అ‘విశ్రాంతం’: పనిలో ఉంటే మనసూ బాగుంటుంది

5 Apr, 2022 04:26 IST|Sakshi

స్త్రీలకు రిటైర్‌మెంట్‌ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది.
‘కాని అలా ఉంటే బోర్‌. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్‌ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది.

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం రైతునగర్‌ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంగా చేరి, సూపర్‌వైజర్‌గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్‌ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది.

కష్టమనుకుంటే కుదరదు
‘ఎ.ఎన్‌.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్‌ఎమ్‌ నుంచి సూపర్‌వైజర్‌గా చేసి, రిటైర్‌ అయ్యాను’ అంటుందామె.

ప్రయత్నాలు ఫలవంతం
‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్‌ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను.

పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె.

మరవని సేవ..
‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను.

అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి.

విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను.

– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి

మరిన్ని వార్తలు