పుస్తకం చల్లగుండ

3 Apr, 2021 06:45 IST|Sakshi

స్ట్రీట్‌ లైబ్రరీ

కోల్‌కతా పేరు వినగానే ప్రధానంగా రెండు విషయాలు మన మదిలో మెదులుతాయి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మిష్టి దోయి అనే తీపి వంటకం, రెండవది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచనలు. కోల్‌కతా లో మిష్టిదోయితో పాటు బెంగాలీల రుచికరమైన పదార్థాలు అమ్మే ఓ షాప్‌ ముందు ఇటీవల ఠాగూరు పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలున్న ఓ పాత ప్రిజ్‌ లాంటి అల్మరా మన చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

కాళిదాస్‌ హర్దాస్, కుంకుమ్‌లు దంపతులు. కోల్‌కతాలోని పాటులీలో వీరిద్దరూ ఇటీవల స్ట్రీట్‌ లైబ్రరీని ప్రారంభించారు. తమ పాత ఫ్రిజ్‌ను పుస్తకాల అల్మరాగా మార్చారు. తినుబండారాలు అమ్మే షాప్‌ ఓనర్‌తో మాట్లాడి, ఆ షాపు బయట ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ఫ్రిజ్‌ బుక్‌ లైబ్రరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలలో పుస్తకపఠన అలవాటును పెంచడానికే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు. ‘మేం పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమను విస్తృతం చేయడం ద్వారా అంతగా సంతోషాన్ని పొందుతున్నాం’ అని చెప్పిన ఈ ఇద్దరూ షాప్‌ యజమానితో కలసి కోల్‌కతాలోని పాటులీలో ఉచిత వీధి గ్రంథాలయాన్ని తెరిచారు.  

షాప్‌ యజమాని తారాపోద్‌ కహార్‌ ను సంప్రదించి, అతని షాప్‌ ముందు ‘కొంత స్థలాన్ని పుస్తకాలు ఉంచడానికి ఉపయోగించవచ్చా’ అని అడిగారు. కహార్‌ వెంటనే వీరి ప్రతిపాదనను అంగీకరించాడు. దీంతో ఆ దుకాణం బయట పెద్దలు, యువకులు చదవడానికి వీలుగా పుస్తకాలతో నిండిన ఫ్రిజ్‌ అల్మరాను ఏర్పాటు చేశారు.

సందేశాల ఫ్రిజ్‌ల్మరా!
పాఠకులు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక నెల తర్వాత తిరిగి ఇవ్వమనే సందేశాన్ని ఫ్రిజ్‌కు పక్కన రాసి ఉంచారు. ఎవరైనా తమకు నచ్చిన, చదివిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిజ్‌ బుక్‌ లైబరీ లో ఉంచచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ బుక్‌ లైబ్రరీ గురించి తెలుసుకున్న ప్రజలు ఈ చొరవను ఇష్టపడ్డారు. ఇలాంటి లైబ్రరీలను మిగతా వారూ ప్రారంభించాలని, తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు