న్యూస్‌ మేకర్‌: జీవితం ఆమెతో ఫుట్‌బాల్‌ ఆడింది

17 Jan, 2023 05:56 IST|Sakshi
జొమాటో గర్ల్‌గా.. పౌలమి అధికారి..; ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా...

మొన్న ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్‌ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్‌కటా ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్‌ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది.

జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్‌ తొడుక్కుని కోల్‌కటాలో సైకిల్‌ మీద ఫుడ్‌ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్‌ డెలివరీ చేస్తోంది. కోల్‌కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్‌ యూజర్‌ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్‌లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్‌ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

అబ్బాయి అనుకునేవారు
కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్‌ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్‌ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్‌ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్‌ అనే ఫుట్‌బాల్‌ కోచ్‌ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్‌ ఇచ్చింది.

నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్‌ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్‌ 16 ఛాంపియన్‌షిప్‌ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్‌నెస్‌ ట్రయినింగ్‌ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్‌ ‘హోమ్‌లెస్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌’ కోసం దేశం తరఫున గ్లాస్‌గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు.

వెంటాడిన పేదరికం
2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్‌ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్‌డౌన్‌ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్‌ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్‌ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది.

వెల్లువెత్తిన స్పందన
పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్‌ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే  మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్‌ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం.
ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు