kristin Gray: అమ్మను మించిన అమ్మ

12 Oct, 2021 23:44 IST|Sakshi

స్త్రీలందరికీ గర్భసంచి ఉంటుంది. కాని అమెరికా టీచరమ్మ క్రిస్టిన్‌ గ్రేకు ప్రేమ సంచి ఉంది. జీవితంలో మగతోడు లేకుండా జీవించాలనుకున్న క్రిస్టిన్‌ అనాథ ఆడపిల్లలకు అమ్మ కాదలుచుకుంది. మున్ని, రూప, మోహిని, సోనాలి, సిగ్ధ... 2013తో మొదలయ్యి 2020లోపు ఐదుమంది మన దేశపు అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకుంది క్రిస్టిన్‌. ఆడపిల్లలు అనాథాశ్రమంలో కంటే ఇళ్లల్లో కూతుళ్లుగా పెరగడం మంచిది అంటుందామె. ఆ కూతుళ్లను సొంత కూతుళ్లుగా అడాప్ట్‌ చేసుకునే అమ్మను మించిన ప్రేమ అందరికీ ఉండొద్దూ...

2015.
గుజరాత్‌. కచ్‌లోని అనాథ బాలికల కేంద్రం ‘కచ్‌ మహిళా కల్యాణ్‌ కేంద్ర’లోని మూడున్నరేళ్ల బాలికను దత్తత తీసుకోవడానికి అమెరికా నుంచి క్రిస్టిన్‌ వచ్చింది. ఆ బాలిక పేరు రూప. సాధారణంగా అనాథ బాలికలను దత్తత తీసుకునేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు. కాని వారంతా రూపను దత్తత తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఆ పాపకు ముక్కు లేకపోవడమే. ఆ పాపను కన్నతల్లి చెత్త కుప్పలో పారేస్తే కుక్కలు ముక్కును కొరికేశాయి. కొనప్రాణంతో ఉన్న రూపను కాపాడి పెంచారు. ఇప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమగా దత్తత తీసుకోవడానికి వచ్చింది క్రిస్టిన్‌. ‘ఈ పాపకు కూడా ఒక కుటుంబం ఉండే హక్కు ఉంది’ అందామె. ‘పాపకు తగిన వయసు వచ్చాక అమెరికాలో ముక్కుకు సర్జరీ చేయిస్తాను’ అని కూడా అంది. ఆమె గొప్పతనానికి అందరూ తల వొంచి నమస్కరించారు. రూపకు ఒక గొప్ప తల్లి దొరికింది.
 

2013.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని సిన్‌సినాటీలో సెకండరీ టీచర్‌గా పని చేస్తున్న క్రిస్టిన్‌ గ్రేకు 39 ఏళ్లు వచ్చాయి. జీవితంలో తారసపడిన మగవారు ఎవరూ ఆమెకు పెళ్ళి బంధంలోకి వెళ్లదగ్గ గట్టివాళ్లుగా కనిపించలేదు. ‘నేను నా శేషజీవితాన్ని ఒంటరిగా గడపదలుచుకున్నాను’ అని నిర్ణయం తీసుకుందామె. జీవించడానికి కావలసినవి ఆమె వద్ద ఉన్నాయి– మాతృత్వ భావన తప్ప. ‘అమ్మను కాలేకపోయాను కదా’ అనుకుంది. కొన్నాళ్లు ఆలోచించాక ‘నేనే కనాలా? ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు. వారిని దత్తత తీసుకుంటాను’ అని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆమె అన్వేషణ మొదలైంది. మొదట నేపాల్‌ నుంచి తీసుకోవడానికి బోలెడు డబ్బు ఖర్చు పెట్టింది. తీరా అడాప్ట్‌ చేసుకునే సమయానికి అమెరికాలో నిబంధన వచ్చింది– నేపాల్‌ నుంచి దత్తత తీసుకోరాదని. ఆ తర్వాత ఆమె ఇండియాను ఎంచుకుంది. రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఇక్కడి దత్తత ఏజెన్సీ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. ‘పాప ఉంది. అయితే ఆమెకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. తీసుకుంటారా?’ అని. ఆ పాప పేరు మున్నీ. వెంటనే సంతోషంతో క్రిస్టిన్‌ అంగీకరించింది. కాని తండ్రి ‘ఆ తీసుకునేదేదో మన దేశంలోని తెల్లమ్మాయిని తీసుకోవచ్చు కదా’ అన్నాడు. క్రిస్టిన్‌ ఆ మాటకు నొచ్చుకుంది. తండ్రి సర్దుకున్నాడు. అంతే కాదు మున్నీని అమెరికా తీసుకురావడంలో కావలసిన ధన సహాయం చేస్తూ ‘మున్నీ గ్రే’ కోసం అని చెక్‌ రాసి ఇచ్చాడు. అలా క్రిస్టిన్‌ జీవితంలో మొదటిసారి అమ్మ అయ్యింది.

