సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను సాగు

28 Dec, 2020 08:31 IST|Sakshi
సలీం సిమెంటు ట్యాంకులో కొర్రమీను చేపలు 

బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేసిన షేక్‌ సలీం ఇంటికి తిరిగి వచ్చి, వినూత్న పద్ధతిలో చేపల సాగు చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సలీం ఇంటర్‌ ఎంపీసీ విద్యనభ్యసించారు. 23 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లి రియాద్‌ నగరంలో పనిచేశారు. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో అతని స్నేహితుడు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండేవాడు. ప్రతి శుక్రవారం సెలవు రోజు అతని దగ్గరకు వెళ్లి వారి సాగు పద్ధతులను పరిశీలిస్తూ ఉండేవారు. సిమెంటు ట్యాంకుల్లో చేపల పెంపకం, పురుగులను మేతగా వేయటం అక్కడే నేర్చుకున్నారు సలీం. 

6 ట్యాంకుల్లో కొర్రమీను
ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే చేపల సాగు చేపట్టి మంచి ఆదాయం గడించవచ్చనే తలంపుతో ఏడాది క్రితం నుంచి తండ్రి సహాయంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చారు. దేవరుప్పులలో 15 గుంటల (20 గుంటలు = అరెకరం) స్థలంలో 20 అడుగుల చుట్టుకొలత, 5 అడుగుల లోతు ఉండే గుండ్రని ఆరు సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 3 ట్యాంకుల్లో 3 నెలలుగా కొర్రమీను (బొమ్మ చేపల) పెంపకం చేపట్టారు. మూడు నెలల్లో కొర్రమీను చేపలు 200 గ్రాముల బరువుకు పెరిగాయని, ఏడాదికి కిలో బరువు పెరుగుతాయని సలీం తెలిపారు. కిలోన్నర మేత మేపితే కిలో బరువుకు పెరుగుతాయన్నారు. 15 రోజుల క్రితం మరో మూడు ట్యాంకుల్లో కూడా కొర్రమీను సాగు ప్రారంభించారు. మొత్తం 6 ట్యాంకుల్లో 36,000 కొర్రమీను పిల్లలను వదిలారు.

కొర్రమీను చేప పిల్లలకు మేపుతున్న పురుగులను చూపుతున్న రైతు సలీం

చేపలకు పురుగుల ఆహారం
బురద నీటిలో పెరిగే కొర్రమీను (బొమ్మ చేపల)కు మంచి గిరాకీ ఉండటంతో వీటిని సిమెంటు ట్యాంకుల్లో పెంచుతున్నారు సలీం. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పురుగులను ఆహారంగా వేస్తూ పెంచుతున్నారు. పల్లి చెక్క, తౌడును కలిపి తగిన తేమతో వారం రోజులు ట్రేలలో ఉంచితే.. పురుగులు తయారవుతున్నాయి. వీటిని బొమ్మ చేపలకు మేతగా వేస్తే రెండు నెలల్లో రెండు వందల గ్రాముల బరువు పెరిగాయని సలీం తెలిపారు. మొదటి నెల వరకు పురుగులను మాత్రమే రోజూ మేతగా వేశారు. ఆ తర్వాత నుంచి పురుగులతోపాటు కొనుగోలు చేసిన బలపాల (పెల్లెట్ల) మేతను కూడా కలిపి వేస్తున్నారు.  ఇందుకోసం షెడ్‌లో 10 వరకు ట్రేలను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ కొన్ని ట్రేలలో పల్లి చెక్క, తవుడు కలిపి పెడుతున్నారు. ముందే పెట్టిన ట్రేలలో సిద్ధమైన పురుగులను తీసి చేపలకు వేస్తున్నారు. రోజుకు 300–400 గ్రాముల పురుగులను వేస్తున్నారు. 

మరో 26 ట్యాంకులు
ప్రస్తుతం కొర్రమీను చేపలు సాగు అవుతున్న 6 ట్యాంకులకు తోడు మరో 26 సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 12“12 అడుగుల కొలతలో చతురస్త్రాకారంలో ఈ ట్యాంకులను నిర్మించారు. వీటిపైన 6“6 అడుగుల మేరకు సిమెంటు శ్లాబ్‌ ఏర్పాటు చేశారు. ట్యాంకు పై కప్పు సగం మూసి ఉంటే, ట్యాంకులో నీటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచటం వీలవుతుందని ఆయన చెబుతున్నారు. దానితోపాటు ట్యాంకు పై కప్పు మీద ఆక్వాపోనిక్స్, రీసర్క్యులేటరీ పద్ధతిలో చేపల ట్యాంకులో నీటితోనే అజొల్లాను సాగు చేసి చేపలకు ఆహారంగా వేస్తానన్నారు. ఈ నీటితోనే కూరగాయలు సాగు చేయాలని కూడా ఆలోచిస్తున్నానని సలీం చెప్పారు.  
ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరో 50 వేల కొర్రమీను చేప అతిచిన్న పిల్లల(ఒకటిన్నర అంగుళం)ను తీసుకు వచ్చి.. రెండు నెలలు సిమెంటు ట్యాంకుల్లో 8–10 అంగుళాల సైజు వరకు పెంచిన తర్వాత రైతులకు మట్టి చెరువుల్లో పెంపకానికి అమ్ముతానని సలీం తెలిపారు. తనతో పాటు తోటి రైతులు కూడా కొర్రమీను చేపలు పెంచి మంచి ఆదాయం గడించాలన్నదే తన అభిమతమని ఆయన తెలిపారు.  
– నల్ల లక్ష్మీపతి, సాక్షి, దేవరుప్పుల, జనగాం జిల్లా

సిమెంటు ట్యాంకుల్లో చేపలు  పెరగవన్నారు!
సౌదీ మూడేళ్ల కిందట సిమెంటు ట్యాంకుల్లో పురుగుల మేతతో చేపలు, కూరగాయల పెంపకాన్ని చూసినప్పుడు నాలో ఆసక్తి కలిగింది. స్వగ్రామంలోనే  15 గుంటల్లో 32 సిమెంటు ట్యాంకులు నిర్మించా. సుమారు 65 లక్షల ఖర్చయ్యింది. తండ్రి ఇమామ్‌  తోడ్పాటుతో ఎడాది క్రితం నుంచి పనులు చేయిస్తున్నారు. సహజ పద్ధతిలో పురుగుల మేత, పెల్లెట్ల మేతలతో కొర్రమీను సాగు చేస్తున్నా. ఏడాదిలో కిలో సైజుకు పెంచి బతికున్న చేపలనే అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను పెరగదని అందరూ అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా పెంచి చూపిస్తున్నా. కొర్రమీను పిల్లలను 2 నెలలు పెంచి రైతులకు అమ్ముతా. మట్టి చెరువుల్లో జాగ్రత్తలు తీసుకొని పెద్ద పిల్లలను పెంచితే 8 నెలల్లో వారికీ మంచి ఆదాయం వస్తుంది. కొర్రమీనుకు ఏ కాలంలో అయినా ఏ ఊళ్లో అయినా మంచి గిరాకీ ఉంటుంది. –షేక్‌ సలీం (93110 47909), దేవరుప్పుల, జనగామ జిల్లా

మరిన్ని వార్తలు