మహిళలు ఇక బస్టాండ్‌లో సేఫ్‌.. కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్ట్‌!

29 Mar, 2021 23:54 IST|Sakshi

‘స్టే సేఫ్‌’... ఇది కేరళ ఆర్టిసీ తాజా ప్రాజెక్ట్‌. మహిళా ప్రయాణికుల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ ను మొదలెట్టింది. సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు... వీరు సేఫ్‌గా ఇక బస్టాండ్‌లలోనే గదులు తీసుకుని ఉండవచ్చు. వీరి కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్‌ ఏసి గదులు తయారవుతున్నాయి. అదీ ప్రయత్నించదగ్గ ధరలకు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్‌ అని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రశంసలు కూడా వస్తున్నాయి. గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలెట్టారు. అక్కడ మహిళలకు అవసరమైన వస్తువులు, చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు ఉండే స్టోర్‌ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు కేటాయించే, నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా ఇది కోవిడ్‌ సమయపు ఆలోచన కూడా అనొచ్చు. కోవిడ్‌ వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కొంచెం తగ్గింది.

స్త్రీలకు తోడు వచ్చే వీలు లేనివారు, లేదా కోవిడ్‌ వల్ల బంధువుల ఇంటికి వెళ్లడం/రానివ్వడం కుదరని వారు ఎక్కడ ఉండాలి? వారి కోసం బస్టాండుల్లోనే గదుల ఆలోచన వచ్చింది. ఇది ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో సందేహం లేదు. హోటళ్ల కంటే ఇవే క్షేమకరం అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్‌ హోటళ్లు కిటకిటలాడొచ్చు. 

మరిన్ని వార్తలు