రెండేళ్లు గడిచాయి. మళ్లీ భారత్‌ నుంచి ఫోన్‌ వచ్చింది– ముక్కు లేని అమ్మాయి ఉంది తీసుకుంటారా అని. ముక్కు లేకపోతే పాప పాప కాకుండా పోతుందా... నేను అమ్మనవుతాను అంది క్రిస్టిన్‌. అలా రూప ఆమె జీవితంలోకి వచ్చింది. కాని రూప కొన్నాళ్ల పాటు రోజంతా ఏడుస్తూ ఉండేది. అప్పటికే దత్తతకు వచ్చిన మున్నీకి, రూపకు అసలు పడేది కాదు. ‘రూపను దత్తత తీసుకుని తప్పు చేశానా?’ అని అనుకుంది క్రిస్టిన్‌. కాని ఒకరోజు హటాత్తుగా మున్ని,రూప బెలూన్‌తో ఆడుకోవడం మొదలెట్టారు. క్రిస్టిన్‌ కన్నతల్లి వారితో జతయ్యింది. సంతోషాలు క్రిస్టిన్‌ జీవితంలో మొదలయ్యాయి.

మన దేశంలో అనాథలకు కొదవలేదు. కని వదిలిపెట్టేవారు, ఇళ్ల నుంచి పారిపోయేవారు, భిక్షాటన కోసం ఎత్తుకు రాబడ్డవాళ్ళు, అయినవారిని కోల్పోయిన వారు... అలా మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు... దత్తత తీసుకుంటారా అంటే సరే అంది క్రిస్టిన్‌. మోహిని, సోనాలి ఆమె జీవితంలోకి వచ్చారు. ‘ఇప్పుడు నా కుటుంబం నిజంగానే కొంచెం పెద్దదయ్యింది’ అంది క్రిస్టిన్‌. అప్పటికే స్కూల్‌ జీతం చాలదని రియల్‌ ఎస్టేట్‌లో దిగిన క్రిస్టిన్‌ తన పిల్లల కోసం ఎక్కువ సంపాదించడానికి కావలసిన పనులన్నీ చేయసాగింది. నలుగురు ఆడపిల్లల తల్లి తను. ఎంత ఖర్చు ఉంటుంది. ‘నేను ఇంట్లో నుంచి ఒక్క క్షణం బయటకు వెళ్లడానికి ఇష్టపడను. నా పని కంప్యూటర్‌ మీదే చేస్తాను. నా సమయం అంతా ఆ నలుగురు పిల్లల నవ్వుల్ని, కొట్లాటల్ని చూడటమే సరిపోతుంది’ అంటుంది క్రిస్టిన్‌.

ఇంతవరకు కూడా ఆమె సగటు స్త్రీ అనే అనుకోవచ్చు. కాని ఆమెకు డౌన్‌ సిండ్రోమ్‌ ఉన్న అనాథ అమ్మాయిల పరిస్థితి ఏమిటి... అలాంటి ఒక అమ్మాయిని దత్తత తీసుకుందాం అని ఎంచి మరీ డౌన్‌ సిండ్రోమ్‌ ఉన్న అమ్మాయిని 2020లో అమెరికా తెచ్చుకుంది. ఐదుగురు పిల్లల తల్లి క్రిస్టిన్‌ ఇప్పుడు. అమ్మల్ని మించిన అమ్మ.
సంతోషంగా జీవించాలని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఆ సంతోషం కోసం కొందరు పిల్లల్ని వద్దు అనుకుంటుంటే క్రిస్టిన్‌లాంటి వాళ్లు తమకు పుట్టకపోయినా పిల్లలు కావాలనుకుంటున్నారు.

జీవితం అర్థవంతం చేసుకోవడం ఇలాంటి వారి వల్లే అవుతుంది. వెల్‌డన్‌ క్రిస్టిన్‌.
  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు