్పడి బస్సు ఎక్కేవారు.

ఏ రంగంలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగినప్పుడే కదా కలలు నెరవేరేది’’. – యాన్‌ మేరి అన్సెలెన్‌.
చదవండి: Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి

మరిన్ని వార్తలు