డాక్టర్‌ పద్మజారెడ్డి.. సామాజికాంశాలే నా నృత్య కళ

27 Jan, 2022 00:24 IST|Sakshi

‘‘ఈ అవార్డు నాకు శివుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. నా కృషిని గుర్తించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా గురువు శోభానాయుడు, మా అమ్మనాన్నల ఆశీస్సులతో ఈ అవార్డు నన్ను వరించిందనుకుంటున్నాను. రానున్న రోజుల్లో నృత్యకళలో మరింతగా కృషి చేయడానికి ఈ అవార్డు నాకు ఊపిరి పోసిందనుకోవాలి.

ఐదు దశాబ్దాలుగా నృత్యమే ప్రాణంగా జీవిస్తున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కంటున్న నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ అవార్డును మా గురువైన శోభా నాయుడు గారికి అంకితం చేస్తున్నాను’’ అన్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్‌ పద్మజారెడ్డి. మంగళవారం ఆమెకు కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు.

‘నేనేం చెప్పాలనుకున్నా నా నృత్యకళ ద్వారానే ప్రదర్శించగలను. సామాజిక సమస్యల పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి శాస్త్రీయ నృత్యం ఎంత ప్రభావ వంతమైన సందేశాన్ని ఇవ్వగలదో నా ప్రదర్శన ద్వారా చూపడమే లక్ష్యం. నా నృత్య కృషి గురించి రాసి, ప్రజలలో మరింత గుర్తింపు తెచ్చిన ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు పద్మజారెడ్డి.

కాకతీయం తెచ్చిన గుర్తింపు
‘తెలంగాణకు ప్రత్యేకమైన నాట్యకళ ‘కాకతీయం’ను నృత్య దృశ్యకావ్యంగా ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించాను. ఇందుకు నృత్యంలోనే కాకుండా కాకతీయుల నాటి వస్త్రధారణకు తగినట్టుగా డ్రెస్సులు, ఆభరణాల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ తరువాయి భాగం కాకతీయం–2 పేరుతో కిందటి నెలలో ప్రదర్శన ఇచ్చాను. వంద మంది మా అకాడమీ విద్యార్థులతో చేసిన ఈ ప్రదర్శన ఎంతోమందిని ఆకట్టుకుంది. తెలంగాణకు ఓ నృత్యరీతి ఉందని తెలియపరచడానికే నేను కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం ప్రధానంగా గుర్తించందనుకుంటున్నాను.

అవగాహనే ప్రధానం
కళలు ఉన్నవే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు కళ్లకు కట్టేలా నృత్యకళ ద్వారా చూపడమే నా ధ్యేయం. నా కళ ద్వారా జనాన్ని జాగృతం చేయడం శివాజ్ఞగా భావిస్తాను. సామాజికాంశాలలో బాలికల గురించిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిదిమేసే దారుణ కృత్యాలను నృత్యం ద్వారా చూపగలిగాను. అలాగే, ఎయిడ్స్‌ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలను చూపాను.  

కుటుంబ ప్రోత్సాహం
మా వారు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి నా ఈ కృషిని వెన్నుదన్నుగా నిలిచి అందించిన ప్రోత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. అటు పుట్టిల్లు, ఇటు అత్తింటివైపు వారిలో ఎవరూ నృత్య కళలో లేరు. చిన్ననాటి నుంచి ఇష్టంతో నేర్చుకున్న కళ పెళ్లి తర్వాతా కొనసాగించాను. మా కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఇందులో భాగం కావాలని అడిగారు. కానీ, నా ధ్యాస, శ్వాస నృత్యమే అని తెలిసి కుటుంబం నాకు అన్ని విధాలా మద్దతునిచ్చింది’’ అంటూ ఇన్నేళ్ల తన కృషిని వివరించారు పద్మజారెడ్డి.

గత నెల 26న ‘కాకతీయం–2 ప్రదర్శన’ సందర్భంగా ‘సాక్షి’ ఫ్యామిలీలో ప్రచురించిన కథనం...

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు