సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...

24 Jul, 2022 00:28 IST|Sakshi

‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక.

కేరళ ఆర్‌.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్‌ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్‌ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు.

ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు.

అలెప్పీ.. ఒరు ప్రేమకథ
గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్‌ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్‌ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్‌ సెంటర్‌. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్‌ సెంటర్‌లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్‌ డే రోజు ఒక గ్రీటింగ్‌ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను.

ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్‌ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది.

గిరి కోచింగ్‌ సెంటర్‌లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్‌ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్‌ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్‌ బస్టాండ్‌లో రూట్‌ నంబర్‌ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు.

2020లో పెళ్లి
2019లో కరోనా లాక్‌డౌన్‌ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్‌ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్‌ 5, 2020న తమ హరిపాద్‌ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్‌ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్‌ ట్రిప్‌ బుక్‌ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌
పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్‌ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్‌ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్‌ నంబర్‌ 220 బస్‌ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి.
 
ఎన్నో హంగులు...
డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్‌తో ఒక మ్యూజిక్‌ సిస్టమ్‌ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్‌ఇడి డిస్‌ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్‌ బస్‌ స్టాండ్‌ నుంచి 220 రూట్‌లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్‌ ట్రిప్‌’ బుక్‌ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్‌లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు.

మరిన్ని వార్తలు