విదేశాలకు మన అత్తరు

26 Oct, 2023 00:41 IST|Sakshi

బిజినెస్‌

యురోపియన్, అమెరికన్‌ పెర్‌ఫ్యూమ్స్‌ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్‌ టాండన్‌ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్‌ అఫీషియల్‌ కానుకల జాబితాలో చేరింది.  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్‌ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్‌ పర్‌ఫ్యూమ్‌లతో తగ్గిపోయాయి. కనౌజ్‌లో ఉంటున్న క్రతి, వరుణ్‌ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది.
తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు.

‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్‌ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్‌’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి.

చేస్తున్న ఉద్యోగాలు వదిలి...
    జర్మనీలోని కార్పొరేట్‌ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్‌ కూడా స్వస్థలానికి  చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్‌ తీసుకొచ్చాం.

ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్‌ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్‌ బ్రాండ్‌ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్‌.

ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది.
 
కుటుంబ సభ్యులు కూడా...
కనౌజ్‌ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్‌–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్‌లోని ఇతర బ్రాండ్స్‌ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం.

ఈకామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్‌లలో రిటైల్‌ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం.

మరిన్ని వార్తలు