వైల్డ్‌ ఇన్నొవేటర్‌ అడవి కూన

4 May, 2021 00:26 IST|Sakshi
కృతి కారంత్, వైల్డ్‌ లైఫ్‌ సైంటిస్ట్‌

అడవిలో జాడలైన వాళ్లకు, అన్వేషణలో అడుగులు వీడని వాళ్లకు ‘వైల్డ్‌ ఇన్నొవేటర్‌ అవార్డు’ వస్తుంది! వన్య పరిశోధకుల వినూత్న దృష్టికి గొప్ప అభినందన వంటి ఈ అంతర్జాతీయ అవార్డుకు తొలిసారి ఒక భారతీయ మహిళ ఎంపికయ్యారు. యు.ఎస్‌. నుంచి ముగ్గురు, కెన్యా నుంచి ఇద్దరు, యు.కె., ఆస్ట్రేలియా కొలంబియా, మొజాంబిక్‌ నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును గెలుపొందగా.. ఇండియా నుంచి డాక్టర్‌ కృతి కారంత్‌ విజేత అయ్యారు. బహుమతి 75 లక్షల రూపాయలు. గౌరవం గగనమంత. విలువ భూగోళమంత. కృతి మాత్రం పుట్టినప్పటి నుంచీ అడవి కూనే!

అరణ్యంలో వృక్షాలెన్నో, కృతి కెరీర్‌లో అవార్డులు అన్ని. అయితే ఇప్పుడొచ్చింది ప్రత్యేకమైన అవార్డు. ఒక విలక్షణమైన వృక్షంతో పోల్చదగిన  పురస్కారం. యు.ఎస్‌. లోని ‘వైల్డ్‌ ఎలిమెంట్స్‌ ఫౌండేషన్‌’ ఈ అవార్డు ఇస్తుంది. బెంగళూరులోని ‘సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ స్టడీస్‌’ (సి.డబ్లు్య.ఎస్‌.)లో కృతి చీఫ్‌ కన్సర్వేషన్‌ సైంటిస్ట్‌. వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి, పరిశోధించి వాటి సంరక్షణకు వినూత్న విధానాలను కనిపెడుతుంటే శాస్త్రవేత్త. 42 ఏళ్ల కృతి ఎప్పటికప్పుడు అప్పుడే కొత్తగా అడవిని, అడవిలో పులులు, సింహాలను చూస్తున్నంత ఉల్లాసంగా ఉంటారు.

నిజానికి ఆమె తనకు ఊహ తెలుస్తున్నప్పుడే అరణ్యమార్గంలోకి వచ్చేశారు! నాగర్హోల్‌ నేషనల్‌ పార్క్‌లో ఒక సాయంత్రం తాతగారి తెల్ల అంబాసిడర్‌ కారులో తండ్రి పక్కన కూర్చొని మెల్లిగా వెళుతున్నప్పుడు ఒక కందకంలో పులి ఆ చిన్నారి కంట పడింది. ఆ కొద్దిసేపటికే చిరుత దర్శనమిచ్చింది. ‘‘నాకది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అంటారు కృతి. క్రమంగా కర్ణాటక లోని అటవీ ప్రాంతాలన్నీ ఆమె ఆట మైదానాలు అయ్యాయి. అందుకు తగిన కారణమే ఉంది. తండ్రి డాక్టర్‌ ఉల్లాస్‌.. టైగర్‌ బయాలజిస్ట్‌! తాతగారు డాక్టర్‌ శివరామ్‌ కారంత్‌ ప్రసిద్ధ రచయిత, పర్యావరణవేత్త.

అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల వారితో కలిసి కృతి వన్య జీవన అధ్యయనం

తర్వాతి కాలంలో జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత. ప్రకృతిని ప్రేమించే ఇద్దరు వ్యక్తుల దగ్గర పెరిగిన అమ్మాయి ప్రకృతినే కదా ప్రేమిస్తుంది. అయితే వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త అవుతానని అప్పుడు ఆమెక్కూడా తెలీదు. తల్లిలా, తండ్రిలా, తాతయ్యలా పీహెచ్‌డీ చేయాలని మాత్రమే అనుకుంది. నార్త్‌ కరోలీనా వెళ్లి అక్కడి డ్యూక్‌ యూనివర్శిటీలో పర్యావరణంపై పీహెచ్‌.డీ చేశారు కృతి. ఆ ముందు వరకు, ఆ తర్వాతా ఆమె చదివిన చదువులు, జరిపిన పరిశోధనలు, చేసిన ఉద్యోగాలు.. దేశంలో, విదేశాల్లో.. అన్నీ కూడా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినవే. చివరికి తను పుట్టిన రాష్ట్రంలోనే పెద్ద సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ అవార్డు!

2011లో ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వాళ్ల రిసెర్చ్‌ గ్రాంట్‌ రావడం, తర్వాతి ఏడాదే ‘ఎమర్జింగ్‌ ఎక్స్‌ప్లోరర్‌’గా గుర్తింపు పొందడం కృతి కెరీర్‌ని విస్తృతం చేశాయి. పది దేశాలు తిరిగి, పది సంస్కృతుల మనుషులతో కలిసిమెలిసి తిరగడం సాధ్యం అయింది. సాధారణంగా సైంటిస్టులు మనుషులతో కలవడానికి ఇష్టపడరు. కృతి మాత్రం ఎక్కడి మనుషులతో అక్కడి మనిషిలా కలిసిపోయారు. కర్ణాటక అరణ్య ప్రాంతాల చుట్టూ కనీసం రెండు వేల ఇళ్లకైనా వెళ్లి వాళ్లతో మాట్లాడి ఉంటారు కృతి! మాట వరకు పైన పది దేశాలను అన్నాం కానీ.. 40 దేశాలకు పైగానే ఆమె పర్యటించారు. అన్ని దేశాలు తిరిగిన ఆమె ఇండియా మొత్తం తిరగకుండా ఉంటారా! దేశంలోని అభయారణ్యాలన్నిటిలో ఒక అడుగు వేసి వచ్చారు. పరిశోధన అవసరమైన చోట అక్కడే కొన్నాళ్లు నివాసం ఉన్నారు. ఆమె పరిశోధనలు బి.బి.సి.లో, ఇంకా అనేక ప్రసిద్ధ చానళ్లలో సీరీస్‌గా వచ్చాయి.

కృతి రియల్‌ లైఫ్‌ హీరోలు తండ్రి, తాత, తల్లి ప్రతిభ. ఇప్పుడు ఆమె తన కుటుంబంలోని ముగ్గురికి హీరో అయ్యారు. భర్త అవినాశ్‌ సొసలే, ఇద్దరు కూతుళ్లు.. ఆమె సెలవు రోజుల్లో ఆమెతో పాటు అడవిలో విహరించే వన్యప్రాణులు అయిపోతారు! వాళ్లతో పాటు ఇంట్లో నల, బఘీర అనే రెండు పిల్లులు వినిపించీ వినిపించనంతగా మ్యావ్‌ మ్యావ్‌ మంటూ పులుల్లా సోఫాలు ఎక్కి దిగుతుంటాయి. కృతి సాధించిన పరిశోధనల్లో ఒకటి.. ధ్వని, వాయు కాలుష్యాల నుంచి వన్య జీవులను సంరక్షించడం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు