Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్‌ చేస్తున్నారు.. ఎందుకంటే..

22 Sep, 2021 13:06 IST|Sakshi

పండగపూట ఒక కొత్త కాటన్‌ చీర...

రాబోయే రోజులు పండగ కళతో ప్రభవించే రోజులు. దుర్గపూజను దృష్టిలో పెట్టుకొని కోల్‌కతాలోని ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ పాటులి’ (హెచ్‌వోపీ) అనే స్వచ్ఛంద సంస్థ నిరుపేద మహిళలకు కొత్త చీరలను అందజేయడానికి ‘ఒక కొత్త కాటన్‌చీర’ పేరుతో ఫేస్‌బుక్‌ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడురోజుల్లోనే దీనికి మంచి స్పందన వచ్చింది. దాతల నుంచి వచ్చిన కొత్తచీరలను ఎప్పటికప్పుడు పేదమహిళలకు అందిస్తున్నారు.

‘పేదలకు మనకు తోచిన రీతిలో సహాయం చేయడం మన కనీసధర్మం’ అంటుంది స్వప్న అనే గృహిణి. స్వప్న కూతురు కూడా తల్లి బాటలోనే నడిచి తన పొదుపు మొత్తంలో కొంత కొత్తచీరల కోసం ఇచ్చింది.
సౌత్‌ కోల్‌కతాలోని ఒక కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌ అయిన శ్రేయషి దానధర్మాల గురించి వినడం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించింది లేదు. ఫేస్‌బుక్‌లో ‘ఒక కొత్త కాటన్‌ చీర’ ప్రచారానికి ఆకర్షితురాలైన శ్రేయషి తన వంతుగా కొన్ని కొత్తచీరలను కొని డొనేట్‌ చేసింది. అక్కడితో ఆగిపోలేదు. తన మిత్రులు, బంధువుల ద్వారా ఇంకొన్ని కొత్త చీరలు డొనేట్‌ చేయించింది.

‘కరోనా దెబ్బతో చాలా రోజులు పనులు లేవు. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పనులు దొరుకుతున్నాయిగానీ చాలా భాగం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఈ సమయంలో పండగపూట ఒక కొత్త చీర కొనుక్కోవాలి అనే ఆలోచన చేయలేం. చేసినా కొనే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఉచితంగా కొత్త చీరలు ఇస్తున్నారని తెలిసి తీసుకున్నాను. సంతోషంగా ఉంది’ అంటుంది పాటులి మురికివాడలో నివసించే  రాజశ్రీ.

మతసామరస్యంపై రకరకాల కార్యక్రమాలు చేపట్టే ‘హెచ్‌వోపీ’ గత సంవత్సరమే ‘ఒక కొత్త కాటన్‌ చీర’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే గతంతో పోలిస్తే... ఇప్పుడు స్పందన గొప్పగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గత సంవత్సరం పిల్లలకు కొత్తదుస్తులు ఇప్పించడం వరకు మాత్రమే మొదట పరిమితమయ్యారు. ఆ తరువాత మహిళలను చేర్చారు.

ఈసారి చెప్పుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు...
1. రిపీట్‌గా డొనేట్‌ చేసేవారు పెరగడం
2. తమ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, కొత్త చీరలు దానం చేసేవారి సంఖ్య పెరగడం.
వెతుక్కుంటూ సంస్థ కార్యాలయానికి వచ్చి మరీ స్వయంగా కొత్త చీరలు అందించేవారు కొందరైతే, కొరియర్‌ ద్వారా పంపించేవారు కొందరు.
‘హెచ్‌వోపీ’ నినాదం...ఫెస్టివ్‌ జాయ్‌ ఫర్‌ ఆల్‌! మంచి మనసులు ఉన్న మనుషులు ఉన్నచోట అదేమంత కష్టమైన పని కాదని మరోసారి నిరూపణ అయింది.

చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో..
  

మరిన్ని వార్తలు